వసుచరిత్రవైచిత్రి
విజయభావన, విజయనగరం 356 సభలో ‘వసుచరిత్రవైచిత్రి’ అనే విషయంపై శ్రీ కోటారావుగారి ప్రసంగం జరిగింది. ఆ ఉపన్యాససారం :
వసుచరిత్ర పంచ మహాకావ్యాలలో ఒకటి. అన్నిటికంటే విశిష్టమైనది. ముఖ్యంగా తెలుగువారికి గౌరవం తెచ్చినది. అంతకు ముందు రచనలన్నీ సంస్కృతంనుండి అనువదింపబడినవి. పెద్దనగారి మనుచరిత్ర సైతం మార్కండేయ పురాణం నుండి తీసుకు వ్రాయబడినదే. ఆ రచనలు ఎంత గొప్పగా ఉన్నా, సంస్కృత పండిలులకు ఒక చులకనభావం ఉండేది. తెలుగు కావ్యాలకి స్వతసిద్ధశక్తిలేదనే అభిప్రాయం ఉండేది. అటువంటిది కాలంలో, వసుచరిత్ర కావ్యంలో చూస్తే భారతంలో కేవలం నాలుగైదు పద్యాలుగా ఉన్న కథని తీసుకుని 887 పద్యాలుగా, 6 అధ్యాయాలుగా వ్రాయుట జరిగింది. అటువంటి వసుచరిత్రని మెచ్చుకొని, తరువాత తిరిగి సంస్కృతంలో కి అనువదించారు. ఇది తెలుగు వారు గర్వించదగ్గ విషయం. కాళహస్తి కవి సంస్కృతంలోకి అనువదిస్తే, పేరి సూరి అనే అతడు ఈ కథని సంస్కృతంలో నాటకీకరణ చేశాడు. ఇక అమ్మలత్తాళ్‍వైవన్ అను తమిళకవి తమిళంలోకి, కన్నడబీసుడు అను అతడు కన్నడంలోకి, కావలి వెంకటరామస్వామి ఆంగ్లంలోకి ఈ కావ్యాన్ని అనువదించారు. నిమ్మగడ్డ శ్రీనివాస్ వసుచరిత్ర తెలుగు, సంస్కృత కావ్యాల తులనాత్మక పరిశీలన అనే అంశంపై పి.హెచ్.డి చేశారు. ఇవి తెలుగుకు లభించిన గౌరవంగా భావించాలి.
ఇక కథ విషయానికొస్తే, మూలంలో ఉన్న విషయం చాలాతక్కువ. దేవేంద్రుడంతటి వాడైన వసురాజు ఒకసారి అడవికి వెళ్ళి ముని ఆశ్రమము చూచి నిర్వేదమును పొంది తపస్సు చేసుకొనుచుండగా ఇంద్రుడు వచ్చి ధర్మ పరిపాలన చేయమని చెప్పి, వరంగా దైవత్వము, దివ్య విమానము, మాల, దండము మొదలైనవి ఇచ్చి పంపించును. అక్కడ రాజ్యపాలన చేయుచుండగా, ఆ దాపున పారే శుక్తిమతి అను నదిని కోలాహలుడను పర్వతము కామించి అడ్డుపడగా, ఆమె వసురాజును వేడుకొనును. అతడు తన కాలితో ఆ పర్వతాన్ని తన్ని విసిరివేయును. అయితే కోలాహలుని కలయికచే గర్భవతి యైన శుక్తిమతి తనకు పుట్టిన వసుపధుండనే కుమారుణ్ణి, గిరిక అనే కుమార్తెను వసురాజు కు సమర్పిస్తుంది. వసుపధుణ్ణి సేనాపతిగాను, గిరికను ధర్మపత్నిగా వసురాజు చేసుకుంటాడు. ఇది సంక్షిప్తంగా కథ. ఈ కథని అద్భుతమైన శ్లేషలతో, సంగీత విశేషాలతో రామరాజభూషణుడు ప్రబంధంగా తీర్చాడు. మొదటి పద్యమైన
శ్రీభూపుత్రి వివాహవేళ నిజమంజీరాగ్రరత్న స్వలీ
లాభివ్యక్తి వరాంఘ్రిరేణుభవకన్యాలీల యంచు న్మదిం
దా భావింప శుభక్రమాకలనచే దద్రత్నముం గప్పు సీ
తాభామాపతి ప్రోవుతం దిరుమలేంద్రశ్రీమహారాయనిన్! 1.1
లో సీతా రాముల కల్యాణఘట్టాన్ని వర్ణిస్తూ, పెళ్ళిపీటలమీద కూర్చుని ఉన్న సీత తన కాలి యందెల పై తన ప్రతిబింబాన్ని చూసి, రాముడు వస్తున్నప్పుడు దారిలో అతని పాదధూళిచే రాయి స్త్రీగామారిన విషయాన్ని గుర్తుచేసుకుని, అదేవిధంగా ఇక్కడకూడా తన అందె స్త్రీగా మారిందేమో అని ఊహిస్తుంటే, రాముడు తన బ్రొటనవ్రేలితో ఆమె పాదాన్ని తొక్కు సమయంలో ఆ బింబాన్ని తొలగించాడు అని మొదలు పెట్టాడు. కాలితో రాయిని నొక్కడం అనేది కథలో వసురాజు కోలాహలపర్వతాన్ని కాలితో తన్నడాన్ని సూచిస్తుంది. ఈ విధంగా తొలి పద్యంలో కథను సూచించడం అనేది పూర్వకవులు చేస్తూ ఉంటారు.
ఆ తరువాత కావ్యాలలో చేసే సుకవి వర్ణనను చేస్తూ,
భువిఁ గవితాకన్య బుట్టించె నెవ్వాఁడు బడినాగమము లెల్ల నడపె నెవ్వఁ
డేను నీ వనుమాట లెనయించె నెవ్వాఁడు కోమలపదలీలఁ గూర్చె నెవ్వఁ
డనఘతులాకోటి నలరించె నెవ్వాఁడు నిఖిలగుణంబులు నేర్పె నెవ్వఁ
డినకరసంప్రాప్తి నెసఁగించె నెవ్వాఁడు రహి నించె నర్థగౌరవము నెవ్వఁ
డట్టి వాణీగురుత్వ మహత్త్వ ఖనుల
ఘనులఁ బ్రాచేతస వ్యాస కాళిదాస
దండి భవభూతి మాఘ సత్కవి మయూర
భారవుల భారవుల నాత్మఁ ప్రస్తుతింతు 1.9
అని అంటాడు. ఒక పిల్ల పుట్టిన దగ్గరనుండీ పెంచి పెద్ద చేసే వరకూ జరిగే వన్నీ కవితాకన్యకకు సంస్కృతకవులు ఏ విధంగా చేశారు అన్నదాన్ని, వారి వారి శైలిని, ప్రాచుర్యంలో ఉన్న కథలను ఆధారంగా తీసుకుని చమత్కారంగా వ్రాశాడు. పుట్టించినది వాల్మీకి, ఇక వేదాలను విభజించిన వ్యాసుడు వేదోక్త ధర్మములను జరిపించినవాడు అని రెండు విధాలుగా అర్థం వస్తుంది. ‘త్వమేవాహం నసంశయః’ అని సరస్వతీదేవి కాళిదాసుగూర్చి అన్న కథను ఆధారంగా నీవు నేను అన్న మాటలు నేర్పింది కాళిదాసు గా చెప్పాడు. దండి పదలాలిత్యానికి ప్రసిద్ధుడు గావున అతడు ఆమెకు అడుగులు నేర్పాడని అన్నాడు. అలాగే భవభూతి కవితారూప సరస్వతిని తూచెనన్న గాథ ఆధారంగా ఆ కన్నెను అలంకరించినది భవభూతిగా చెప్పాడు. ‘దండినః పదలాలిత్యం భారవే రర్థగౌరవమ్ ఉపమా కాళిదాసస్య మాఘస్యైతే త్రయోగుణాః’ అని అంటారు కనుక సమస్తగుణములను ఈ కన్నియకు నేర్పినది మాఘుడని అనెను. పాణిగ్రహణము చేయించినది మయూరుడు అని ఒక అర్థమైతే, సూర్యుని పై శతకము వ్రాసిన మయూరుడని వేరొక అర్థము వచ్చునట్లు వ్రాసెను. ఆపై అర్థగౌరవము అనగా ధనాన్ని ఇచ్చి పంపించినది భారవి అని అర్థం వచ్చునట్లుగా సంస్కృత కవులను వర్ణించాడు.
ఇక తెలుగు కవుల వర్ణన కూడా చమత్కారంగా చేశాడు.
మహి మున్వాగనుశాసనుండు సృజియింపం గుండలీంద్రుండు ద
న్మహనీయస్థితిమూల మై నిలువ శ్రీనాథుండు ప్రోవ న్మహా
మహులై సోముఁడు భాస్కరుండు వెలయింపన్ సొంపు వాటించునీ
బహుళాంధ్రోక్తిమయప్రపంచమునఁ దత్ప్రాగల్భ్యమూహించెదన్! 1.10
తెలుగు సాహిత్యాన్ని, ఈ సృష్టితో పోలుస్తూ వాగనుశాసనుడైన నన్నయ్య తెలుగు సాహిత్యాన్ని, ఈ విశ్వాన్ని సరస్వతీపతి అయిన బ్రహ్మ సృష్టిచేశారు అని అన్నాడు. ఆపై కుండలేష్టిచేసి కుండలాలు ధరించిన తిక్కన సోమయాజి, అదేవిధంగా ఆదిశేషుడు దీనికి ఆధారంగా ఉన్నారని చెబుతాడు. శ్రీనాధుడు మహాకవి, అలాగే విష్ణువు పోషించెననీ, సోముడు, భాస్కరుడు ప్రకాశింపచేసినారని రెండు విధాలుగా అర్థం వచ్చేటట్లు వర్ణిస్తాడు.
అలాగే కుకవి నింద చేస్తూ వారి కావ్యాలని వేశ్యలుగా శ్లేషతో వర్ణిస్తాడు.
భావం బెక్కడ లేక వృత్తనియమాపాయంబుఁ జింతింప కెం
దే వర్తించి పరార్థవంచనలచే దీపించి మూర్ఖాళి సం
భావింపం గుకవి ప్రణీతకృత సామాన్యాకృతిం బూని పై
పైవన్నె ల్పచరింప దానిఁ దిలకింపం బోరు ధీరోత్తముల్! 1.11
అటుపై తిరుమలరాయలు తనను కావ్యము వ్రాయమని కోరడాన్ని చెప్పే పద్యంద్వారా, అతను రోజుకొక ప్రబంధం వ్రాయగల దక్షత యున్నవాడని. సంగీతకళారహస్యనిధి యని తెలియవచ్చు
నను శ్రీరామపదారవిందభజనానందున్ జగత్ప్రాణనం
దనకారుణ్యకటాక్షలబ్ధకవితాధారాసుధారాశిసం
జనితైకైకదినప్రబంధఘటికాసద్యశ్శతగ్రంథక
ల్పను సంగీతకళారహస్యనిధిఁ బిల్వం బంచి పల్కెం గృపన్. 1.16
అదేవిధంగా తన రచన ఏ విధంగా ఉంటుందో వివరించాడు.
కేవలకల్పనాకథలు కృత్రిమరత్నము లాద్యసత్కథ
ల్వావిరిపుట్టురత్నము లవారితసత్కవికల్పనావిభూ
షావహపూర్వవృత్తములు సానలఁ దీరినజాతిరత్నముల్
గావున నిట్టిమిశ్రకథగా నొనరింపుము నేర్పుపెంపునన్! 1.19
ఇక కథలోకివస్తే విదూషకుడు వసురాజును వనవిహారానికి తీసుకుని వస్తాడు. అక్కడ మబ్బులలో ఉన్న చెట్లను చూపించి. అవి దేవతా వృక్షాలు అని అంటాడు. అప్పుడు వసురాజు వాటిని గమనించి
అన విని నవ్వి సూక్ష్మగతి నారసి యారసికావతంసుఁ డి
ట్లను మనకేళిశైల మది యల్లది తన్మఘవాశ్మకూట మ
మ్మనికిమహీజము ల్చదలు మ్రాకు లటంచు భ్రమించి పల్కె దై
వను మృష గాదు నీపలుకు నాకనగంబులె తద్ద్రుమావళుల్ 2.4
అటుపై అక్కడి చంద్రకాంత శిలావేదిక పై కూర్చుంటే ఎక్కడినుండో శ్రావ్యమైన గానం, వీణానాదం వినిపిస్తుంది. అక్కడ చక్కని అనుప్రాసతో పద్యాన్ని నడిపిస్తాడు రామరాజభూషణుడు.
వీనులవిందై యమృతపు సోనలపొందై యమందసుమచలదళినీ
గానముక్రందై యాస్వన మానందబ్రహ్మమైన నధిపతి పల్కెన్ 2.14
ఆ గానాన్ని విని తన్మయత్వము చెంది, ఎవరో తెలుసుకు రమ్మని విదూషకుణ్ణి పంపిస్తాడు వసురాజు.
నానాగాయనగాయనీమణులగానం బుర్వి నాలింపమో
నానాఁటన్ నగభేదివీట గల గన్ధర్వాప్సరోగీతవి
ద్యానైపుణ్యము లెన్నియేని వినమో యం దైన నిం దైన విం
దై నాదం బొనగూర్చునే మదికిని ట్లానందసందోహమున్! 2.16
ఆ విదూషకుడు..
తరువులపొంతఁ బొంచి నసుధావరమిత్రుఁడు గాంచె నచ్చటం
దరుణిఁ దమోవినీలకచ దామరసోదరసోదరప్రభం
దరళవిలోచనం దతనితంబఁ దటిన్నిభగాత్రవల్ల రిం
దరుణశశాంకఫాల నొక తన్వి దరంగవళిం దలోదరిన్! 2.25
ఇక్కడ మొత్తం పది తకారాలు ప్రయోగించాడు! వర్ణనలలో శ్లేషలు లేనిచోట్ల ఇలాంటి గమ్మత్తులు ప్రయోగింస్తాడు. అక్కడ విదూషకుడు గిరిక మొదలైనవారిని చూచి, వసురాజుదగ్గరకు వచ్చి అద్భుతం, మాటలు రావని అంటూనే ఆమె యొక్క అందాన్ని నఖశిఖపర్యంతం వర్ణించి చెబుతాడు. ఉదాహరణకు
సతియూరుద్యుతిఁ జెందఁ బూని నిజదుశ్చర్మాపనోదక్రియా
రతిఁ బాథోలవపూరితోదరము లై రంభేభహస్తంబు లు
న్న తరిన్ నీడె మరుద్విభూతి గదళి న్ద్వగ్దోష మాచంచలో
ద్ధతశుండాతతిఁ బాయ దయ్యె నదె వో తద్వైరమూలం బిలన్ ! 2.37
ఏనుగు తొండంతో అరటి చెట్టు కాండమును పట్టి లాగివేయుట ప్రకృతిలో సాధారణముగా జరిగేదే. ఆ విషయాన్ని తీసుకుని చిన్న కథ కల్పించాడు. తొడలను వర్ణించేటప్పుడు, వాటిని అరటి కాండములతో, ఏనుగుతొండముతో పోలుస్తారు. అయితే ఇక్కడ ఆరెండూ ( ఏనుగు తొండం అరటి చెట్టు కాండం), గిరికాదేవి తొడలయొక్క సౌకుమార్యం, నునుపుదనం రావాలని నీటిని మాత్రమే తీసుకుంటూ తపస్సు చేశాయట. ఇక్కడ నీటినిమాత్రమే తీసుకుంటూ అన్నది కూడా సార్థకంగా ఉపయోగించినదే. అరటికాండానికి ముందు పైన నునుపుగా ఉండకుండా పొరలు పొరలు గా ఉంటుంది. అదేవిధంగా ఏనుగు తొండం గరుకుగా ఉంటుంది. ఇద్దరూ సమానంగా తపస్సు చేసినా అరటి కాండం తపస్సు ఫలించింది. అరటి కాండం పై పొరల కొంతకాలానికి రాలిపోవును! ఏనుగు తొండం యొక్క తపస్సు ఫలించకపోవడానికి కారణం, అరటి కాండంలా అది నిశ్చలంగా ఉండకుండా కదులుతూ ఉండడమే! ఇదికూడా సహజమైన విషయాలే. అప్పటినుండీ ఆ అసూయతో ఏనుగు తొండం అరటికాండాన్ని పట్టి లాగేస్తోందిట!
అదేవిధంగా ముక్కు ని వర్ణిస్తూ ప్రసిద్ధమైన పద్యం..
నానాసూనవితానవాసనల నానందించుసారంగ మే
లా న న్నొల్ల దటంచు గంధఫలి బల్కాఁకం దపం బంది యో
షానాకృతిఁ బూని సర్వసుమనస్సౌరభ్యసంవాస మై
పూనెం బ్రేక్షణమాలికామధుకరీపుంజంబు నిర్వంకలన్! 2.47
అన్నిరకాల పరిమళాలనూ గ్రోలే మగతుమ్మెదలు సంపెంగపూవుపై వ్రాలకపోవడంతో అది తపస్సు చేసి, అన్ని పూల పరిమళాలు వచ్చి చేరే ముక్కై, మగతుమ్మెదల మీది కోపంతో ఆడతుమ్మెదలను అటు ఇటు కట్టిపడేసిందిట(ఆమె కనుబొమలు!).
విదూషకుడు వసురాజుదగ్గరికి రాకముందే గిరిక వసురాజుకు తగిన భార్య అని భావించాడు. అక్కడ రామరాజభూషణుడు ఒక అద్భుతమైన పద్యం చెబుతాడు.
తనకప్పు నెఇకొప్పుననె పూని గౌరీసమాఖ్య మించ జనించి నట్టియార్య
తనచాపలము చూపులనె చూపి సిరులెల్ల కడఁ జల్లవచ్చిన కమలపాణి
తనపాండిమము నవ్వులనె యుంచి గాంధర్వ మవనికిఁ దెచ్చిన హంసయాన
తనయదృశ్యత నడుమనె తాల్చి సాంగయై మొనసిన యతనుసమ్మోహవిద్య
గావలయు నీవెలఁదిదీని కాంతి గుణక
ళాభిరూప్యంబులెరిఁగించి యా మహేశు
నా నగోద్ధారకుని నాప్రజాధినాథు
నా జగన్మోహనుని దెత్తుననుచుఁ జనియె 2.27
పార్వతీదేవి, లక్ష్మీదేవి, సరస్వతీదేవి, సమ్మోహన దేవి, ఈ నలుగురిలోని లోపాలు సవరిస్తే గిరికను చేరుకోగలరని చెబుతూ, ఆలోపాలు ఏ విధంగా గిరికాదేవికి ఉన్నతమైన లక్షణాలుగా ఉన్నాయో చెబుతాడు. పార్వతీ దేవి మేనిలోని నల్లని రంగులేనిచో గిరిక యౌనట. ఆ నలుపు గిరిక కొప్పులో చేరి ప్రకాశించిందిట. అలాగే లక్ష్మి చంచలమైనది కనుక గిరికకు సరిరాదు. ఆ చాంచల్యం గిరిక కన్నులలోని చేరి అందాన్నిచ్చింది. సరస్వతీదేవి తెల్లని తెలుపు. ఆ పాండు వర్ణం గిరిక నవ్వులలో చేరింది. అలాగే రూపేలేని సమ్మోహనాదేవి యొక్క ఆ అదృశ్యత గిరిక నడుమును చేరింది. ఈ విధంగా ఆ నలుగురి లోపాలు ఈమెలో సలక్షణాలుగా మారిపోయాయి. అటువంటి గరికు వసురాజు తగినవాడని భావిస్తూ అదే క్రమంలో వసురాజుని శివునిగా, విష్ణువుగా, బ్రహ్మగా, జగన్మోహనునిగా పోలుస్తాడు. ఈ వర్ణనలు కూడా వసురాజుకు సార్థకములైనవే!
ఆపై వసురాజుదగ్గర గిరికను వర్ణించి, తాను వారిని కలవలేదని, పొదలమాటున ఉండి విన్నానని చెబుతూ,
స్వైరవిహారధీర లగుసారసలోచన లున్న చోటికిన్
భోరున లాతివారు చొరబూనినచో రసభంగ మంచు నేఁ
జేరక పువ్వుఁదీవియల చెంతనె నిల్చి లతాంగిరూపు క
న్నారఁగఁ జూచి వచ్చితి నవాంబురుహాంబక నీకు దెల్పగన్! 2.55
ఈ పద్యంలో ఎన్నో విశేషాలు ఉన్నాయి.
అక్కడ వారి మధ్యకు వెళ్తే రసభంగం జరుగుతుంది అని అనడంలో భావాన్ని పదాలద్వారానే చూపించాడు. వారు సారసలోచనులు కావున రసభంగం అయితే సాలోచనులు అవుతారని చమత్కారాము. ఇక లతాంగి రూపు కన్నారఁగఁ జూచి అనడంలో ఒక విశేషం ఉంది. ఆమె సౌందర్యాన్ని చూచానని ఒక అర్థం అయితే కన్నారఁగ చూడడం ఎందుకంటే, ‘రూపు’ అని రాయలసీమలో అవివాహితులకు మెడలో వేసి ఉంచే బిళ్ళను అంటారు. కనుక విదూషకుడు కన్నారఁగఁ జూచినది ఆమె మెడలోని ఈ చిహ్నాన్ని! ముందు ఆమె కన్యయే అని నిర్ధారించుకోవడాని ఆ బిళ్ళను పరీక్షగా చూచి, ఆపై వసురాజుకు ఆమెను వర్ణించి చెప్పాడు.
ఇక ఇంకొక విశేషం ’నవాంబురుహాంబక’ అనే పదప్రయోగం. వారు సారసలోచనులు ఇతడు నవాంబురుహాంబకుడు కనుక వారితో కలియుట ఉచితమే. అంతేగాక అంబురుట్ అనగా అగ్ని అనే అర్థం కలదు కనుక అంబురుహంబక అనగా అగ్ని కన్నుగా గల శివుడు. అంబురుహాంబక అనగా పుండరీకాక్షుడు విష్ణువు. అంబురుహ +అంబ క అనగా పద్మమును తల్లిగా కలవాడు బ్రహ్మ. చివరగా అంబకమంటే బాణం కనుక అంబురుహాంబకుడనగా పూల బాణాలు గల మన్మథుడు. ఒక్క పదంలో ఇన్ని అర్థాలు ఉన్నాయి. వసురాజుని వర్ణిస్తూ, ఇవి ఈ విధంగా వేయడానికి కారణం ఇరవైమూడు పద్యాల ముందర గిరికను పార్వతి, లక్ష్మీ, సరస్వతి, సమ్మోహన శక్తిగా వర్ణించిన విషయాన్ని గుర్తుంచుకుని, మనకు గుర్తుచేయుటయే! ఆవిధంగా వసురాజు గిరికకు తగినవాడని మరొక్కసారి నిరూపిస్తాడు.
వసుచరిత్రను రామరాజభూషణుడు ఒక దృశ్యకావ్యంగా కుడా చిత్రించాడు. ఉదాహరణకు వసంత వర్ణనను చేస్తూ
లలనాజనాపాంగ వలనావసదనంగ తులనాభికాభంగ దోఃప్రసంగ
మలసానిలవిలోల దళసాసవరసాల ఫలసాదరశుకాల పనవిశాల
మలినీగరుదనీకమలినీకృతధునీకమలినీసుఖితకోకకులవధూక
మతికాంతసలతాంతలతికాంతరనితాంత రతికాంతరణతాంతసుతనుకాంత
మకృతకామోదకురవకావికలవకుల
ముకులసకలవనాంతప్రమోదచలిత
కలితకలకంఠకులకంఠకాకలీవి
భాసురము వొల్చు మధుమాస వాసరంబు ! 1.126
అదేవిధంగా కోలాహల పర్వత వర్ణనను తెలిపే పద్యం
ఒకచాయ ననపాయపిక గేయసముదాయ మొకసీమ నానామయూరనినద
మొకవంక నకలంక మకరాంక హయహేష లొకక్రేవ ననదేవయువతిగీత
మొకచెంత సురకాంతల కరాంతతతనాద మొకదారి నవశారికోదితంబు
లొకయోరఁ బటుచారణకుమారఫణితంబు లొకదండ నలిమండలికలగాన
మొక్కమొగిమ్రోయఁ గదళీగృహోపపన్న
కిన్నరీబృందబృందసంగీతరీతి
నమరుసతివేలకోలాహలములకలిమి
నధిపయీయద్రికోలాహలాఖ్యమొక్కొ!2.7
ఇక విదూషకుడు యతి వేషంలో ప్రవేశించిన ఘట్టంలో,
గంధజయానగీతప్రబంధకలన
నలరి యతి లియ్యమైవచ్చు నరిది మగువ
లార కనుఁగొంటిరేయనునాళివాక్య
మొకటివిననైననిదెవేళయొదవెననుచు2.82
అక్కడ గిరిక, చెలికత్తెలతో సంగీత ప్రబంధముకు సంబంధిచిన విషయాలు మాట్లాడుకుంటూ అందులో వచ్చే యతిగూర్చి ప్రస్తావించగా, ఇదే సమయమని యతిరూపధరుడైన విదూషకుడు నాటకీయంగా ప్రవేశిస్తాడు.
మేలు లతాంగి నీపలుకు మెచ్చితినే యతి వచ్చుజాడ యే
లీల నెరింగి తమ్మ బహుళీకృతచాతురి మించునీవిపం
చీలలితారవామృతము చిత్తము సోఁకినవార లీకళా
శాలినిఁ జూచి దీవెన లొసంగక పోవరు సుమ్ము నావుడున్! 2.82
ఆ యతి వారితో గిరికాదేవి ఎవరని అడుగుతూ
అనుపమభాగ్యలక్షణసమన్విత యీరమణీలలామ యీ
మనసిజరాజరాజ్యరమ మానసవీథిఁ దలంప సింధునం
దన యచలేంద్రనందన యనం గన నయ్యెడి నీలతాంగిపా
వనకులగోత్రభూతి చెలువా చెలువారఁగఁ దెల్పవే యనన్! 2.97
ఇక్కడ చెలువా చెలువారక తెలుపమనుటయేకాక, ఆమెను చూస్తే సింధునందన (లక్ష్మి), అచలేంద్రనందన(పార్వతి) వలె ఉన్నది అని అంటాడు. అయితే నిజానికి ఆమె సింధునందనయే(శుక్తిమతీ నది కుమార్తె), అచలేంద్రనందనయే(కోలాహల పర్వతుని కుమార్తె)! కనుక అవి ఆమెకు సరిగ్గా సరిపోయింది. అందుకే ఆ చెలికత్తలు ఆతను నిజంగా యతి అని పూర్తిగా విశ్వసించి
అనుపమభాగ్యలక్షణ సమన్విత యీరమణీ లలామ యీ
మనసిజరాజరాజ్యరమ మానసవీథిఁ దలంప సింధునం
దన యచలేంద్ర నందన యనం గన నయ్యెడి నంచు నిట్లు పే
ర్కొనియును గ్రమ్మరం దెలియఁ గోరుట కూరిమి పెంపునం గదా 2.98
అని అంటారు. ఆతడు సర్వం తెలిసిన త్రికాలజ్ఞుడైనా, తమపై ప్రేమచే ఈ విధంగా అడిగారని వారు భావించారు. ఆపై ఆమె కథను వివరిస్తారు. కథ ఇక్కడ flash back లోకి వెళ్తుంది. కోలాహల పర్వతుడు శుక్తిమతి దగ్గరకు వెళ్ళినప్పుడు ఆమె ఎదురేగి లోనికి ఆహ్వానిస్తుంది. ఇది ఒక నదిప్రవాహం పర్వతాన్ని తాకి వనుకకు వచ్చిన విధాన్ని సూచిస్తుంది. ఆపై గొప్పవారిని పూజించుటకు నేనెంతదానినని అంటూ ఆ సూక్తిమతి
అతులశైలవతీశతములీనెడుమీకు నాయిచ్చు విమలార్ఘ్యతోయ మెంత
ప్రాలేయనిలయసంభవముఁ గాంచినమీకుఁ బెనఁచి పూదండ లర్పించు టెంత
గోరత్నదోహన గురులక్ష్మిగల మీకు నుపదగామణివర్గ మొసఁగు టెంత
యనఘ యెవ్వారలైనఁ గొండంతవారి
కవనిఁ గొండంతపూజసేయంగఁగలరె
భక్తినే నిచ్చునీపుష్పపత్రతోయ
మాత్రములు గైకొనుటెకాకగోత్రతిలక! 2.122
కొండంతవారికి కొండంత పూజ చేయలేమని సార్థకముగా అంటుంది. తరువాత కోలాహలుడు
పరమామోదముతో విశేషతటినీపద్మాస్యలం గూడి నీ
వరవిందోద్భవుఁ గొల్చి యేగుతరి నీయచ్ఛాచ్ఛభావంబు నీ
సరసత్వంబును నీగభీరతయు నీసర్వంకషప్రౌఢి నీ
పరిపూర్ణత్వము గాంచి మెచ్చి మదిలో భావింతు ని న్నెప్పుడున్! 2.126
ఇది ఒక ప్రక్క నాయిక వర్ణనకూ, ఒక నది వర్ణనకూ తగినట్లుగా ఉంటుంది. అటుపై ఇది ఈనాటి బంధంకాదని కోలాహలుడు బలవంతపెట్టుట, శుక్తిమతి వసురాజుకు విన్నవించుట, వసురాజు వచ్చి కోలాహలుని కాలితో తన్ని వేయుట జరిగును. అటుపిమ్మట ఆమెకు గిరిక జన్మించును. శుక్తిమతి, కోలాహలుడు ఇద్దరికీ గిరిక అంటే చాలా ప్రేమ. నేడు పిల్లలను వివిధ పోటీలలో గెలిపించాలని తల్లిదండ్రులు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారూ. వారి తాపత్రయాన్ని చక్కగా చూపించాడు రామరాజభూషణుడు.
వెలఁదుల్ దానును గూఢరత్నసికతాన్వేషంబుఁ గాంవించుచుం
జెలి బాల్యంబున నిక్కువల్ గనకయుం జే సాచి యాత్మప్రసూ
పులినోర్విన్ మణులెందు నేనిఁ గొని రా బోటుల్ భళీ తల్లి ని
న్గెలిపించెన్ సిరికల్మి నంచు నగుచుం గ్రీడింతు రబ్బాలతోన్. 3.29
నదిఒడ్డున ఇసుక కుప్పలు చేసి అందులో రత్నమున్న కుప్పను గుర్తించి తీసుకునే ఆటలో తల్లి ఆమెకు సహాయం చేస్తోందిట. ఏ కుప్పలో చెయ్యిపెట్టినా రత్నంవచ్చేటట్లు చేస్తోందిట.
గురుసవిధప్రదేశమునఁ గోషలకల్పకపుష్పధూళిచే
ధరసుత బొమ్మరి ల్నిలిపి తన్మృదుపల్లవపాత్రపంక్తిఁ గే
సరములు ఖాద్యము ల్మధురసంబు ఘృతంబు ప్రసూనపుంజ మో
గిరి మని వెట్ట నన్నియు సఖీతతి కట్టివ యౌఁ బ్రియంబునన్! 3.30
ఇక గుజ్జనగుళ్ళు ఆటలో ఆ కోలాహల పర్వత ప్రాంతంలో ఆమె తయారు చేసిన వంటకాలు నిజమైనవిగా మారిపోతున్నాయిట.
గిరిక మీదప్రేమ ఉన్నా శుక్తిమతి, కోలాహలుని మధ్య సంబంధాలు లేవు. అందువల్ల ఒకరు చేసిన అలంకరణలు ఇంకొకరికి నచ్చక తీసివేస్తారు.
పంకజపాణిశంఖపరిభావకకంధరఁ దల్లి యేలకో
సంకులు గట్టె నంచుఁ గులశైలసుతాగ్రణి పాయఁ ద్రోచి ర
త్నాంకితహార ముంప బరువానునొ బిడ్డ కి వేల కర్కశా
లంకృతు లంచు హల్లకకలాపము లుంచు నదీలలామయున్ 3.31
శంఖాలను తిరస్కరించగల అందమైన మెడ గిరికది. అటువంటిది ఆమె మెడలో శంఖాల దండ వేయడం ఏమిటని కోలాహలుడు అది తీసివేసి, మణిహారాన్ని వేస్తాడు. చిన్నపిల్ల అంతబరువు మోయగలదోలేదో ఆలోచించలేదు! వాడు కర్కశుడు అని శుక్తిమతి ఆ మణిహారాన్ని తీసివేసి ఎర్రకలువలదండ వేయును. ఈ విధంగా వారి మధ్య సంబంధాలు ఎటులున్నా గిరికను బాగా పెంచారు. ఈ విధంగా మంజువాణి గిరిక కథ చెప్పగా విని, ఆ కపట యతి
లలనా యీ యెలనాఁగఁ బెండ్లియగు వాలాయంబు చేదిక్షమా
తలనాథుం డిది నమ్మవేని నిజమంత్రప్రౌఢి రప్పింతు నా
నలనాసత్యసమానుఁ జూడు మని పంతం బొప్ప మాయాజపా
కలనాదంభము పూని మౌని దిశ లాకర్ణించి మఝ్ఝా యనన్! 3.44
అని శబ్దం చేయగానే తను రావలిసిన సమయం ఇదే అని అప్పటిదాకా పొదలమాటున ఉన్న వసురాజు
ఇది సంధింపఁగ వేళ యంచు వసురాజేంద్రుండు నీరంధ్రనీ
రదవారప్రతిసీర వెల్వడినతారాభర్తలీలన్ లతా
చ్ఛదసంఛాదికఁ బాసి నిల్చె నెదుటన్ సారంగరాగభ్రమ
న్మదభృంగీరుతివందిమాగధకథామాధుర్యముం దెల్పఁగాన్ 3.45
ఆ పొద దగ్గర ఉన్న మగ తుమ్మెదల ధ్వని వంధిమాగధుకైవారములుగా వినిపిస్తుండగా వసురాజు వచ్చాడట. తుమ్మెద ఝంకారములు సారంగరాగములో వినిపించాయిట. ఆపై గిరిక సిగ్గుతో తెరచాటుగా వెళ్ళడం కల్యాణ వేదిక పైని తెరగా భావన కలిగిస్తుంది.
ఇందాక చూపినట్లు ఈ వసుచరిత్ర నాటకకావ్యంగా తీర్చిదిద్దబడింది. యతి ప్రవేశం, వసురాజు ప్రవేశం లో నాటకీయతతో పాటు. కలహంస పాత్ర ప్రవేశమప్పుడుకూడ ఈ విధంగా జరిపిస్తాడు.
విని కలకాకుఘోష మొదవించుమదాళిని బక్షగౌరవం
బెనయ నదల్చి మంజుగతి నీవనజాతములో మదీయఖే
లనముల కెల్లఁ దో డయి మెలంగఁగ నాకలహంసి రాదకో
జననివయస్య యంచు నగజాత మదిం దలపోయు చున్నెడన్. 3.71
అనగానే ఆ కలహంస పాత్ర ప్రవేశించును.
ఆకలహంసి వచ్చి యచలాత్మజఁ గాంచి కుమారి తాపసా
నీకము నీ కమూల్యశుభనిర్వహణంబు ఘటిల్లఁ గల్పకా
లోకహసూనరాజము లనూనమనూక్తులతో నొసంగినం
గైకొని తల్లి ని న్బిలువఁ గాఁ బనిచెన్ విరు లిచ్చు వేడుకన్! 3.72
కథలో ఆపై వసురాజు, గిరికా వియోగాన్ని పొందడం, మంజువాణి వచ్చి హారం ఇవ్వడం, మణిని ఇవ్వడం, ఇంద్రుడు కోలాహలునికి చెప్పుట, ఘనంగా వివాహం జరుగుట ఉంటాయి. పెళ్ళైన తరువాత సంతోషంతో పాటు అత్తవారింటికి వెళ్ళే బాధలో గిరిక ఉంటే ఓదారుస్తూ తల్లి
తమ్ములఁ బంపుదు న్మణిశతమ్ములఁ బంపుదు రాజహంసపో
తమ్ములఁ బంపుదున్ బరచి తమ్ములఁ గాననదేవతాళిజా
తమ్ములఁ బంపుదున్ ద్రుతగతమ్ముల నేనును సారణీప్రసా
తమ్ముల వత్తు విశ్వవిదితా ముదితా మదితాప మేటికిన్! 6.60
ఈ విధంగా అనే సరికి ఆమె సంతోషంగా వెళ్తుంది. ఇక్కడ అటు నదీ సంబంధమైన విషయాలు, పర్వత సంబంధమైన విషయాలు కూడా చెబుతూ తాను కొండపైనున్న సెలయేళ్ళతో కూడి వస్తాను అని తల్లి అనడం వల్ల, తల్లి తండ్రితో కలిసి వస్తుంది అన్న సూచనను గ్రహించి గిరిక సంతోషిస్తుంది.
ఈ విధంగా రామరాజ భూషణుడు వసుచరిత్రను అనేకమైన చమత్కారాలతో తీర్చిదిద్దాడు.
