శ్రీ వేదుల వారి “కాంక్ష”

Wednesday, October 21, 2009
By పద్యం.నెట్

వేదుల సత్యనారాయణ శాస్త్రి గారు రచించిన “కాంక్ష” అన్న పద్య ఖండిక నన్ను చాలా ఆకట్టుకుంది. అందులోని భాష, నదీ ప్రవాహంలా సాగే పద్య శైలి, అన్నిటికన్నా ముఖ్యంగా చక్కని, అద్భుతమైన ముగింపు… ఒహో అనిపించాయి! వీరివి మరేమైనా పద్యములు ఎవరికైనా తెలిస్తే వ్రాయ మనవి.

కాంక్ష
====

ఈ సుమజన్మ మెట్లొ ఘటియిల్లెను నా కొకనాటిపాటిదై
వాసన లీను సోయగము పాయని తీయని పోడుముల్ క్షణం
బో, సగమో విచార పడబో నయినన్ విడివడ్డ నాయెదన్
మోసులువారు నూతన మనోరధ మామనివేడి పొంగులన్.

పేదల రక్తమాంసముల పెంపు వహించి దయా రసామృతా
స్వాద దరిద్రులైన ధనవంతుల పెద్దరికమ్ముకై, మతో
న్మాదము పెంచు దేవునికి మారుగ నిల్చిన రాతిబొమ్మలం
దూదరవోవు పాడుబ్రదు కొక్క నిమేషము సైప నాయెదన్.

నాకు తలంపు లేదు లలనా జనతా కబరీ భరైక భూ
షా కలనన్, సతీ మృదు భుజాంతర తల్ప కుచోపగూహ బి
బ్బోకమునన్, వధూజన కపోల గళఛ్ఛ్రవణా(?) వసంత హే
వాకమునన్ విలాసినుల పాపట చందురు కావిపూతలన్.

కానుకనై ధరాధిపుల కాళ్ళకడం బొరలాడి వాడిపో
లేను, ధరా పరాగపటలీ మలినమ్మగు ద్వారతోరణా
స్థానమునం దురింబడగ జాలను, దోసిటపేరి ఘోర కా
రా నరకమ్మునం దుసురు రాల్పగలేను నిమేష రక్తికై.

తేనెల కోసమై కొదమ తేటులదాటు లొనర్చు నృత్యగీ
తానునయమ్ము గాని, మలయానిలు కౌగిట బుల్కరించు సౌ
ఖ్యానుభవమ్ము గాని, తరు ణారుణ రాగ కదోష్ణు చుంబన
శ్రీ నవకమ్ము గాని, పరితృప్తి యొసంగదు నా కొకింతయున్.

నీచపు దాస్య వృత్తి మననేరని శూరత మాతృదేశ సే
వాచరణమ్మునం దసువు లర్పణ సేసినవారి పార్ధివ
శ్రీ చెలువారుచోట, త దసృగ్ రుచులన్ వికసించి, వాసనల్
వీచుచు రాలి పోవగ వలెం త దుదాత్త సమాధి మృత్తికన్

గమనిక: ఈ టపా వాస్తవానికి చందస్సు యాహూ గ్రూపులో భైరవభట్ల కామేశ్వరరావు గారు రాసినది. వారి అనుమతితో యూనీకోడీకరించి ఇక్కడ ఉంచుతున్నాం

Tags:

వ్యాఖ్యానించండి

Loading