’తెలుగు కావ్యమాల’ పుస్తక పరిచయం

Wednesday, October 21, 2009
By పద్యం.నెట్

“తెలుగు కావ్యమాల” శ్రీ కాటూరి వెంకటేశ్వర రావు గారు సంకలనకర్తగా సాహిత్య అకాడమీవారు వెలువరించిన తెలుగు కవితా సంకలను. ఇది నన్నయ్య నూండి ప్రారంభమై కృష్ణశాస్త్రిగారి వరకు, అంటే షుమారు 11వ శతాబ్దము మొదలుకొని 1955 వరకూ వచ్చిన తెలుగు కవిత్వంలోని మేలైన కవితా ఖండికలను ఏర్చి కూర్చిన సుమహారం. కొండంత తెలుగు కవిత్వాన్ని చక్కగా ప్రతిబింబించే ఒక చిన్న అద్దం ఈ పుస్తకం. ఇందులోని విశేషాలలో ముఖ్యంగా నాకగుపించినవి:

1. శ్రీ కాటూరి వెంకటేశ్వర రావుగారి ముందుమాట
2. ఇందులో పద్య, గద్య, గేయ, వచన కవితా రూపలన్నిటికీ స్థానం కల్పించడంఉ
3. అంతగా ప్రఖ్యాతి పొందని కవుల సొగసైన రచనలు కూడా ఇందులో ఉండడము
4. కవుల వివరాలతోనున్న అనుబంధము
5. కావ్య, కవినామ సూచికలు

ఈ పుస్తకం ఖరీదు Rs120. క్రితం సంవత్సరమే ఐదవ పునర్ముద్రణ జరిగింది.

నాకు వీలు చిక్కినప్పుడల్లా ఇందులో నాకునచ్చిన కొన్ని కొన్ని ఖండికలను పంపించడానికి ప్రయత్నిస్తాను. నిన్న చదువుతుంటే నన్నాకట్టుకున్న కొన్ని పద్యాలు ఈ క్రింద ఇస్తున్నాను. ఇవి దాసు శ్రీరాములు అన్న కవి వ్రాసిన పద్యాలు. ఈ కవి కాలం 1846-1908. స్థానం కృష్ణామండలం. తొలుత ఉపాధ్యాయవృత్తి. పిమ్మట ఏలూరులో వకీలు వృత్తి. ఈ క్రింది పద్యాలు ఇతను వ్రాసిన “తెలుగునాడు” అనే వీధి లోనివి. ఇవి ఆనాటి తెలుగువారిలో
కనిపించే వేషభాషలు, ఆచారవ్యవహారాలను వర్ణించేవి. పాశ్చాత్యనాగరకతా ప్రభావంలో కొట్టుకుపోయిన మన సంస్కృతిలో ఒక ముఖ్యభాగం
మనదైన వేషధారణ. ఆనాటి వేషధారణని గుర్తుకుచేసుకోవడం(తెలుసుకోవడం అనాలేమో!), మన గతించిన సంస్కృతిని ఒక్కసారి తలచుకోవడమే కదా!

స్మార్తులు

మోకాళ్ళుదాటని మొరటుగావంచాల
నందియందనిగోచి యంటదోపి
పిల్లగాలికి దూగియల్లాడు చిన్న నే
రెడుకాయవలె జుత్తు ముడియవైచి
నడునెత్తి పెడచెంప లెడనెడ గాంపింప
దలనొక్క యంగవస్త్రంబు జుట్టి
గీరుగందపురేఖ తీరున నొసటిపై
పసుపక్షతలచుక్క యెసగనునిచి

బెదరిచూచుచు, బెఱవారి కొదిగికొనుచు
జందెపోగులు చిక్కువో జమిరికొనుచు
నోట నొక ఋక్కు ముమ్మాఱు నొక్కియనుచు
శ్రోత్రియక్షితిదేవతాసుతుడు వెడలు.

వైష్ణవులు

చీటికిమాటికి శ్రీమతే రామాను
జాయ నమో యంచు జదువు సొగసు
నిరుపమభక్తిచే బెరుమాళ్ళను ఫిరాట్టు
దిరువడిఘళ్ గొల్చి యెఱగు సొగసు
సారెసారెకు దిరువారాధనంబుల
దిరువాయిమొడి నోట దెలుపు సొగసు
జ్ఞానుల గని ‘యడియే నడియేను దా
సోహామ్మనుచు బల్కునట్టి సొగసు

పరగ బన్నిద్దఱాళ్వార్ల బరమ భక్తి
మించి తిరుమంత్ర మొనర సాయించు సొగసు
పొగడుచో వేయినోళ్ళకు మిగులు గొంత
వైష్ణవ బ్రాహ్మణులదె దైవ ప్రపత్తి

మాధ్వులు

కదు జెల్వమగు బెండకాయబొట్టు మొగాన
దతగంధముద్రాంకితములు మేన
మడతీర్చిన జరీమధిరయోణి బుజాన
వెలగల యుంగరాల్ వ్రేళ్ళపైన
నపరంజివిడికడియము మణిబంధాన
పగడాలసరము చొప్పడు గళాన
బట్టంచుదట్టంపు బలుఠీకు పుట్టాన
మేలుముత్యాలతమ్మెట్లుతోన

దస్త్ర మపసవ్యమున, గలందాను సవ్య
భాగమున నుంచి, కలము చేపట్టి గోవ
కాగితంబులపొతక మ్రోకాల నునిచి
ఫరదు బరపరవ్రాయు వేపారి గంటె!

గోల్కొండ వ్యాపారులు

ఎలమి జీపురువట్టి యిల్లూడ్చునపుడైన
బోనీరు తలజుట్టు పూలమెఱుగు
అసదుగా జలకంబు లాడు వేళలనైన
బోనీరు నునుగొప్పు నూనె మెఱుగు
మడిగట్టి వంట కాల్కడ తేర్చునపుడైన
బోనీరు తొడవుకడాని మెఱుగు
నాయకాలింగనోన్నత సౌఖ్యమందైన
బోనీరు కొంతైన మేని మెఱుగు

తనులతా చారుతా శుచితా విభూష
ణాంచితాంగ విలాసితావాప్తి నతుల
మతుల సుకృతుల కృతచమత్కృతుల గోల
కొండవ్యాపారిసతుల బేర్కొనగ జనదె

శైవులు

కాయము భూతిభూషితము, కర్మము తీక్ష్ణము, దుర్గమంబు
న త్యాయతి, నంతరంగ గుణ మధ్బుతమైన శిలం గరంగగా
జేయు, జగత్తమంబు పస జించు మహామహిమంబు భాను లె
క్కాయను; గంటిరే నివురు గప్పిన నిప్పులు శైవభూసురుల్.

(ఇక్కడ “నివురు గప్పిన నిప్పు” అన్న జాతీయాన్ని, కవి ఎంత సందర్భోచితంగా వాడుకున్నాడో గమనించ వచ్చు!)

గమనిక: ఈ టపా వాస్తవానికి చందస్సు యాహూ గ్రూపులో భైరవభట్ల కామేశ్వరరావు గారు రాసినది. వారి అనుమతితో యూనీకోడీకరించి ఇక్కడ ఉంచుతున్నాం

Tags:

వ్యాఖ్యానించండి

Loading