వర్ణనలు-అవధాన చక్రవర్తి శ్రీగరికపాటి నరసింహారావుగారి శతావధాన సాహితీక్రతువు – విజయభావన, విజయనగరం

Saturday, February 20, 2010
By భైరవభట్ల దేవీప్రకాశ్

వర్ణనలు

1. శ్రీమతి గుమ్మా చంపావతి –  సీతారాముల కల్యాణోత్సవం వశిష్ఠవిశ్వామిత్రుల ఆనందం. చంపకమాలలో.

కలకల నవ్వు మైథిలి ముఖంబును జూచుచు రామచంద్రుడున్
గలగల స్వామి నవ్వుల నెగాదిగ జూచుచు లోకమాతయున్
తలిరుల జేతులందున సుధామయ ముక్తములట్లె యుంచ దో
సిలి గని నవ్వి పల్కెను వశిష్ఠుడు శిష్ట మహార్ష ధర్మముల్

2.  శ్రీ జి. రామయ్య రెడ్డి –  సమైక్యాంధ్ర ఉన్నప్పుడు వైభవం, విడిపోతే విషాదం

కలిసి బ్రతికియున్నన్ కల్పవృక్షంపు నీడన్
తెలుగుజనని నిల్చున్ తీపికైతల్ విదల్చున్
కలతల విడివడన్ కర్మముల్ కాలిపోవున్
తెలుగువెలుగు లారున్ తీవ్రవాదాలు రేగన్

3. శ్రీ దేవరకొండ రామనరసింగరావు –  శ్రీకృష్ణుని అష్టభార్యల సేవలు, సీసంలో

ఒకనారి స్వామివైపొయ్యారముగ జూచు ఒకతె ప్రక్కకుజూచి ఉస్సురనెను
ఒకరు తాంబూలంపు చికురంబు లందించు ఒకరు పండగజేసి ఊయలూచు
ఒక శమంతకమణి ప్రకట కాంతుల జూపు సుదతి నవ్వులతోడ జూరగొనును
భద్ర సుచ్ఛత్రమై పైటకొంగునుబట్టు సకలక్షణమ్ముల సాకునొకతె
అష్టభోగమ్ములే కదా ఆయనకవి
అష్టకష్టాలు మనమెవ్వరిష్టపడిన
కర్మయోగికి సంసారధర్మమేమి
కృష్ణలీలకు వ్యాఖ్యాన మేమి స్వామి

4. శ్రీ బి. హెచ్. కె. బాబూజీ –  దోమలేని భూమిని ఊహిస్తూ

గిలగిలలాడిపోయెదము కేలును కాలును దాచలేక దో
మలు గనరాని సీమ మహిమన్ బ్రకటించెడి స్వర్గసీమ ఈ
ఇలగలదేని పోయెద మదెక్కడ చిక్కెను భామ కౌగిటన్
చలన మొకండు నిశ్చల రసగ్రహణ మ్మొకడింక మందులౌ

5. శ్రీ జి. ఆర్. రాఘవరాజు –  కృష్ణుడు నిర్యాణ సమయంలో ఇచ్చిన సందేశం – మత్తేభంలో

అవతారమ్మును దాల్చినాను భువి నన్యాయంబు నిర్జింపగా
భవబంధమ్ములు పెంచుకొంచు మృదుసంబంధమ్ము దుర్గంధమై
పవలున్ రేలును కొట్టుకొందురిట మద్భావమ్ము గుర్తింప ను
ద్ధవగీతల్ మరి పార్థుగీతలును సంధానింపుడీ రేపవల్

6. శ్రీ కె. నరసింహమూర్తి –  గరిక ప్రాధాన్యాన్ని వర్ణించండి

గరికన్ పచ్చడిచేసి పెట్టిన శిఖాగ్రప్రజ్ఞ మాయింటిదే
పరుషమ్ముల్ సరసమ్ములౌ కవిమనోభావంబులౌ అంబులౌ
తరుణుల్ ప్రేమగ తాకినంత గరికల్ తాళింపులౌ ఇంపులౌ
అరయన్ నన్ను మహావధాని యనరే ఆ యింట జన్మించుటన్

7. కుమారి పి. కారుణ్యకవిత –   సంగీత సాహిత్యాల పరస్పర సమన్వయం

ఆలోచనామృతమ్మగు
ఆలాపన చేతనదియె అతిమధురమ్మౌ
నాలో నీలో కదిలెడి
లీలానరవేషధారి రేఖలవియెగా

8. శ్రీ పి. లక్ష్మణరావు –  ఆడపిల్లలపై జరిగే అమానుష దాడులను నిరసిస్తూ

ప్రాణంబెట్టులు సైచెనోయి భడవా పద్మమ్ముపై నామ్లమున్
గ్లానిం గూర్పగ పారబోయ వనితల్ గ్లౌబింబముల్ ప్రేమ సం
స్థానంబుల్ హృదయమ్ములోగొన రసస్నానంబు గావింపుమా
పూనన్ గామపిశాచ మా యెదురు కాల్పుల్ నీకు తల్పుల్ కదా!

9. శ్రీ యం. సోమేశ్వరరావు – పృచ్ఛకులంతా అవధానులే అయితే సభ ఎలా ఉంటుంది

పృచ్ఛకులే అవధానులు
కచ్ఛపులే శారదాంబ కరకమలములన్
గుచ్ఛముల నమస్సుమముల
సచ్ఛవుల శతావధాన సవనంబగుగా

10. శ్రీమతి ఎ. లలితాశంకర్ –  ఆడపిల్లలు తగ్గిపోయి యువతరం మీద పెరిగిన వత్తిడి

అటునిటు నయ్యె కాలము మహాపద వచ్చెను పౌరుషానకున్
చటుకున తెచ్చుకొందుమన సాఫ్టొకొ హార్డొకొ చెప్పలేముగా
పుటుకున త్రెంచివేసితిరి బో! పసిపాపల పూలతీవెలన్
చిటికెను పెండ్లిసేయుడు ఋషీంద్రులుగాక భవత్కుమారకుల్

11. శ్రీ చిట్టెళ్ళ వెంకట సుబ్రహ్మణ్యశర్మ –   సంస్కృతపాఠశాలలో వేదవాణి – చంపకమాల

ఎనుబదిరెండు పన్నముల నేకబిగిన్ బఠియించుచుండి గ్రు
క్క నొదుగ నాల్గువేదముల కాన్కగ నిచ్చెద వేదమాతకున్
మనమున సర్వభేదముల మాయముజేసెడి నాల్గువాక్యముల్
ఘన పనసల్ కదా శుభముగా నడిపించెద పాఠశలలన్

12. శ్రీ జి. గోవిందరాజు –  నారాయణదాసుగారు విజయభావనను వర్ణిస్తే

ప్రజల సంస్కృతి ప్రాణమయ్యెను రాజపట్టణ వీథికిన్
విజయభావన కోకిల ధ్రువ విశ్వగీతిక వించెడిన్
అజముఖమ్ముల దీవెనమ్మిడ ఆదిభట్లమహాత్ముడే
గజమహాపతి పుణ్యమాయని గైకొనున్ శుభవైభవాల్

13. శ్రీ వి. నీలకంఠాచారి – పర్యావరణ నాశనం – భవిష్యత్తు

అడవలు గూలుచున్నవి మహాపదనుండె మహాపగల్ సుడిన్
ముడిపడియుండె భూమి యవె మ్రోగుచునుండె ప్రమాదఘంటికల్
చెడుగు విషానిలమ్ములు గ్రసించెను దుప్పటులట్లు విశ్వమున్
కడువడి నేడె చేయుడు జగత్ప్రళయంబులు రాకయుండగా

14. శ్రీమతి బి. రుక్మిణి -
బంగారపుసీతయే రుక్మిణిగా భావించే శ్రీకృష్ణుడు – ఉత్పలమాలలో

కన్నుల వాలుచూపులవి కాంచనబాణములౌచు నెమ్మదిన్
వెన్నుని జేర సాధ్వి పదవీక్షణ జేయగ నశ్వమేధపున్
జన్నము నాటివౌ పసిడిచాయల సీత పదద్యుతుల్ మదిన్
బున్నమి జేసినంత పరిపూర్ణత వెల్గెను కృష్ణచంద్రుడే!

15. శ్రీమతి సి. హె. యస్. యల్. నరసమ్మ –  తెలుగుభాష మాధుర్యము

అంత భారతకథ నాదికావ్యమ్ముగా సంతరించిన పాలపుంత భాష
అష్టదిగ్గజముల అమృతప్రబంధాల పల్లకీ నెక్కిన ప్రభువుభాష
కల్పవృక్షపు నీడ తల్పాన శయనించు విశ్వనాథునిజూపు విశ్వభాష
ఆశువుల్ వల్లించు నవధానవిద్యలో జగతి ముక్కునవేలు జాతిభాష
ఒక్క మాటలో సంస్కృతి నొక్కిజెప్పి
పరులు మెచ్చిన అందాల భాష, కాని
మనకు మనపిల్లలకు నేడు పనికి రాని
భాష, నా మనస్సాగర ఘోష వినుడు

16. శ్రీమతి ఆర్. లక్ష్మి – పార్వతి పెళ్ళిచూపులు – ఉత్పలమాల

సిగ్గులమొగ్గయైన సరసీరుహనేత్ర హిమాత్మజాత మే
నొగ్గి శిరమ్మునెత్తి కనులోరగజేసి యొకింత జూడగా
భగ్గునమండు కాముడు శుభమ్మని లేచె శివుండు “ఊ” యనెన్
నెగ్గెను ప్రేమ దంపతుల నెగ్గగ జేయుడు కామదాహమున్

17. శ్రీ  జి. హృషీకేశం – సత్యభామ యుద్ధవర్ణన, వీరశృంగార రసాలు

హరనేత్రాగ్నిశిఖావళీ సదృశమై ఆ నారకున్ జూచుచున్
స్మరబాణాగ్ని సుధామృదు ప్రణయమై స్వస్వామినిన్ జూచుచున్
అరిషడ్వర్గము గెల్వగా రమణి ప్రత్యాలీఢ పాదమ్ములన్
హరి సద్వర్గమువైపు జూడగ సరోజాక్షుండు కన్గీటెడిన్

18. కుమారి వై. భారతి – విజయనగర మహారాజవైభవం – మత్తేభం

అడుగుల్ మోపినజాలు వీథులు రసవ్యాహారహారమ్ములై
బడుగుల్ బంధువులెల్ల జేర హృదయంబానంద గంధమ్మునై
గొడుగుల్ బట్టెడువారు కొల్చు జనులున్ కోయన్న కోట్లయ్యెడిన్
బడుగున్ పేకగ సాగిపోయెను జగద్భాండమ్ము పాలించుటల్

19. శ్రీ జి. రమణమూర్తి -
అదృశ్యమయ్యే పల్లెటూళ్ళు, వలసపోవువారి కష్టాలు – సీసం

పల్లెటూళ్ళను వీచు పైరగాలినెగదా భరతమాత మనస్సు బయటపడును
పచ్చనిపంటలున్ వెచ్చని జంటలున్ గ్రామసీమలయందె కానబడును
ప్రకృతిమంత్రమ్మును పక్షులు జపియింప గూళ్ళుకూడను మంచి గుడులుకావె
రచ్చబండలమీద రాజకీయపుచర్చ చందనచర్చయై చల్లజేసె
పల్లెటూళ్ళను వీడి మీ యిల్లుగాల
నగరములకేగుదెంతురు నవ్వువచ్చు
తల్లి ఒడివీడి వేశ్యబంధమ్ము గోరి
మూర్ఖుడొక్కండు గంగలో మునిగినట్లు

20. శ్రీ దివ్వెల చిన్నారావు -
భార్యలప్రేమ కన్నా తల్లిప్రేమ గొప్పదని దివ్వెలకాంతులతో పోలుస్తూ

దివ్వెలకాంతుల బోలుచు
నవ్వుచునుండెడి గృహిణియె నవతేజంబౌ
దివ్వెకు నూనెయు ప్రమిదయు
నవ్వుచు నందించు దల్లి నా యిలువేల్పౌ

21. శ్రీమతి పేరి సావిత్రి -
పైడితల్లి జాతరలో పులివేషాలు, ఘటాలు మొదలైనవి వర్ణిస్తూ

పరువంబుల్ గరువంబులై పడతులే బాణంబులై నాథులన్
సరసత్వంబున ముంచి తేల్చుటలు కైజారెత్తుటల్ ధీరతన్
సిరిమానున్ బరిగొట్టి ఎక్కుటలు వాసిన్ గాంచి పైడమ్మయే
సిరి వర్షంబుల నిచ్చుగాత తరుణీ! శ్రీమాత వీ జాతరల్

22. శ్రీ రేవళ్ళ ఆదినారాయణ -
అధికధరలు, అల్పాదాయం

ధరలాకాశమునంటెను
సరుకులు పాతాళమందు చక్కగదాగెన్
ధరకింక భగీరథుడో
నరుడో దిగిరావలె గద న్యాయము జేయన్

23. శ్రీ సనపల వెంకటరమణ -
మీరు ముఖ్యమంత్రి అయితే సామాజియన్యాయం ఎలా చేస్తారు

రాజుగనైన నేను రసరాజ్యములన్ విహరింపజేసెదన్
ఆజుల నాపెదన్ మృదులహాస్యము లాస్యములందు జూపెదన్
జాజులకైతలన్ ప్రజ విషాదము బాపెద నింక నాపెదన్
మోజుల రోజులన్ జనులు మోదము నొందగ భూమి నేలెదన్

24. శ్రీ పి. ఎల్. ఎన్. శ్రీకాంత్ -
పూర్వ విద్యావిధానం, నేటి విద్యావిధానం మధ్య తేడా

విద్యను కోరివచ్చెడి వివేకులు గల్గిన కాలమద్ది నై
వేద్యము గోరవచ్చు నవివేకులు గల్గిన కాలమిద్ది ధీ
నద్యవగాహనమ్మునను నాటికి నేటికి నెంత భేదమో
విద్య వివేకమిచ్చును వివేకమొసంగును భోగయోగముల్

25. శ్రీ గన్నవరపు దుర్గాప్రసాద్ -
గోవధపై గోవుల ఆక్రందన

లారీలన్ నిలబెట్టి రేబవలు నల్లాడంగ వీక్షించి ఎ
న్నో రాష్ట్రమ్ములు దాట ఏ యడవిలోనో చెట్లకున్ గట్టి ఆ
క్రూరాత్ముల్ చురకత్తులందుకొన మొఱ్ఱో యంచు గీపెట్టవే
గోరక్షల్ నిగమాంత రక్షలు జగద్గోళమ్ము కాపాడెడిన్

Tags: , ,

వ్యాఖ్యానించండి

Loading