ఆశువులు-అవధాన చక్రవర్తి శ్రీగరికపాటి నరసింహారావుగారి శతావధాన సాహితీక్రతువు – విజయభావన, విజయనగరం

Saturday, February 20, 2010
By భైరవభట్ల దేవీప్రకాశ్

ఆశువులు

1. శ్రీ పి. వి. నరసింహరాజు – శతావధానాన్ని శతపత్ర సుందరిగా పోలుస్తూ

అరయన్ పృచ్ఛకపత్రముల్ విరియ నవ్యంబైన యూహల్ మదిన్
పరమానందము గూర్చు బాలరవియై పద్యమ్ములే తేనెలై
సరసుల్ ప్రేక్షకులెల్ల బంభరములై సాగంగ నీ యజ్ఞమే
అరవిందాసన బ్రోచుగావుత శతంబానందమై అందమై

2. డా|| వై. బాబూరావు – అమరజీవి ఆత్మవేదన

మేమొక జాతి మాది యుపమింపగలేని రసార్ద్రభాష ఏ
స్వామికి కాళ్ళుబట్టుటకు స్వాంతము లొప్పవు మాకటంచు శ్రీ
రాముడ గాంధిశిష్యుడను రాష్ట్రముకై బలియైతి నేను నే
డేమిది గోతిలో పడియె యింత సమైక్యము కాలిపోవుచున్!

3. శ్రీమతి బి. హెచ్. సూర్యలక్ష్మి -  అనేకమంది సాహితీమూర్తుల శతజయంతి సంవత్సరం

వందేండ్ల పండుగలతో
వందల సత్కవుల ఋషుల భావన సేయున్
మందిరముగ మనకందిన
తుందిలమౌ రెండువేలతొమ్మిది గొలుతున్

4. డా|| ఉపాధ్తాయుల నరసింహమూర్తి – రంభ కవీశ్వరుని ఆహ్వానిస్తే

అంచుల్ జారిన పైటకొంగు తన కే యాహ్వానమున్ బంపెనో
అంచున్ జూచె కవీశ్వరుండు సతి ఆ ఆవేశమున్ జూచి నిన్
ముంచన్ జాలిన పూర్ణకుంభములతో ముప్పొద్దు హోరెత్తుచున్
ముంచున్ బంపెను వాన ఆతడు మదిన్ మోహమ్ములన్ వీడగన్

5. శ్రీ పేరి సుబ్బారావు – తృతీయ ప్రకృతి

అమ్మలు అయ్య లేవుడు వనాళికి ఏగెద నేను మీరలున్
బొమ్మన బోయిరెల్లరును పోకయె అచ్చట కూరుచుండి సీ
తమ్మను రామునిన్ గనగ ధన్యులు మీరిక వచ్చు కాలమం
దమ్మయు నయ్యగాక భరతావని ఏలుడటంచు పల్కెడిన్

6. శ్రీ కాకరపర్తి ముఖలింగేశ్వర శర్మ – వృద్ధాశ్రమాలు

ఇంత ముద్దదినక ఏడిపించెడు నాడు
పెట్టబోక ఏడిపించు నేడు
వృద్ధిచెందుచుండె వృద్ధాశ్రమమ్ములు
ఆశ్రమమ్ములందు అయిదవదిది

7. శ్రీ టి. భాస్కరమూర్తి – తిరుపతి వెంకట కవులు

తిరుపతివెంకటేశ కవిధీరులు స్వర్గమునుండి చూచుచో
పరగగ నీతనిన్ గరికిపాటి యటండ్రు సుధారసంబునన్
సురనది పొంగిపొర్లునటు చూడగ పద్యము చెప్పుచుండె భా
సుర సురవాణి ఈ తెలుగుశూరుని కంఠ మటంచు బల్కరే

8. శ్రీ బి. రాజేశ్వరరావు – గ్రామీణ ప్రాంతం

దారి విశాలమైనది సుధామయ చిత్తము సంకుచించెడిన్
ఊరభివృద్ధి చెందినది ఊరను లేడుపకారి యెవ్వడున్
సారమెరుంగదీ చదువు చక్కని భూముల నమ్మివేసె ఈ
ఘోరమె ప్రస్తుతింపబడు గ్లోబలు సంస్కృతియంచు నియ్యెడన్
9. డా|| టి. బాలనాగమణి – చారిత్రిక నగరం, శతావధానం

తాతారయడుశాస్త్రి సన్నిధిని సంథా పద్ధతిన్ సాగు నీ
యాతాయాత వధాన పద్యముల నాయా పాండితీమూర్తులన్
చేతోభూమిక మ్రొక్కుచున్ నవవచశ్శ్రీమాధురుల్ నింపుచున్
ఖాతాలో జమజేయువాడ కవితాఖండమ్ము నేడియ్యెడన్
10. శ్రీ కె. పి. ఈశ్వర్ – సమైక్యాంధ్ర

విడివడిపోవువాడు పదివేల విధంబుల జెప్పుచో నొడం
బడడిక వానితో కలసి బద్ధుడవైనను జ్యేష్ఠమూర్తికిన్
గుడుగుడులాట తప్పదు ప్రకోపము పైత్యము నంతరింపగా
విడివడుటే సుఖంబగును వీథులలో పడకుండ చూడుడీ!

11. డా|| బెహరా వెంకటేశ్వర ప్రసాద్ – విజయనగర పూర్వరాజులు

ప్రజల హృదంతరాళముల పావనభావము పాదుకొల్పగా
సృజనము జేయు పండితుల సేవలుజేసి రసోచితంబుగా
విజయమహాభ్రవీథులను వేదములై నినదించినారుగా
గజపతులట్టి రాజులకు కానుకలీయ నమస్కరింపుడీ

12 శ్రీ భైరవభట్ల నరసింహం – జీవహింస చేయకుండా ఉండగలమా

బాధపెట్టకుండ బ్రతుకంగవచ్చునా
బాధ తెలియకుండ బాధపెట్టు
ప్రాణిహింస లేక బ్రతుకుటే మేలయా
హింసజేయబోకు హిందువుండ

13. . శ్రీ ఎన్. ఆర్. శ్రీనివాసరావు – పర్యావరణం భావి పరిస్థితి

నోటను ప్లాస్టికు ముద్దలు
కాటికి బోయిననుగాని కంప్యూటరులే
వాటాలౌ దేహమ్ములు
వీటను సంగీతఘోష వినిపింపదుగా

14. కుమారి సాయిరాధ – గురజాడ, గురజాడ విద్యాసంస్థలు

జాడను జూపినాడు గురజాడకవీంద్రుడు సాహితీక్రియన్
మేడలు గట్టినాడు మిసిమిన్ పసిమిన్ మరి పూర్ణిమా నిశన్
జూడగ జేసినాడిచట జూడగ చక్కని పాఠశాలలో
గోడలు గట్టినాడు గుడిగోపురమై బడి వెల్గుచుండగన్

15. శ్రీ పేరాల సీతారామప్రభు – విశ్వనాథ సత్యనారాయణ, పేరాల భరతశర్మగార్లు ఈ సభను చూస్తే

విశ్వనాథుండు శిష్య సద్వినతుడగుచు
చూచి అటునుండి దీవించుచుండు నిజము
ఒక్క పలుకైన నూయగా చిక్కదయ్యె
కల్పవృక్షమ్ము లీతని కాచుగాత

16. శ్రీ ఈపు విజయకుమార్

అన్నలను గౌరవించుట
మిన్నయె యగుగాని చేయి మీదకగుటకున్
అన్నులమిన్న యొకర్తెను
కన్నులలో బెట్టుకొనిరి కలిసిమెలిసియున్

17. శ్రీమతి చదువుల జానకీభాయి – న్యాయవ్యవస్థ

చట్టములెల్ల చుట్టములు చట్టసభన్ గొలువుండువారికిన్
గట్టిగనిట్టు చట్టములు కాంతల కన్నులలోన వెల్గులన్
గట్టును మానినీమణుల కాపురముల్ వెలుగంగజేయు ని
ప్పట్టున బోధజేయవలె పట్టినపట్టున పల్లెటూళ్ళలో

18. శ్రీ నారాయణం సురేశ్ -  వేగవంతమైన అభివృద్ధి

వేగము వేగమందు రభివృద్ధికి వేగమొకండు చాలునా
వేగమె జీవితాన సుమవీక్షణముల్ నశియింపజేసె ను
ద్వేగము తప్ప యీ దుడుకువేగము తెచ్చినదేమి? పుష్పముల్
రాగము పాడుచున్నవి సరాగము లాడుము జీవితమ్మునన్

19. శ్రీ కె. వి. వి. ఎస్. మూర్తి – ఛిట్‌ఫండ్ కంపనీల మోసం

చెమటోడ్చి దాచు సొమ్మును
తమకమ్మున మ్రింగివేయు దానవమూర్తుల్
రమకిచ్చెడి ప్రాధాన్యం
బుమకీయరుగాదె వారి నురిదీయవలెన్
20. శ్రీమతి లక్ష్మి ప్రఫుల్ల – నర్తించే శివుని  చిత్రించిన వినాయకుడు, పార్వతి స్పందన

నట్టువరేడు గుట్టపయి నాట్యముజేయుచునుండ తత్సుతుం
డెట్టులొ క్రిందుమీదగుచు నింతయు చిత్రమునందు జూపగా
ఈట్టె లిఖించితీవనుచు ఎంతయు మెచ్చుచు నంకమీయదే
గుట్టుగనుండె విఘ్నపతి కుఱ్ఱని చేష్టలు తల్లికిట్లగున్

21. శ్రీమతి పూర్ణిమా మాథుర్  – విదేశాలలో భారతీయులు

పొడుపుమల కాంతిరేఖల
కుడియెడమల పశ్చిమాద్రి కూటమిజేరన్
పడమటి సంధ్యారాగం
బడగించెను తూర్పుకాంతి నయ్యో నేడే!

22. శ్రీ ఎనమండ్ర రామకృష్ణ పరమహంస – కర్ణుడు పాండవపక్షం చేరితే

మమతనుబూని భానుజుడు మాదగు పక్షముజేరె నేటితో
సమరము లాగిపోవునిక శాంతి మహోన్నతకాంతు లేనెడిన్
భ్రమపడి రాజరాజు సమరమ్మున కర్ణుని నమ్మెగాని యీ
మమతలు గర్భసంచివి సుమా! జననీ ప్రియభావ మిట్టిదే

23. శ్రీ వఝ్ఝల రామశర్మ – ఇంటర్నెట్ వివాహాలు

నెట్టించి వివాహమ్ములు
గిట్టించును కొన్నినాళ్ళు గీరతములునై
దట్టించు ద్వేషభావము
నెట్టేలా సంప్రదాయ నీతులు గలుగన్
24. శ్రీ డి. రామమోహనరావు – డైలీ సీరియల్స్ ప్రభావం

ధారవాహిక సంసారభారమయ్యె
పోపు తాలింపులైనను జూపదయ్యె
ప్రాత ఒకగంట క్రొత్తది పావుగంట
కడుపులో మ్రోగుచున్నది గంటగంట

25. శ్రీ డి. అచ్యుతరావు – నేటి విద్యావ్యవస్థ స్థితి

అటునిటు నయ్యెను గాలము
పటుతర విద్యావ్యవస్థ భాండము పగిలెన్
నిటలాక్షుడె దిగిరావలె
గుటుకున నిద్దాని మ్రింగి కుఱ్ఱల బ్రోవన్

26. శ్రీమతి సుశీల – గులాబీ సాందేశం

కొన్ని సుఖానుభూతులవి కూడిన జీవితమౌను దీని యం
దెన్ని వ్యధానుభూతులు మరెన్ని పరాభవహేతువుల్ ధృతిన్
అన్నియు నోర్చుమా ప్రకృతి నారయుమా సుకవిత్వ మెంచుమా
చిన్ని గులాబిపూవులు వచించెడి పల్కుల విన్ము సోదరీ!

Tags: , ,

వ్యాఖ్యానించండి

Loading