సమస్యలు-అవధాన చక్రవర్తి శ్రీగరికపాటి నరసింహారావుగారి శతావధాన సాహితీక్రతువు – విజయభావన , విజయనగరం

Friday, February 12, 2010
By భైరవభట్ల దేవీప్రకాశ్

విజయభావన సాహితీమిత్ర సమాఖ్య, విజయనగరం వారి ఆధ్వర్యంలో 25,26,27 డిసెంబర్ 2009 తేదీలలో మహాసహస్రావధాని, అవధాన చక్రవర్తి శ్రీ గరికపాటి నరసింహారావుగారు నిర్వహించిన శతావధాన సాహితీక్రతువు లో సమస్యాపూరణ పద్యాలు.

సమస్యలు

1. అష్టావధాని రాంభట్ల పార్వతీశ్వరశర్మ -
మేరీమాత సుతుండు రాముడనియెన్ మేకొంచు సౌమిత్రియే

ఏ రాజన్యునికైన స్వీయ జననీ హ్రీరమ్యమౌ నంకమే
చేరన్ గోరెడు చోటుకాదె విపినశ్రీ కేగుచో ముందుగా
చేరున్ దల్లి నటంచు దానిగని ఆర్చెన్ “వేడగా వచ్చి నా
మేరీ? మాత, సుతుండు రాము” డనియెన్ మేకొంచు సౌమిత్రియే

2. శ్రీ భైరవభట్ల కామేశ్వరరావు -
భూతమ్మగు దాని బ్రీతిమతులై వీక్షించి రద్దేవతల్

శ్రీభూదేవుల కేది యింటి వెలుగై చిద్వేద్యమై హృద్యమై
శోభిల్లున్ సకలాగమాంతపదమై శుద్ధప్రకాశమ్మునై
ఆభీరాంగన అంకమందొదిగె తోయాకాశవాయ్వగ్ని పృ
థ్వీభూతమ్మగు దాని బ్రీతిమతులై వీక్షించి రద్దేవతల్

3. శ్రీ మరడాన శ్రీనివాసరావు -
బ్రతికిన పుత్రునిచ్చెద భవన్మృతపుత్రిక నిమ్ము సోదరీ

అతుకులబొంత జీవితము నందొక పుత్రునిగాంచి యీతడున్
బ్రతుకడటంచు భర్తకిడి భావములోన యశోద కిట్లనెన్
“మృతయగునేమొ నీ దుహిత, ఏమన కంసుని పాలుగాకయున్
బ్రతికిన పుత్రునిచ్చెద, భవన్మృతపుత్రిక నిమ్ము సోదరీ”

4. శ్రీ క్రొవ్విడి శారదా ప్రసాదు -
ఒకడందరి గూల్చి మిగులు నొకడేవురిలో

ప్రకటిత కోపమె బలమై
బక కీచక రాజరాజ వాయుజ మగధా
ప కరీంద్ర బలాఢ్యులలో
ఒకడందరి గూల్చి మిగులు నొకడేవురిలో

5. శ్రీ కె. పి. యన్. పంతులు -
ప్రత్యూహంబగు మీ వధానమునకున్ ప్రారంభమం దిక్కడన్

నిత్యప్రోద్భవ సత్కవిత్వమున వాణిన్ వేణిగా దాల్చి సా
హిత్యక్రీడల యందు దేలి కవితాహేవాకమై నాకమై
సత్యంబుల్ కడు ధీరతన్ బలుకు నో స్వామీ! శుభంబౌను ని
ష్ప్రత్యూహంబగు మీ వధానమునకున్ ప్రారంభమం దిక్కడన్

6. డా|| తాతా వెంకటలక్ష్మి-
మగనిన్ కొట్టిన కాంతయే యగును సమ్మానార్హ లోకంబునన్

జగమందున్ సరసమ్ముగా జరుగు సంసారమ్మె మాన్యమ్మగున్
మగవాడా! మగనాలు ప్రేమమెయి నిన్ మర్దింప దోషమ్మొకో
తగవాడన్ దగదయ్య శయ్యపయినన్ తాంబూల పత్రాన ప్రే
మగ నిన్ కొట్టిన కాంతయే యగును సమ్మానార్హ లోకంబునన్

7. శ్రీ పంతుల దక్షిణామూర్తి ప్రసాద్ -
జనములు నూదగా తనియ సన్నని నాదము పుట్టు మోదమై

తనన తాననా ననన తానన తానన తానతానమై
ఘనమగు వేణునాదము రిగా సరిగా యమునా తరంగిణిన్
వినపడ స్వామి జూచుటకు వేవురు జేరగ మాధురీ ప్రభం
జనములు నూదగా తనియ సన్నని నాదము పుట్టు మోదమై

8. శ్రీ తూట బాబాజీ -
మగవార్కిన్నొక్కటుండున్ మగువలకమరన్ మంచిగన్ రెండునుండున్

జగమందందమ్ము గూర్పన్ సరసము నిలుపన్ సంసృతిన్ రక్షసేయన్
మగవారిన్ స్త్రీలకంటెన్ మరొక విధముగా మాదిరిన్ బ్రహ్మ జేసెన్
వగవంగా దింటిపేరుల్ వరుసగ నరయన్ బస్సులో చోటు జూడన్
మగవార్కిన్నొక్కటుండున్ మగువలకమరన్ మంచిగన్ రెండునుండున్

9. శ్రీ యన్. శ్రీకాంత్ -
తల్లిని పెండ్లియాడి తగు ధర్మము నిల్పెను రాముడిద్ధరన్

చల్లగ పల్లెటూళ్ళ రఘుచంద్రుని పెండిలిసేయ నెంచుచో
ఎల్లరు వచ్చి చూడ మది నిట్లని భావన చేసె నొక్కడున్
మల్లెలు పూయువేళ మధుమాసములో జగమేలు నట్టి మా
తల్లిని పెండ్లియాడి తగు ధర్మము నిల్పెను రాముడిద్ధరన్

10. శ్రీ కె. జి. సోమేశ్వరరావు -
ధనమే శాశ్వతమంచు నెంచు నరుడే ధన్యుండు విశ్వంబునన్

ధనమం దాశను వీడి బోధల సుధా తాత్పర్యమున్ గ్రోలి పా
వనమౌ జీవన భాగ్యమున్ గడపి సేవాధర్మమున్ జేసి బం
ధనముల్ వీడగ దోసపండువలె వానప్రస్థుడౌచున్ తపో
ధనమే శాశ్వతమంచు నెంచు నరుడే ధన్యుండు విశ్వంబునన్

11. శ్రీ కొణిశ హరి -
మునిని గనియె వదలె ముదిత చీర

ముగ్గురమ్మగార్లు ముచ్చటపడినంత
అత్రి యింటి కేగి రా త్రిమూర్తు
లవ్వ! శిశువులైరి ఆశ్చర్యపడి నవ్వు
మునిని గనియె వదలె ముదిత చీర

12. శ్రీ డా|| టి. జి. కృష్ణారావు -
కాట్మండూపుర విఘ్ననాయకుని శృంగారమ్ము విన్నాణమౌ

ఠాట్! మండించెను మీ సమస్య అట కాష్ఠంబయ్యె సామ్రాజ్యమే
కుట్మంబుల్ మసిబుగ్గలయ్యె ప్రజకున్ కూష్మాండ భారమ్ముగా
ఫట్మంచున్ చెడు తీవ్రవాదముల దెబ్బన్ గొట్టి రక్షించుచో
కాట్మండూపుర విఘ్ననాయకుని శృంగారమ్ము విన్నాణమౌ

13. శ్రీ కె. బాబూరావు -
పగలే వెన్నెల కాయు లోకమున సంప్రాప్తించె ధావళ్యముల్

భగవన్నామము చిత్తమందెపుడు సంప్రాప్తించునో నాడు నీ
జగమే శంకరుడౌచు దోచు నిక సాక్షాత్కారమే కల్గుచో
సిగలో వెల్గెడి రేకవెన్నెలలకున్ స్వీయ ద్యుతుల్ తోడుగా
పగలే వెన్నెల కాయు లోకమున సంప్రాప్తించె ధావళ్యముల్

14. శ్రీ పి. వి. రాధాకృష్ణ -
వేదాలారని గణించె విస్మయమందన్

నాదమ్మే వేదమ్మై
పాదము మస్తకము గలుప పంచమ వేదం
బాదిగ సంగీతముతో
వేదాలారని గణించె విస్మయమందన్

15. డా|| పి. టి. జి. రంగాచార్యులు -
పావకుపాలుచేసిరని బావురుమన్నవి బస్సు లెన్నియో

మీవిక మీవిమీవి మరి మీ కలహమ్ముల నాశమందుటల్
భావి మహోదయమ్ములవి భగ్నముగావొకొ ఉద్యమంబిదో!
ఏ విషయమ్ము రేగినను నెవ్వరి కైనను మేము లోకువై
పావకుపాలుచేసిరని బావురుమన్నవి బస్సు లెన్నియో

16. అవధాని కె. చంద్రశేఖర్ -
బకరా లౌదురె ఆంధ్రులెప్పుడును సౌభాగ్యంబు శూన్యంబుగన్

నికరమ్మిచ్చట నీళ్ళు ధాన్యనిధులున్ నిత్యోత్సవంబుల్ సుధీ
ప్రకరంబుల్ ఫలమేమి ముఖ్యనగరంబా మారు ముమ్మాటికిన్
ఎకరాలమ్మిన పెట్టుబళ్ళుడుగగా ఏణమ్ములున్ పావురాల్
బకరా లౌదురె ఆంధ్రులెప్పుడును సౌభాగ్యంబు శూన్యంబుగన్

17. శ్రీ బి. హెచ్. శివరాం -
భవశీర్షము ద్రుంచె రాగ తత్పరమతియై

శివుడే తపమ్ము జేయగ
ద్రవించి వరమిచ్చియు గజరాక్షస గర్భో
ద్భవుడై యిలుసని ఆత్మో
ద్భవశీర్షము ద్రుంచె రాగ తత్పరమతియై

18. శ్రీ ఎ. రాధాప్రసాద్ -
రతి పాదాలకు మ్రొక్కి యీ కవన సామ్రాజ్యమ్ము బాలింపుమీ

అతిలోకమ్మగు భావసంపదలతో వ్యాహారహారాలతో
సతులున్ యవ్వతమున్ పరార్థమతులున్ సంతోషమున్ బొందగా
మతి నూహప్రతిభా ప్రసూన మధు సంభారార్చితానంద భా
రతి పాదాలకు మ్రొక్కి యీ కవన సామ్రాజ్యమ్ము బాలింపుమీ

19. శ్రీ నేతేటి గణేశ్వరరావు -
కృష్ణుని జూచి ఏసు తనకిమ్మని గోరె ఖురాను గ్రంథమున్

ఉష్ణత బాపి సర్వమత యుక్తి సమన్వయ బుద్ధి నేర్పగా
వైష్ణవ క్రైస్తవాంగనల వంశ కిశోరమొకండు ముస్లిమున్
తృష్ణను పెండ్లియాడు నెడ దేవతలెల్లరు వచ్చిరయ్యెడన్
కృష్ణుని జూచి ఏసు తనకిమ్మని గోరె ఖురాను గ్రంథమున్

20. శ్రీ. ఆర్. సత్యం -
ఖరులను చంద్రశేఖరుడు కాళ్ళనుబట్టి నమస్కరించడే

పరులను రెచ్చగొట్టుచు స్వభాష కుభాషగ జూపి యాంధ్రులన్
పొరిపొరి దిట్టుచున్ చెడగు బుద్ధుల దల్లిని చీల్ప జూచుచున్
పరిపరి పొత్తుమార్చి పొరపాట్లొనరించెను భిన్న భిన్న వై
ఖరులను చంద్రశేఖరుడు కాళ్ళనుబట్టి నమస్కరించడే

21. శ్రీ కె. పూజ్యనాథాచారి -
పురుషుడు పెండ్లియాడెనొక పూరుషు నేపున పుత్త్రకామియై

సరసము కాదు చెప్పుట కసాధ్యము గాదిది పూర్వ గాథలన్
విరసమునైన పెండ్లి వినవే శశిరేఖకు లక్ష్మణార్యుకున్
విరుగగ ద్రొక్కె పాదముల భీమ కుమారు డమాయకుండునౌ
పురుషుడు పెండ్లియాడెనొక పూరుషు నేపున పుత్త్రకామియై

22. శ్రీ జి. సన్యాసినాయుడు -
ఉగము పైనున్న లోక రక్షకు గొలుతున్

అ ఉమాహేశ్వరుడిట్లనె
“స ఇనో మంతవ్యయేన సహసా భక్త్యా
స ఉదేతి” యనుచు బ్రోవ పు
ర ఉగము, పైనున్న లోక రక్షకు గొలుతున్

23. శ్రీ సర్వాజోస్యుల గౌరీశంకరశాస్త్రి -
దోగ్ధ్రీ ధేనువు గర్భమందు పులికందుల్ పుట్టె నుగ్రాకృతిన్

ధిగ్ధ్రా ప్రాసము దుష్కరంబగునె ఆంధ్రీమాత గర్భంబునన్
ప్రాగ్ద్రూణంబుల పాశ్చిమాధముల గర్వంబార్పగా సింహముల్
త్వగ్ద్రవ్యుల్ మన ఆంధ్రకేసరులు భాస్వన్మూర్తులై పుట్టరే
దోగ్ధ్రీ ధేనువు గర్భమందు పులికందుల్ పుట్టె నుగ్రాకృతిన్

24. శ్రీ వి. రమణ -
గోవిందుడు క్రైస్తవులకు కులదైవంబౌ

దైవంబగు హిందువులకు
గోవిందుడు, క్రైస్తవులకు కులదైవంబౌ
జీవుడు పరిశుద్ధాత్ముడు
మా వాణియె దైవమగును మా బోంట్లకునున్

25. శ్రీ ఎస్. ఎల్లయ్య -
వానలు లేకనే పసిడిపంటలు రైతులు సంతసింపగన్

తాను పరార్థమై బ్రతుకు ధన్యుడు ముఖ్యుడు రాజశేఖరుం
డే నుతియింప రైతులు గణింపగ బంగరు పాడిపంటలన్
శ్రీనిధులందజేసె తగురీతిగ నిత్తరినాతడున్నచో
వానలు లేకనే పసిడిపంటలు రైతులు సంతసింపగన్

Tags: , , ,

3 వ్యాఖ్యలు to “సమస్యలు-అవధాన చక్రవర్తి శ్రీగరికపాటి నరసింహారావుగారి శతావధాన సాహితీక్రతువు – విజయభావన , విజయనగరం”

  1. ధన్యవాదాలు.

    #50
  2. శ్రమకోర్చి ఇక్కడ అందుబాటులోకి తెచ్చినందులకు ధన్యవాదములండీ

    #51
  3. 7వ పద్యం మొదటి పాదం ఓ మారు చూడండి.

    #62

వ్యాఖ్యానించండి

Loading