తెలుగు లెంక – శ్రీ తుమ్మల

Thursday, November 26, 2009
By భైరవభట్ల దేవీప్రకాశ్

(42వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా 15-11-2009 తేదీన విజయనగరంలో విజయభావన ఆధ్వర్యంలో జరిగిన సభలో శ్రీమతి భైరవభట్ల దేవీప్రకాశ్ గారి ఉపన్యాస వ్యాసం.)

” ఏ పుణ్య లేశమ్ము నాపాలిదాయెనో

నా పూజ కేలోక నాథుండు పొంగెనో

నీపావనోదరశ్రీ పరంపరలలో

నీ పదార్చకులలో నేనొక్కడనైతి”

అని అన్న, అనుకొన్న మహా కవి శ్రీ తుమ్మల సీతారామ మూర్తి చౌదరి. ‘నీ పదార్చకులలో నేనొక్కడ’ అన్నారు కనుకనే ఆయన ‘తెలుగు లెంక’.

శ్రీ తుమ్మల సీతారామమూర్తిగారు ఆధునికకవులలో పేరెన్నికగన్నవారు. ఇతను 1901 లో జన్మించారు. 1990లో కాలధర్మం చెందారు. తెలుగు రైతు కుటుంబంలో పుట్టిన యీయన ప్రముఖ గాంధేయవాది. సబర్మతీ ఆశ్రమంలో కొంతకాలం గాంధీగారి శిష్యరికం చేసి, మహాత్ముని జీవిత చరిత్రను ‘మహాత్మ కథ’ గా రచించారు. అదే కాక ఆయన ‘ఆత్మార్పణ’, ‘ధర్మజ్యోతి’, ‘శబల’, ‘గీతాదర్శనం’, ‘సర్వోదయ గానం’, ‘ఉదయగానం’, ‘నేను’, ‘తెనుగునీతి’, ‘సమదర్శి’, ‘పైరపంట’, ‘పరిగపంట’, ‘రాష్ట్రగానం’ మొదలైన గ్రంథాలు ఎన్నో రచించారు. అన్నిటిలో బాగా ప్రసిద్ధి పొందిన గ్రంథం ‘రాష్ట్రగానం’.

మహాత్ముని ఆశయాలను ఆచరించి, ప్రచారం చేసిన వ్యక్తి కనుక ఈయన్ని ‘మహాత్ముని ఆస్థానకవి’ అన్నారు. తిక్కన వలె చక్కని చిక్కని తెలుగు నుడికారానికి ప్రాధాన్యాన్ని తన కవితలో నిలపడం వల్ల ‘అభినవ తిక్కన’ అనే బిరుదు వచ్చింది. ఏది ఏమైనప్పటికీ ..

” నీ వాలు జుంటి తేనియ తేటలో, గోస్త

నీ పక్వ రసమో, సుధా పూర్ణమో యౌట

నా పల్కు లీ తీయన నోచి…”

” నీ పదార్చకులలో నేనొక్కడనైతి”

“తెలుగు తల్లీ నీకు జోహారు”

అంటూ ‘తెలుగు లెంక’ అని అనిపించుకోవడమే తనకెంతో ప్రీతి అంటారు శ్రీ తుమ్మల.

తన ‘రాష్ట్రగానం’ కావ్యంలో తెలుగు రాజుల, వీరనారీ మణుల, వివిధరంగాలలోతెలుగు వారి వైభవ ప్రాభవాలని ఎలుగెత్తి చాటుతారు. ఆంధ్రసామ్రాజ్య స్థాపకుడు శ్రీకాకుళాంధ్ర మహావిష్టువు ఆంధ్రుల ఆరాధ్యదైవంగా వెలిశాడు. శ్రీ కాసుల పురుషోత్తమ కవి రచించిన ‘ఆంధ్రనాయక శతకం’ ఇతని గురించే. మగధను శాసించిన శ్రీ ముఖ చక్రవర్తి, ఔత్తరాహుల నదలించిన హాలుడు, ఆంధ్రరాజ్యాన్ని విస్తరింపజేసిన గౌతమీపుత్ర శాతకర్ణి మొదలైన ఆంధ్ర చక్రవర్తులు గాధలును నెమరువేసుకొని నాటి పౌరుషాన్ని నిలబెట్టమని అంటారు శ్రీ తుమ్మల. అంతేకాక, వీర నారీమణులకు కూడా నెలవైనది తెలుగు నేల.

” కలము ఖడ్గము పట్ట గల నేర్పు వడసిన

రెడ్డినాగమ్మ నీబిడ్డయటవె;

జగమగంటిమి నాంధ్ర జగతి పాలించిన

గరిత రుద్రమ్మ నీ కన్నెయటవె

గండికోటను మల్కదండుపై దూకిన

గోవిందమాంబ నీ కూతురటవె

మానంబుకై నిజప్రాణంబు బలియిచ్చు

మల్లాంబ నీదు కుమార్తెయటవె

వీగివచ్చిన హృదయేశు వెక్కిరించి

పోరుకంపిన చాన నీ పుత్రి యటవె

ఎంత తేజస్వినివి తల్లి! ఎరుకలేక

నీ మహత్వంబు తెలియంగలేము గాని!”

కలము, కత్తి పట్టగల నేర్పు గల రెడ్డినాగమ్మ పేరు వినగానే పల్నాటి యుద్ధములో ప్రతినాయకురాలైన నాయకురాలు నాగమ్మ గుర్తుకొస్తుంది. కానీ ఆమె గొప్ప శివభక్తురాలు. వీరశైవమతావలంబి. శివతత్వాన్ని రచియించిన కవయిత్రి. దురదృష్టవశాత్తు ఆమె రచనలు లభించడంలేదు. ఆమె మంత్రాంగాన్ని నెరపగల మహామహిళ. ఖడ్గచాలనంలో నేర్పుగల నారీమణి నాగమ్మ. తెలుగురాణి రాణీరుద్రమ్మ కాకతీయ సామ్రాజ్య సామ్రాజ్ఞి. ఒక స్త్రీ రాజ్యమేలడమా అనే అహంకారంతో ఇంటదాయాదులు, బయట యాదవరాజు మహదేవుడు చెలరేగి చుట్టుముట్టగా, తన భుజబలంతో ఓడించి కటకందాకా శత్రువులను తరిమికొట్టిన రుద్రమదేవి పరాక్రమం మరువలేము. గండికోటను పాలించిన రాణి గోవిందమాంబ అక్బర్ చక్రవర్తిని ఎదిరించిన వీరవనిత. ఆమె బ్రతికినంతకాలం అక్బరు చక్రవర్తి దక్షిణ భారతం వైపు కన్నెత్తి చూడలేదు. అభిమానాన్ని నిలుపుకొందుకు ప్రాణత్యాగం చేసిన అభిమానవతి మల్లమాంబ వీరబొబ్బిలి రాణి. యుద్దరంగం నుండి వెనుదిరిగి వచ్చిన తన భర్త ఖడ్గతిక్కనను

” పగరకు వెన్నిచ్చినచో

నగరే నిను మగతనంపు నాయకులెందున్

ముగురాడువారమైతిమి

వగపేటికి జలకమాడ వచ్చిన చోటన్!”

(ప్రసిద్ధమైన చాటువు)

అని పరిహసించి యుద్ధోన్ముఖుని చేసిన వీరవనిత చానమ్మ.

కేవలం పరిపాలనా దక్షతలోనే కాదు అనేక రంగాలలో ఖ్యాతి గండించారు తెలుగువారు అని తెలుపుతూ

” భారతావని కొజ్జబంతులు పల్కు నా

పస్తంబ ఋషి నీదు పాలుగుడిచె

ఖండఖండాంతర ఖ్యాతుడౌ సిద్ధుండు

నాగార్జునుండు నీ నందనుండు

కైవల్యకల్యాణ ఘంటాపథము గన్న

యోగి వేమన్న నీ యొడిని గులికె

బొందితోనపవర్గ మందిన భక్తుండు

గోపన్న నీముద్దు కొడుకు గుఱ్ఱ

పారతంత్ర్య పిశాచంబుపై కొనంగ

నయనములు విప్పలేక యున్నాము గాని

సుతులు నీవారలతిలోక మతులుగారె

అఖిల సద్గుణ సముపేత ఆంధ్రమాత!”

యజుర్వేద విహితకర్మలను సూత్రీకరించిన ఆపస్తంబ ఋషి తెలుగువాడు. ప్రపంచానికి బౌధ్దమతాన్ని గూర్చిచెప్పిన సిద్ధుడు నాగార్జునాచార్యుడు మనవాడే. మోక్షసాధనకు చిత్తశుద్ధి ప్రధానమని చాటి చెప్పినవాడు యోగి వేమన. వేమన పద్యంరాని తెలుగువాడు ఉండడు. ప్రజల హృదయాలను గెలిచిన ప్రజాకవి అతడు. రామదాసుగా పేరుగాంచిన కంచెర్ల గోపన్న బొందితో పరలోకానికేగిన భక్త శిఖామణి. బానిసత్వంలో చిక్కుకొని (నాడు రాజకీయంగా, నేడు మానసికంగా) తన గొప్పదనాన్ని తెలుసుకోలేకపోతున్నాడు తెలుగువాడు. దానికి కారణం, నాడు ‘రాష్ట్రగానం’లో తుమ్మల వారు చెప్పినది, నేటికికూడా అక్షర సత్యంలా కనులకు కడుతుంది. అది

” పరవేషభాషాసపర్యతారకమౌట

ఆంధ్రత్వమే సగంబడగిపోయె

పరఖడ్గములకు లోబడి జోహారులు వెట్ట

స్వాతంత్ర్యసముపేక్ష జారిపోయె

కులతత్వములు చుట్టుకొని ఈర్షలకు నీడ్వ

యైకమత్యము సర్వమణగిపోయె

అసమర్థతాపంకమందుబ్రుంగుటచేసి

మెట్టవేదాంతముల్ మీరిపోయె

నలగిపోయిన యీనాటి తెలుగుబిడ్డ

కేమిసందేశమిత్తు తల్లీ! తమస్సు

విడుచుచున్నది యిపుడిపుడె రవంత

ఉద్దరింపుము వీని సద్బుద్ధులొసగి!”

‘దిద్దుకోవమ్మ బిడ్డల తెలుగు తల్లి’ అని కరుణశ్రీ అన్నట్లుగ ‘ఉద్దరింపుము వీని సద్భుద్ధులొసగి’ అంటారు తిమ్మల. దేశంలో ఎక్కడా లేనంతగా పరభాషాభిమానం మనకుంది. ఒప్పుకోక తప్పదు. ఈ పద్యం వ్రాసి అర్థ శతాబ్ది పైబడినా మాతృభాషాభిమానం పెంచుకోవడానికి బదులు తెలుగులో మాటాడడమే అనాగరికం అనుకునే స్థాయికి దిగజారాము. తెలుగులో మాటాడితే మెడలో పలకలు వేలాడదీసి శిక్షించే స్థితికి చేరుకున్నాము. అది ఎంత హీనమో, సిగ్గుచేటో ఆలోచించండి. ఆంధ్రత్వం సగం కాదు మూడువంతుల ముప్పాతికాడగిపోలేదా? మృత భాషల జాబితాలో చేరిపోవడంలేదా? స్వాతంత్ర్యం సంపాదించుకొని షష్టిపూర్తి జరిగినా విదేశీ వ్యామోహంలో పడి మన స్వేచ్ఛని మనమే కోల్పోతున్నాం. ఇంక కులతత్వాలు చెలరేగి ఐకమత్యాన్ని చెడగొడుతున్నాయి. పూర్వం కార్తీక వన భోజనాలు మానవ సంఘీభావనకు నిదర్శనంగా సాగేవి. మరి ఇప్పుడు ప్రాంతాలవారిగా, కులాలు, శాఖలు, ఉపశాఖలుగా చీలిపోయి జరుపుకుంటున్నారు. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ ‘ఎక్కడ లోకం చిన్న గదులుగా చీలిపోదో’ అని తన ‘గీతాంజలి’ లో వసుధైక కుటుంబాన్ని కోరుకుంటే, ఇప్పుడు ఒకే మనిషిలోని అవయవాలు తమ గొప్పదనాన్ని చాటుకునేందుకు, ‘కుడిచెయ్యి, ఎడమ చెయ్యి, శిరసు, పాదాలు’ వేటికవే తన్నుకునే విధంగా తయారయ్యాం. అదేవిధంగా లక్ష్యశుద్ధిలో ప్రగతి సాధించాలి కానీ అసమర్థత అనే బురదలో కూరుకుపోయి మెట్టవేదాంతాలు వల్లించ కూడదు. నిన్నటి సంఘటనలు నేటి చరిత్ర. తారీఖుల దస్తావేజులు కావోయి చరిత్రకర్థం అంటాడు శ్రీశ్రీ. గతంలోని పొరపాట్లను సరిదిద్దుకుందుకు చదవాలి చరిత్ర.

తెలుగువారంటే గుండెలో నుండి అభిమానం పొంగుకొస్తుంది తెలుగులెంకకు. అందుకే

” తన విద్య చే లోకమునకొజ్జయైనట్టి

యన్నమభట్టు నాయన్న యనుచు

తనదానధారచే తెనుగుగడ్డను ముంచు

భాస్కరమంత్రి నా బంధువనుచు

తన ప్రజ్ఞచే మన్నుమిను గుప్పిటంబట్టు

ప్రగడ తిమ్మరుసు నా భ్రాతయనుచు

తనగీతిచే జగమ్మునకు జీవము వోయు

త్యాగయ్య నాదు సోదరుడటంచు

విశ్వరంగమ్ముపై రొమ్మువిరిచి నిలిచి

లీలమై పల్కుహక్కు నాకే లభించె

ధన్యతాభాజనంబు గదా మదీయ

జీవితంబని సమ్ముదశ్రీ భజింతు!”

అన్నమభట్టు, భాస్కరమంత్రి, మహామంత్రి తిమ్మరుసు, నాదబ్రహ్మ త్యాగరాజు తన వాళ్ళు అని విశ్వరంగము మీద రొమ్ము విరుచుకుని చెప్పుకునే అవకాశం తెలుగు వాడిగా పుట్టిన తనకు లభించిందని, తన జన్మ ధన్యమయిందని మురిసిపోయారు కనుకనే శ్రీ తుమ్మల అసలైన తెలుగు లెంక అయ్యారు. తెలుగువాళ్ళమని చెప్పుకునేందుకు సిగ్గుపడే వారికి అతనికి ఎంత తేడా!

ఇంతవరకూ ఆంధ్రుల గొప్పతనం గురించి రాష్ట్రగానంలో తుమ్మల వారు వ్యక్తం చేసిన భావాలను తెలుసుకున్నాం. అచ్చమైన తెలుగు రైతుగ, తెనుగు కవిగ అతని కవితా మాధుర్యాన్ని చవి చూడాలంటే, అతని ‘పరిగపంట’ని దర్శించవలసిందే. అందులో తెలుగువారి పెద్దపండుగ ‘మకరసంక్రాంతి’ వర్ణన కనిపిస్తుంది. ఒకప్పుడు ఇది తెలుగువాచకంలో పాఠ్యభాగంగా ఉండేది. “ఛాందసభావలన్నీ ఛందస్సుల బంధించి, ఊర్వశి అందాలు చెప్పి ఊరించి ఉడికించి” అంటూ తెలుగు వాచకాలని వేళాకోళం చేస్తారు కాని, ప్రస్తుత యాంత్రిక యుగంలో మనిషి హృదయస్పందనని మరచి మర మనిషిగా మారిపోతున్నాడు. పెళ్ళిళ్ళు – పేరంటాలు, నోములు-వ్రతాలు, పండగలు-పబ్బాలు అన్నీ వచ్చామా, చూశామా, తిన్నామా, వెళ్ళామా అన్నట్టుగా యాంత్రికంగా సాగుతున్నాయి. మనసు ఆనందపరవశమై, మధురమైన ఊహలతో జీవచైతన్యాన్ని పొందాలంటే సాహిత్యాన్ని తప్పక ఆస్వాదించాలి.

పచ్చని పల్లెసీమల్లో విహరించిన తెలుగు లెంకకు సంక్రాంతి లక్ష్మి ఎలా దర్శనమిచ్చిందో చూడండి

” కొసరి నూరిన పచ్చని పసపు బూతమొగాన

గుమ్మడి పూదుమారమ్మునద్ది

కండరేగడ నార బండి కన్పండువై

పొలుచు మిర్యంపు బండు బొట్టువెట్టి

వలిపెమ్మునకు నొక్క వాసి హెచ్చయినట్టి

నునుమంచు తెలిచీర నూలుకొల్పి

బంతిపూవులకు చేమంతి నెయ్యము గూర్చి

కబరీభరమ్ము చక్కన కుదిర్చి

పంటకళ్ళాలు మును బరాబరులు సేయ

గూడుకట్టిన తెలిమబ్బు గొడుగునీడ

కదలివచ్చెను భాగ్యాల కడలి బోలె

మకరసంక్రాంతి లక్ష్మి హేమంత వీథి!”

పచ్చగా పసుపురాసుకున్న ముఖానికి గుమ్మడిపూల పుప్పొడిలేపనంగా అద్దుకొని, మిరపపండు బొట్టుపెట్టుకొందిట సంక్రాంతి లక్ష్మి. పొగమంచు వంటి చీర కట్టుకుని, బంతులు చేమంతులు కలిపికట్టిన దండను సిగలో తురిమిందట. అటువంటి మాల ధరించిన ఆమె కొప్పు ఎంత గొప్పదోమరి! పంట కళ్ళాలు జయజయ ధ్వానాలు చేస్తుండగా తెల్ల మబ్బు గొడుగు నీడన బయలుదేరిన సంక్రాంతి లక్ష్మి సంపదలు తెచ్చింది. రైతులకు పంట ఇంటికి చేరేది సంక్రాంతికే కదా!

ఆ సంక్రాంతి సంబరాలు యింటింటా ఎలా ఉంటాయో దీనిలో వర్ణిస్తారు. అసలే చలికాలం. ఆపై మకర సంక్రాంతి. మకరధ్వజుని లీలా విలాసం.

” నెలదప్పినట్టి కోడలి చేత నొకయత్త

బోగిపొంగలి పూజ పూర్తి చేసె

పుట్టినింటికి వచ్చినట్టి కూతు గులాబి

చెక్కిళ్ళనొకతల్లి చెనకి పుణికె

మారు వడ్డించెడి మరదలి కెంగేలు

పిసికి వల్దనెనొక్క పెంకి బావ

వంగి ముగ్గులదిద్దు వధువుపై నీర్చల్లె

గదివీడి చనునొక్క గడుసు మగడు

అపుడె వచ్చిన ప్రియుని సోయగము గనుచు

దలుపుచాటున నొక్కపైదలి చమర్చె

మధురమధురానురాగ సామ్రాజ్య పీఠి

జగముకొలువుండె మకరధ్వజంబునెత్తి!”

వంశాభివృద్ధి జరగాలని నెలతప్పిన కోడలిచేత భోగి పొంగలి వండించి, పూజ చేయించిందట ఒక అత్తగారు. పెరటిలో సూర్యునికి ఎదురుగా పిడకల దాలి పేర్చి, కొత్తకుండలో పెసరపప్పు, బియ్యం, కొత్త బెల్లంలో పొంగలి వండించి నైవేద్యం పెడతారు. గరిటె బదులు చెరకు ముక్కతో ఆ పొంగలి కలియ బెడతారు. తొలి పండుగకని పుట్టినింటికి వచ్చిన కూతురిని ‘ఏమైనా విశేషమా?’ అని అడిగి, సిగ్గుతో ఆమె బుగ్గలు గులాబీలు పూయగా చెక్కిలి నిమిరిందట ఒకతల్లి. బావా మరదళ్ళనగానే ఒకరినొకరు అల్లరి చేసి ఏడిపించే హక్కు, అధికారం ఉంటుంది. అందుకే చెయ్యినొక్కి మరీ మారు వద్దని చెప్పాడట కోతి బావ. అదే కొంటె బావ. ఉదయాన్నే ముగ్గులు పెడుతూ కూర్చున్న కొత్త పెళ్ళాము పై చల్లని నీళ్ళు జల్లేడుట ఒక గడుసు మగడు. పండగసమయానికి వచ్చిన వరుని తలుపుచాటునుంచి చూచి పరవసించిందట ఓ కొత్త పెళ్ళి కూతురు. ఎంత మధురిమ నిండిన వాతావరణం అది. ఆ జీవన మాధుర్యాన్ని ఎంతకోల్పోతున్నాం మనం.

అంతే కాక శ్రీతుమ్మల సంక్రాంతి విందు భోజనం కూడా రుచి చూపిస్తారు. ఆ విందు మనము చవి చూద్దాం.

“లేగటి పాలలోగ్రాగి మాగిన తీయ

తీయ కప్పురభోగిపాయసంబు

చవులూరు కరివేప చివురాకుతో గమ

గమలాడు పైర వంకాయ కూర

తరుణ కుస్తుంబరీదళమైత్రిమై నాల్క

త్రుప్పుడుల్చెడు నక్కదోస బజ్జి

క్రొత్త బెల్లపు తోడికోడలై మరగిన

మదురు గుమ్మడిపండు ముదురుపులుసు

జిడ్డుదేరిన వెన్నల గడ్డపెరుగు

గరగరికజారు ముంగారు చెరకు రసము

సంతరించితి విందు భోజనము సేయ

రండు రండని పిలిచె సంక్రమణలక్ష్మి !”

కప్పురభోగి పాయసాన్ని, పైరవంకాయకూరని వండిందట సంక్రమణలక్ష్మి. తెలుగువారి భోజనంలో తప్పనిసరి కూర వంకాయకూర. తెలుగు సాహిత్యంలోనే ఉన్నత స్థానం ఆక్రమించుకుంది. ‘గుత్తివంకాయ కూరోయి బావా’ పాటని పాడకుండా అందా కనకలింగేశ్వరరావుగారిని వేదిక దిగనిచ్చేవారు కారట ప్రేక్షకులు! గుత్తివంకాయ కూర పాటలు చలచిత్రాలలో అనేకం చోటు చేసుకున్నాయి. చాటు పద్యరచయిత వంకాయ కూరకు ఎంతటి ఉన్నత స్థానాన్నిచ్చారో తెలిసినదే.

” వంకాయ వంటి కూరయు

పంకజముఖి సీతవంటి భామామణియున్

శంకరుని వంటి దైవము

లంకాధిపు వంటి వైరి రాజును గలడే!”

(ప్రసిద్ధమైన చాటు పద్యం)

ఇక ఇక్కడ కరివేప చివురాకుతో గమగమలాడే పైర వంకాయకూర తయారు చేసింది సంక్రాంతి లక్ష్మి. అంతే కాదు నాలుక తుప్పు వదిలించేలా లేత కొత్తిమీరతో నక్కదోసబజ్జి కూడ చేసింది. బజ్జి అంటే అరటికాయ, శనగపిండితో చేసే బజ్జీ కాదు. పులుసు పచ్చడిని బజ్జి అంటారు. సంక్రాంతికి గుమ్మడికాయని బద్దలు కొట్టి కూర తియ్యపులుసు చేసుకునే అలవాటు తెలుగు వారిది. దీనికి తోడు గడ్డపెరుగు. ప్రస్తుతం విందు భోజనాలలో పండ్ల రసాలు అందిస్తుంటే సంక్రమణలక్ష్మి అప్పుడే తీసిన చెరకు పానకం అందిస్తోంది. ఈ విందు భోజనం వర్ణనతో మనకి నోరూరిస్తారు. ఈసారి సంక్రాంతికి మనవిందు ఇదే!

అటు చారిత్రకంగా, ఇటు సాహిత్యపరంగా తెనుగుదనాన్ని నింపుకున్న కవి శ్రీ తుమ్మల సీతారామమూర్తి చౌదరిగారు నిజమైన తెలుగులెంక.

“ఆంధ్ర పౌరుషరుషనాజ్యంబు వోసిన

తెలుగుతేజముగద తెలుగు లెంక

కమ్మదనము లొలుకు కర్షకమిత్రుండు

తేనెచిలుకుకైత తెలుగ లెంక!”

(శ్రీమతి బి.హెచ్. దేవీప్రకాశ్)

3 వ్యాఖ్యలు to “తెలుగు లెంక – శ్రీ తుమ్మల”

  1. దేవీ ప్రకాశ్ గారికి, నమస్కారం. విజయ భావన కార్యక్రమంలో తుమ్మల వారి గురించి మీరు యిచ్చిన ప్రసంగం పూర్తి పాఠం చూసాను. చాలాసంతోఫం. మా గురు దేవులు శ్రీ గోపా రావు గారి ఆధ్వర్యంలో జరిగే సభలన్నీ జయప్రదాలే.
    మీ ప్రసంగ పాఠం నన్ను ఎంతగానో అలరించింది. అభినందనలు.

    #45
  2. SRINUTUMMALA

    దేవి ప్రకాశ్ గారు, నమస్కారమండి,
    మన “తెలుగు లెంక” గురుంచి చాలా బాగా చెప్పారు.
    వారు వ్రాసిన గ్రంధాలు ఎక్కడ లభ్యమవుతాయొ చెప్పగలరా

    #46
  3. అమ్మా!
    మా గురుదేవులు శ్రీ గోపాల రావు గారి నిర్వహణలో జరిగే విజయభానా కార్యక్రమాలే కాదు, మరే కార్యక్రమాలైనా అత్యద్భుతంగా జరుగుతాయి.
    మీ ఉపన్యాసాన్ని పద్యం.నెట్ లో చూచాను. చాలా బాగుంది.
    మీకు అభినందనలు.
    మా గురుదేవులకు వందనములు.

    #48

వ్యాఖ్యానించండి

Loading