కవిత్వము-చందస్సు

Wednesday, October 21, 2009
By పద్యం.నెట్

శ్రీ పింగళి లక్ష్మీకాంతంగారు “సాహిత్య శిల్ప సమీక్ష” అనే ఒక సాహిత్య విమర్శ గ్రంథం రాసారు. అందులో “కవిత్వము-ఛందస్సు” అనే వ్యాసంలో కొన్ని ఆసక్తికరమైన విషయాలను చర్చించారు. అందులోనుండి కొన్ని భాగాలు:

“కవిత్వమునకు ఛందస్సు ఆవశ్యకమా, అనావశ్యకమా?” అను సమస్యను మన అలంకారికులు ఎన్నడును చర్చించనే లేదు. “ఇష్టార్థవ్యవచ్ఛిన్నమగు పదావళి కావ్యశరీరము.” అని నిర్దేశించిన ఆచార్యదండి మొదలుకొని “రమణీయార్థ ప్రతిపాదకమగు శబ్దము కావ్యము.” అని నిర్వచించిన జగన్నాథుని వరకుగల పండితులందరును రమణీయమగు రచనలన్నియు కావ్యములుగానే గౌరవించిరి కాని, గద్య పద్య భేదమును పాటింపలేదు. కాని పాశ్చాత్యుల నిర్వచన విషయము కవిత్వముగాని, కావ్యము కాదు. లోకవ్యవహారమున, కవిత్వమనగానే ఛందోబద్ధ రచన అను నభిప్రాయము రూఢముగానున్నది.

Some quotes from English critics:

For my own part I find considerable meaning in the old vulgar distinction of poetry being metrical having musing in it – Colright
Poetry is an art of producing pleasure by the just expression of imagination, thought and feeling in metrical language. – Prof. Courthope

కానీ వారిలో కవిత్వమునకు ఛందస్సు యొక్క ఆవశ్యకత నంగీకరింపనివారు చిరకాలముగ బహుసంఖ్యాకులు గలరు.

English critics quotes

Verse is no guarantee of poetry but a recognized adjunct of it. – Aristotle

The greatest part of poets have appareled their poetical inventions in that numerous kind of writing called verse. Indeed verse, is an apparel only, being but an ornament and no cause to poetry, since there have been most excellent poets that have never versified, and now swarm many versifiers that need never answer to the name of poets. – Philip Sydney

Poetry of the highest kind may exist without meter. -Coleridge

దీనిని బట్టి చూడ ఛందోవిముఖవాదుల అభిప్రాయమున Poetry అనగా కేవల కవిత్వము కాదనియు, సర్వసాధారణమైన కావ్యమనియు తోచుచున్నది.ఛందస్సుముఖవాదులలో Poetry అనగా కవిత్వమనెడి అర్థమే స్ఫురించుచున్నది. కావ్య కవిత్వ శబ్దములకు భేదము పాటింపక పోవుటచే ఈ వివాదము పెరిగినది. కవిత్వమునకు అనువాద పదముగా Poetry అని
యున్నట్లుగా, కావ్యమునకు ఆ భాషలో ఇంకొక పదము లేకపోవుబట్టి ఇరువురునూ కవిత్వ శబ్దమునే ప్రయోగించుటచే ఈ సమస్య మరింత క్లిష్టమైనది. కావ్య కళాసృష్టికి శ్రుతిలయాత్మకత జీవము. ఈ శ్రుతిలయలను గ్రహించునది శ్రవణేద్రియము. దాని ద్వారా మనస్సునకు ఆహ్లాదముగొలుపు కళ గనుకనే కవిత్వము, సంగీతము వలె శ్రవ్యకళయైనది. గద్య రచయిత ఎంత ప్రయత్నించియు ఛందస్సాధితములైన ఆ శ్రుతిలయలను సమకూర్పలేడని సమాధానము. గద్యమనగా లయబంధురమైన వచన రచన.

This opinion is a prosaic mistake. Fitness or unfitness for song or metrical excitement makes all the difference between a poetical or prosaical subject; and the reason why verse is necessary to the form of poetry is that the perfection of the poetical spirit demands it; that the circle of its enthusiasm, beauty and force is incomplete without it. – Leigh Hunt

ఆది వేదమగు ఋగ్వేదమునందలి ఋక్కులన్నియు మంత్రద్రష్టలు భవ్యావిష్టులైయున్న సమయమున, తమంత వారి నోట వెలువ్డినవి. అపౌరుషేయమైన ఆ వేద వాక్కు ఛందోబద్ధముగనే ఆవిర్భవించుట కవిత్వమునకును, ఛందస్సునకును గల సహజ సంబంధమును నిరపవాద సిద్ధాంతమును చేయును. ఒక శ్లోకముగానీ, పద్యముగానీ గైకొని, దానికి ఆ మాటలలోనే దండాన్వయము వ్రాసి, ఆ దండాన్వయ వచనమునుమూలముతో పోల్చి చదివినపుడు, చందోబద్ధమైన ఆ పద్యములోని శ్రుతిసుభగత్వమును, చందోరహితమైన ఈ వచనములోని తదభావమును వ్యక్తమగును.

ఈ వివాదముయొక్క సారాంశమిది: చందోబద్ధమైన కావ్యము కవిత్వము.
============

ఈ వ్యాసంలో నాకొక విషయం విచిత్రంగా తోచింది. కవిత్వానికి ఎలాంటి నిర్వచనమూ ఇవ్వకుండానే “పాశ్చాత్యుల నిర్వచన విషయము కవిత్వముగాని, కావ్యము కాదు” అనడం ఎంతవరకూ తార్కికం? పైగా ఆంగ్ల విమర్శకుల నిర్వచనాలని కొన్నిటిని పేర్కొన్ని దాని సారాంశం “ఛందోవిముఖవాదుల అభిప్రాయమున Poetry అనగా కేవల కవిత్వము కాదు, సర్వసాధారణమైన కావ్యమని తోచుచున్నది. చందస్సుముఖవాదులలో Poetry అనగా కవిత్వమనెడి అర్థమే స్ఫురించుచున్నది” అని తేల్చి చెప్పారు. ఇది ఏ అధారంతో అన్నారో స్పష్టంగా లేదు. ఒక
అంతర్గత (అస్పష్టమైన) నిర్వచనం ఆధారంగా చర్చ మొదలుపెట్టి, ఆ చర్చ సారాంశంగా అదే అంశాన్ని నిరూపించినట్టుగా ఉంది ఇది! ఈ వ్యాసంలో మరికొన్ని చర్చనీయాంశాలు కూడా ఉన్నాయి. మరి మీరేమంటారు?

గమనిక: ఈ టపా వాస్తవానికి చందస్సు యాహూ గ్రూపులో భైరవభట్ల కామేశ్వరరావు గారు రాసినది. వారి అనుమతితో యూనీకోడీకరించి ఇక్కడ ఉంచుతున్నాం

వ్యాఖ్యానించండి

Loading