ఛందస్సు 101 – రెండవభాగము

Monday, November 9, 2009
By పద్యం.నెట్
గమనిక: క్రింద మీరు చదవబోయే టపా సంకా రామక్రిష్ణ గారు surasa.net లో ఇంతకుముందెన్నడో ప్రచురించిన తెలుగు ఛందస్సు – 101 అన్నవ్యాసం లో ఒక భాగము. అసలు వ్యాసాన్ని యూనీకోడీకరించి ఆసక్తి ఉన్నవారు సులభం గా చదువుకోవటానికి వీలుగా ఇక్కడ పునః ప్రచురిస్తున్నాం.
ఈ పరంపరలోని మొదటి టపా:  ఛందస్సు 101 – మొదటి భాగము

వృత్తాలు

ఉత్పలమాల

ఈ వృత్తం నడక ఇలా ఉంటుంది:

తానన తాన తాన తన తానన తానన తాన తాన తా”
|____ యతి మైత్రి ____|  10 వ అక్షరం తో

దీనిని మూడు మూడు అక్షరాలుగా విభజించి గణాలు గుర్తిస్తే

భ        ర         న        భ        భ        ర        వ
U I I    U I  U    I  I  I   U  I I    U I I   U I U     I  U
తానన  తాన తా  న తన  తానన  తానన  తాన తా  న తా

అంటే
ఉత్పలమాల వృత్తంలో “భ ర న భ భ ర వ” గణాలు వస్తాయి 10 వ అక్షరం తో యతి మైత్రి అని చెప్పవచ్చు.

ఉదా:
(దీనిని – మీకు తెలిసిన ఇతర ఉత్పలమాల పద్యాలను – పైన చెప్పిన  నడక తీరులో చదవటం అలవాటు చేసుకొంటే పద్యాలు ఏ వృత్తానికి  చెందినవో గుర్తించటం, పద్యం కంఠస్థం చేయటం, రాయటం సులువవుతుంది)

తొండము నేక దంతమును తోరపు బొజ్జయు వామ హస్తమున్
మెండుగ మ్రోయు గజ్జెలును మెల్లని చూపులు మందహాసమున్
కొండొక గుజ్జు రూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జవై
యుండెడి పార్వతీ తనయ యోయి గణాధిప నీకు మ్రొక్కెదన్

పై పద్యంలో మొదటి పాదాన్ని ఉత్పలమాలకి సూచించిన నడక ప్రకారం కొంచెం విడ దీసి రాస్తే:

తానన   తాన  తాన   నన   తానన  తానన   తాన  తాన   నా
తొండము నేక   దంత మును తోరపు బొజ్జయు వామ హస్త మున్

చూశారా ఈ పద్యంలో పదాల అల్లిక మనం రాసుకున్న నడకకి ఎంత దగ్గరగా ఉందో?!(ఈ పద్యం ఉదాహరణగా తీసుకోవడానికి ఇదొక కారణం!) అన్ని పద్యాల్లో ఇంత దగ్గర కలయిక ఉండకపోవచ్చు. ఈ పద్యంలోనే నాలుగో పాదం చూడండి:

తానన     తాన  తాన  నన    తానన    తానన  తాన   తాన   నా
యుండెడి పార్వ తీత  నయ  యోయిగ  ణాధిప   నీకు  మ్రొక్కె దన్

పదాల విరుపు కొంచెం అసహజంగా ఉంటుంది. అయినా పద్యాల నడక పట్టుబడాలంటే కొంత కాలం పద్యాలని ఇలా చదవక తప్పదు.   నడక కొంత పట్టు చిక్కాక ఇలా విరవకుండానే పద్యాన్ని చదవచ్చు.

ఇంకో గమనించ దగ్గ విశేషం ఏమిటంటే, మనం రాసుకొన్న నడకలో,  రెండో సారి “తానన” వచ్చే ముందు కొంచెం pause వచ్చి “తానన” తాళంలో దెబ్బ లాగా మంచి ఊపుతో వస్తుంది. ఈ తానన లో “తా” యతి స్థానం కావటం యాదృచ్ఛికం కాదు. చెప్పొచ్చేదేమిటంటే పద్యాన్ని మనం రాసుకున్న నడకలో చదివితే యతి స్థానం దానంతటదే తెలుస్తుంది – అక్షరాలు లెక్కేసుకోవలసిన పని లేదు.

ఇప్పుడు formal గా గణవిభజన చేసి చూద్దాం:

భ        ర        న         భ       భ      ర        వ
U I I | U I  U | I I I   |U I I | U I I  |U  I  U| I U
కొండొక గుజ్జు రూపమున కోరిన  విద్యల    కెల్ల   నొజ్జవై

“ద్విత్వం / సం యుక్తం  ముందర అక్షరాలను గురువు చేస్తాయి”  అనే సూత్రం వల్ల “గుజ్జు”, “విద్య”, “కెల్ల”, “నొజ్జ”  లను   “U I” గా గుర్తు పెట్టాము.

ప్రాస అన్ని పాదాలలోనూ బిందు పూర్వక “డ”  సరిపోయింది.

యతి : 1వ అక్షరం “కొం” – “కో” 10వ అక్షరం సరిపోయింది.

చదువరులు అన్ని పాదాలనూ ఇలాగే విభజించి సరి చూసుకోవచ్చు.  నడక ప్రకారం చదువుతూ యతి స్థానాన్ని గుర్తించడం, పద్యంలో అన్ని గణాలూ సరిగా కుదిరిందీ లేనిదీ కనిపెట్టటం సాధన చేయాలి. పద్యంలో అక్కడక్కడా అక్షరాలని వదిలి ఎక్కడ పద్యం నడక తప్పిందీ గుర్తించడం పద్య నడక అలవడటంలో మంచి సాధననిస్తుంది.

చంపకమాల

ఇది ఉత్పలమాలకి సహ-వృత్తం అని చెప్పవచ్చు.  దీనికీ ఉత్పలమాలకీ ఉన్న ఒక్కటే తేడా ఏంటంటే ఉత్పలమాలలోని మొదటి గురువు, చంపకమాలలో రెండు లఘువులవుతుంది.

అంటే   ఉత్పలమాల నడక
తానన తాన తాన తన తాన తానన తాన తాన తా” అయితే
|____ యతి మైత్రి ____|  10 వ అక్షరం తో

చంపకమాల నడక
న నన తాన  తాన  తన తానన తానన తాన తాన తా
|______ యతి మైత్రి ___|  11 వ అక్షరం తో

(షరా: మీకిష్టమైతే దీన్నే “ధిరనన ధీం న  తోం న నన ధీం తక తోం తక ధిక్కు ధిక్కు ధా” అనీ రాసు(నేర్చు)కోవచ్చు)

ఈ నడకను కూడా మూడు మూడు అక్షరాలుగా విభజించి గణాలు గుర్తిస్తే

న       జ         భ        జ        జ        జ       ర
I  I I   I U  I     U I U   I  U I    I U I    I  U I   U I  U
తనన  న తాన  తాన త  న తాన  న తాన  న తాన  తాన నా

టూకీగా చెప్పాలంటే:  చంపకమాల లో 4 పాదాలలోనూ  “న జ భ జ జ జ ర” గణాలు వస్తాయి, 11వ అక్షరంతో యతి మైత్రి.

ఉదా:

అలుగుట యే యెఱుంగని మహా మహితాత్ముడజాత శతృవే
యలిగిన నాడు సాగరములన్నియు నేకము కాక పోవు క
ర్ణులు పదివేవురైన నని నొత్తురు చత్తురు రాజ రాజ నా
పలుకుల విశ్వసింపుము విపన్నుల నార్తుల గావుమెల్లెడన్

(ఇది తిరుపతి వేంకట కవుల “పాండవోద్యోగ విజయాలు” లోనిది. కౌరవ సభలో రాయబార సందర్భంలో కృష్ణుడు ధృతరాష్ట్రునితో చెప్పినది.)

పై పద్యాన్ని చంపకమాలకి చెప్పిన నడకలో చదువుకొని సరిగా ఉన్నదో లేదో  చూసుకోండి. ఆ తరువాత అన్ని పాదాలనూ గణ విభజన చేసి గణాలు సరిపోయాయో లేదో గమనించండి.

ప్రాసాక్షరం : ల (నాలుగు పాదాలలో వరుసగా “లు, లి, లు, లు”)
యతి: (మొదటి అక్షరానికీ 11వ అక్షరానికీ చూస్తే: )
1.  “అ”  — “హా”
2. “య”  — “ల”
ఇవి రెండు కూడా నిజానికి ఒక యతి మైత్రి వర్గానికి చెందినవి కావు. కానీ గమనించి చూస్తే ఇవి రెండూ సంధి వల్ల మారురూపంలో ఉన్న “అ” లు. “యలిగిన” = “య్ + అలిగిన” , “లన్నియు” = “లు + అన్నియు” కాబట్టి యతి మైత్రి  “అ” — “అ” కి సరిపోయింది.
3. “ర్ణు” — “నొ” “ర్ణు” లోని “ణు” గ్రహిస్తే యతి మైత్రి తేలికగా కనిపిస్తుంది. గమనించదగ్గ విషయం ఏమిటంటే “ణ” కి “న” కి మైత్రి కుదరటమే కాక,  వాటిని అంటి ఉన్న అచ్చులు “ఉ” కి “ఒ” కీ కూడా మైత్రి కుదిరింది.
4. “ప” — “ప”

శార్దూలం

దీని నడక:
తానా తానన తాన తాన తననా తానాన తానాన నా
|______ యతి మైత్రి _______|  13 వ అక్షరం

ఇంకో రకంగా రాస్తే:
ద్ధిత్తోం  తక  తోం న  తోం న  ధిరనా ద్ధిక్కు  తద్ధిక్కు తా
|__________ యతి మైత్రి ______|  13 వ అక్షరం

గణ విభజన చేస్తే

మ           స       జ       స        త        త      గ
U U  U     I I  U   I  U I   I  I U    U U I   U U I   U
తానా తా  నన తా  న తాన  తననా  తానాన  తానాన  నా

టూకీగా:  శార్దూలం పద్యం 4 పాదాలలో   “మ స జ స త త గ” అనే గణాలు వస్తాయి. 13వ అక్షరంతో యతి మైత్రి.

ఉదా:
జండాపై కపి రాజు ముందు సిత వాజిశ్రేణినిన్ గూర్చి నే
దండంబున్ గొని దోలు స్యందనము మీదన్ నారి సారించుచున్
గాండీవమ్ము ధరించి ఫల్గుణుడు మూకం జెండు చున్నప్పు డొ
క్కండున్నీ మొర నాలకింపడు కురుక్ష్మా నాథ సంధింపగాన్

(ఈ పద్యం కూడా “పాండవోద్యోగ విజయాలు” లో రాయబార ఘట్టంలోనిదే) దీనిని నడక ననుసరించి చదవటం, గణ విభజన, యతి మైత్రి గుర్తించటం చదువరులకు అభ్యాసం కింద వదిలి పెడుతున్నాను!

ప్రాస విషయంలో మాత్రం రెండు చిన్న విషయాలు సూచిస్తాను.
1. పాదంలో మొదటి అక్షరంలో గనక సున్నా వస్తే, దానికి కూడా ప్రాస నియమం వర్తిస్తుంది. అంటే మొదటి పాదంలో మొదటి అక్షరం గనుక  బిందు పూర్వకమైనదైతే మిగతా మూడు పాదాలలోని మొదటి అక్షరాలు కూడా బిందు యుక్తమైనవే అయి ఉండాలి. (ఈ సూత్రం ఉత్పలమాలకి ఇచ్చిన
ఉదాహరణలో చూడ వచ్చు.)
2. మొదటి పాదంలో ప్రాసాక్షరం గనుక సం యుక్తం, ద్విత్వం, లేక పొడి అక్షరమైతే అన్ని పాదాలలోనూ అలాగే సం యుక్తం , ద్విత్వం, పొడి అక్షరం గానే   ఉండాలి.

మత్తేభం

ఇది శార్దూలానికి “సహ-వృత్తం”. నిజానికి చాలా వృత్తాలు ఇలా జంటగా ఉంటాయి. ఒక దాని మొదటి గురువు రెండో దానిలో రెండు లఘువులవుతుంది.

అందు వల్ల దీని నడక:
ననా తానన తాన తాన తననా తానాన తానాన నా
|________ యతి మైత్రి _____|  14 వ అక్షరం

ఇంకో రకంగా రాస్తే:
క ధిత్తోం  తక  తోం న  తోం న  ధిరనా ద్ధిక్కు  తద్ధిక్కు తా
|____________ యతి మైత్రి ______|  14 వ అక్షరం

గణ విభజన చేస్తే

స        భ        ర          న       మ        య       వ
I U U   U I  I   U I  U     I  I  I   U  U U    I  U U    I  U
తననా  తానన    తాన తా  న తన  నా తానా  న తానా  న నా

టూకీగా:  మత్తేభం పద్యం 4 పాదాలలో   “స భ ర న మ య వ” అనే గణాలు వస్తాయి. 14వ అక్షరంతో యతి మైత్రి.

ఉదా:
అల వైకుంఠ పురంబులో నగరిలో నా మూల సౌధంబు దా
పల మందార వనాతరామృత సరః ప్రాంతేందు కాంతోపలో
త్పల పర్యంక రమా వినోది యగు నాపన్న ః ప్రసన్నుండు వి
హ్వల నాగేంద్రము పాహి పాహి యన గుయ్యాలించి సంరంభియై

(ఈ పద్యం పోతన విరచిత “శ్రీమదాంధ్ర మహాభాగవతం” లోని  గజేంద్ర మోక్షం ఘట్టంలోనిది)

దీనిని నడక ననుసరించి చదవటం, గణ విభజన, యతి మైత్రి  గుర్తించటం చదువరులకు అభ్యాసం కింద వదిలి పెడుతున్నాను!

ఇంకా చాలా రకాల వృత్తాలున్నాయి. కానీ ఇంకో రెండు మాత్రం కొంత ప్రముఖంగా వాడ బడ్డాయి.

ఇవి “మత్తకోకిల” , “తరలము” అనే జంట వృత్తాలు.

మత్తకోకిల నడక చాలా సులభంగా వుంటుంది:
త్త  కోకిల  మత్త   కోకిల త్త కోకిల కోకిలా
తాన తానన తాన తానన తాన తానన తాన తా
|____ యతి మైత్రి ____| 11 వ అక్షరం

దీనిలో గణాలు : “ర స జ జ భ ర”

చదువరులు ఊహించినట్టే “తరలము” నడక
నన తానన తాన తానన తాన తానన తాన తా
|_____ యతి మైత్రి ____|  12 వ అక్షరం
దీనిలో గణాలు : “న భ ర స జ జ గ”

మత్త కోకిల గణాలు రాసి చూస్తే అది యెంత “symmetric” గా ఉందో అర్థమవుతుంది. కొంచెం నేర్పుగా రాస్తే ఈ వృత్తంలో “palindromes” రాయవచ్చు!

వృత్తాల నడక, గణాలు, యతి స్థానం
ఉత్పలమాల తానన తాన తాన తన తానన తానన తాన తాన తా భ ర న భ భ ర వ        10
చంపకమాల న నన తాన తాన తన తానన తానన తాన తాన తా న జ భ జ జ జ ర      11
శార్దూలం తానా తానన తాన తాన తననా తానాన తానాన నా మ స జ స త త గ       13
మత్తేభం ననా తానన తాన తాన తననా తానాన తానాన నా స భ ర న మ య వ    14
మత్తకోకిల తాన తానన తాన తానన తాన తానన తాన తా ర స జ జ భ ర                 11
తరలము నన తానన తాన తానన తాన తానన తాన తా న భ ర స జ జ గ             12

Tags:

వ్యాఖ్యానించండి

Loading