దత్తపది -అవధాన చక్రవర్తి శ్రీగరికపాటి నరసింహారావుగారి శతావధాన సాహితీక్రతువు – విజయభావన, విజయనగరం

Saturday, February 20, 2010
By భైరవభట్ల దేవీప్రకాశ్

దత్తపదులు

1. శ్రీమతి బి. హెచ్. దేవీ ప్రకాష్ – వారాయి, నానుని, వందె, నినవు – భారతార్థంలో

వారా యీ భువి నేలువారు! సతులన్ వస్త్రంబులే యూడ్చు వా
రా రాజున్ మురపించినాను నిజ ధైర్యాగారమున్ దాచినా
నా రారాజు శిరమ్ము తన్నుటకు ఖాయంబూరువందే గదన్
బోరింతున్ పరమాత్మసాక్షి యని నవ్వున్ భీముడత్యుగ్రతన్

2. శ్రీమతి పంతుల జయమహేశ్వరి – ఘనము, మనము, ధనము, జనము – భాగవతార్థంలో

శుకుని మహాప్రబోధనము సూనృత వృక్షము లోకరక్షకై
నికరము జేసి నీ మనము నీరజనేత్రునియందు నిల్పు దీ
పిక గొనిజూడు చిద్ఘనము వీథులలో లభియింపబోదు గో
పికలకు చిత్తరంజనము వేదము దాని నిరంజనమ్మనెన్

3. శ్రీ కిలపర్తి దాలినాయుడు – ఎడిసన్, థాంసన్, న్యూటన్, వాట్సన్ – భారతార్థంలో

మనసుంబూని వచించినన్ వినడు దుర్మార్గంబుతో ఏడి సన్
మనమున్ దాల్పని మూర్ఖుడెట్టి కొడుకమ్మా నూటనొక్కొక్కడున్
శనియై శాకున పక్షులైరి వసుధాంశన్ ధార బోయింతురే
రణమందున్ గన వాటసందు లికపై ప్రాణంబులే పందెముల్

4. శ్రీ గుమ్మా రంగారావు -
పద్యము, హృద్యము, గద్యము, మద్యము – పద్య గద్యాల మధ్య భేదం

పరమమనోహరంబయిన పద్యము భావముచేత పూర్ణమౌ
కరము వచఃప్రగల్భతను గద్యముకూడ మనోహరంబునౌ
స్మరుని కళాకలాపమిది మద్యము పద్యము ముందు నిల్చునే
ఇరులను పారద్రోలగల హృద్య మనోహర పద్యమిచ్చెదన్

5. శ్రీ కె. ఎఱ్ఱునాయుడు – చిత్ర, మిత్ర, పుత్ర, గాత్ర – సరస్వతీస్తుతి

వాక్చిత్రమె నీ రూపము
ప్రాక్చైతన్యము సుపుత్రవర్యున కిమ్మా
స్రక్చందన మిత్రాదులు
వాక్చాతురికంటె గాత్రవైభవమిడునా

6. కుమారి ఎల్. సీతామహాలక్ష్మి -
అమ్మ, బొమ్మ, కొమ్మ, రెమ్మ – ఈనాటి రాష్ట్ర పరిస్థితి

అమ్మను పంచుకొందురట ఆంధ్రులతోడి విభేదమంచు పూ
రెమ్మల తేనెలందుకొని రేపును మాపును వృద్ధిజెందకా
కొమ్మనె కూలగొట్టెదరు కూర్చుని యున్నది అద్ది కాదొకో
పొమ్మని బల్కిరేని కనుబొమ్మలు జిమ్ము సమైక్య బాణముల్

7. కుమారి పి. స్వాతి – అలక, గిలక, పిలక, మొలక-  ప్రకృతి వర్ణన

అలకలు మోమునందువలె అవ్విరులందున వ్రాలె తుమ్మెదల్
గిలకలు నేలతల్లి యొడి కేళిని సల్పు ననంటి రూపమై
మొలకలు జూడ శ్రావణము పుష్యమునందునె వచ్చియుండెనో
పిలక బిగించి ఈ ప్రకృతివీథుల బాడుము వేదఘోషలన్

8. శ్రీ ఆర్. పవన్ కుమార్ -
పెద్దన, తిక్కన, ఎర్రన, పోతన – ఆంధ్రావని మానసిక వేదన

పోతన పద్యముల్ వినెద పున్నమి వెన్నెల రాత్రులందునన్
ప్రీతి బఠింతు కావ్యముల పెద్దన నెర్రన తిక్కనార్యునిన్
నేతల బుద్ధిమూలమున నీ రసదృష్టి పరాయిదౌనొకో
ప్రాతని విస్మరించుటనె పాపము బ్రద్దలునయ్యె నిట్టులన్

9. శ్రీమతి బి. విజయభారతి –  బ్రాకెట్, లాకెట్, రాకెట్, క్రికెట్ – బాలకృష్ణుని లీలలు

ప్రాణమువంటి నా సుతుడు రాకెటులుండెనొ ఇంతసేపు నా
ప్రాణములోర్చునొక్కొ ఎటు బ్రాకెటు బోయెనొ కొంగుబంగరై
తానొదుగున్ గదా యొడిని ధర్మశలా కెటు వీడి యుండెదన్
వీనిని విష్ణు డంద్రు మన వీథుల నాడుట చక్రికెట్టులౌ

10. శ్రీ పి. రాజేశ్వరరావు -
అపకారం, ఉపకారం, అధికారం, సహకారం – సమైక్యాంధ్ర

అపకారంబెటు సైచు నా జనని యీ యన్యాయమెట్లోర్చునో
ఉపకారంబుల వృద్ధి జెంది యిది మీ యూరెట్టులౌనన్నచో
లపలప్పా యనబోము మేమె యధికారంబందుకో జూడమే
లపితంబొక్కటి విండు నిండు సహకారంబే సమైక్యాంధ్రమౌ

11. శ్రీ టి. రమణ -
భోగి, రోగి, యోగి, త్యాగి – 2010 యువతకి సందేశం

వచ్చుచునుండె భోగి అట భగ్గున మండగ నిండు దోషముల్
పిచ్చికి లొంగి రోగివలె ప్రేల్చకు డాస్తులుపాస్తులెల్ల కా
వచ్చు శుభంబు మీ చదువు ప్రక్కన బెట్టక యోగి పోలికన్
పచ్చగ నుండుడీ తెలుగువారసులై యొక త్యాగి బిడ్డలై

12. డా|| ఆర్. శశికళ -
శరణం, చరణం, భరణం, తరణం – పైడితల్లమ్మ వారి మహోత్సవం

శరణము నందగోరెదము శాంకరవల్లిని పైడితల్లినిన్
చరణములంటి వేడెదము శాస్త్ర సుధామయి వాఙ్మతల్లి నా
భరణము లామె పాదములు పాదములన్ సిరిమాను మ్రొక్కెదన్
తరణము చేయలేమొకొ వ్యథాభరితమ్ము భవాబ్ధి నిప్పుడే

13. శ్రీ రామోజు చిట్టిబాబు -
బాపూజీ, నేతాజీ, పండితజీ, సరదార్జీ – భారతార్థం

పరమామ్నాయశిఖావతంసుడగు నబ్బా! పూజితుం డియ్యెడన్
తరమా ఆపగ చేదిరాజ్య పృథు నేతా జీవితంబుండునే
పరనిందాసుర పండితాజితుడవై భాగ్యమ్ము గోల్పోవవే
ధరపై కాసరదారు జీవనము వ్యర్థంబౌ హరిన్ గొల్వుమీ

14. శ్రీ బెహరా గణేష్ -
పూసపాటి, పీసపాటి, గోగులపాటి, గరికపాటి – కళారంగం ప్రాశస్త్యం

కళలను పూసపాటియని కాంచకుడయ్య హృదంతరమ్ములన్
కలతలనార్పి స్నేహమయ గానాము నేర్పును పీసపాటిగా
వలపుల కైతలన్ గరికపాటిని జేయును కల్పవాటిగా
నిలుపును నిత్యజీవన మణిద్యుతి గోగులపాటి దివ్వెలన్

15. కుమారి అడిదం శారద -
దశరథీ, శరధీ, రథీ, ధీ – విజయనగర వైభవం

పాండితియందు దాశరథి బాణము వంటిది సత్కవిత్వ ధీ
శౌండులకున్ సుధాశరధి సాహితి గానము గజ్జకట్ట బ్ర
హ్మాండమె ఆదిభట్ల రథియై చెలువొందగ గాన సత్కథా
భాండమునై మధించు కవిభావములో నగరప్రతిష్ఠలన్

16. శ్రీ అయ్యగారి శ్రీనివాసరావు -
కలివిడి, చలిమిడి, పిడికిలి, తిరగలి – సరిహద్దు జవానుల సేవలు

కలివిడిలేని కాపురము కాలుచునుండగ మంచుకొండలన్
చలి మిడిమేలమాడు నెడ చక్కని యూహల నొత్తిగిల్లి వా
రిల బడి ప్రాణముల్ తిరగలిన్ బడగా మన ప్రాణ రక్ష కో
రి లవము హారమై పిడికిలిన్ బిగియింపరె దేశమాతకై

17. శ్రీ కె. వి. జగన్నాథరావు –  ఉప్పు, ఒప్పు, ముప్పు, పప్పు – నిత్య జీవితం

ఉప్పైన దొరకనయ్యెను
ముప్పులు రేయిన్ బవళ్ళు ముంచుచు నుండెను
పప్పుకు శతమానంభవ
ఒప్పులకుప్పప్పులందు నూబిని మునిగెన్

18. శ్రీ బి. రామజోగారావు -
అత్త, మామ, అమ్మ, నాన్న – శివధనుర్భంగం, స్వార్థ త్యాగంతో

అత్తరుణాన రాముని ముఖాబ్జము శైవధనుః ప్రకాశమున్
చిత్తొనరించె జానకికి చేతమునందొక చందమామ లో
హత్తగ పెండ్లిపందిరికి నమ్మధురక్షణ రక్షణమ్ములే
నెత్తిని సేసలయ్యె జననృత్యములయ్యె ఘనాన్నమున్ గొనన్

19. శ్రీ చౌదరి చిట్టన్న -
రామ, భీమ, ప్రేమ, నీమ – నన్ను అవధానిగా స్తుతిస్తూ

రామా మిమ్ముం జూడగ
ప్రేమామృత కందపద్యలీలల నీమా
భీమా, కామా, సోమా
నీమమ్మా పొగడుమనుట నిన్నేమనుటా!

20. శ్రీ యం. పార్వతీశం -
టొమోట, పొటాటో, క్యాబేజి, కారెట్టు – భారతార్థం

మాట మోటయ్యె సంగ్రామ మాటయయ్యె
మోసకారెట్టులయ్యెను పుట్టువుననె
ఆజి వలదన్న చెవుల క్యాబేజి పెట్టె
కత్తిపోటటో యిటొ వచ్చి కావ్యమయ్యె

21. శ్రీ నాగులకొండ సాంబమూర్తి -
దుర్మతి, క్రోధన, రక్తాక్షి, అక్షయ – హిరణ్యాకశిపునికి ప్రహ్లాదుని మీద కోపం, ప్రహ్లాదునికి హరియందలి భక్తి

తనయున్ దుర్మతిగా దలంచి అనునిత్యంబున్ సరోజాక్షునిన్
ప్రణయం బొప్పగ సంస్మరించు నతనిన్ రక్తాక్షుడై చూచెడిన్
జనకక్రోధ నఖంబులన్ హరిపదార్చాపీఠమందుంపగా
తనకై వజ్రనఖుండు వచ్చె కరుణాధర్మంబు లక్షయ్యముల్

22.  శ్రీమతి కె. యన్. యస్. హైమవతి -
గరికి, పాటి, నరసింహ, రావు – రామాయణార్థంలో

గరికయే అడ్డమై కౌశల్యకోడలి
పరువుమర్యాదలు భద్రపరచె
చేపాటి కాల్వగా శ్రీరాము డంబుధిన్
దాటె మననుగూడ దాటజేసె
వానరసింహమ్ము వాయుజుశక్తితో
రావణున్ గూల్చె భద్రమ్ము గూర్చె
మంచి వారావులే యంచు బాధలుబెట్ట
రాముడైనను సమిద్భీడగును
వేదమే రామగాథగ వినుతిజెందె
పుట్టలో బుట్టు సత్కవి పట్టుదేనె
లొల్కజేసెను శ్రీరామ చిల్కలివిగొ
పాడుచున్నవి సీతమ్మ బాధ గాథ

23. శ్రీ డి. కోటారావు -
చేతలు, నేతలు, కోతలు, బూతులు – రాజకీయనాయకుల పనితీరు

చేతలు మారిపోయినవి ఛీయని ఎల్లరు నీసడింపగన్
కోతలు మూడు కాలములకున్ గొనసాగును రాజకీయపు
న్నేతలు కోట్లుమ్రింగుటకు నీతల నాతల నమ్మజూడగా
బూతులు రాజ్యమేల పరిపూతులు జాతిపితల్ క్షమింతురే

24. కుమారి కె. సాంతోషిలక్ష్మి -
గరికి, సరిక, రారిక, మరిక – ప్రస్తుత అవధానం గురించి

గరికిపాటివారు గురిచూడ పద్యమ్ము
తప్పబోదు సరికదా పదాళి
మరిక గనినంత అతని ముద్రయదోచు
సాటిరారిక కవిచంద్రులెవరు

25. శ్రీమతి పి. శిరీషా రఘురాం -
నయనతార, భూమిక, ప్రియమణి, దీపిక – ధనుర్మాసం

దరహసితమ్ములై నయనతారల కాంతులునై ధనుఃప్రభల్
నిరుపమమైన శ్రీప్రియమణిన్ మరపింపగజేయు స్వామికిన్
అరుణమయూఖ భూమికల కా హరికన్నుల కాంతి తోడుగ
న్నరయవె దీపికా పడుకొనన్ సరికాదిక లెమ్ము గోపికా

Tags: , ,

వ్యాఖ్యానించండి

Loading