మహిళాదినోత్సవ సందర్భంగా… ప్రమదావనం!
1) భద్రమ్ముగాగ సుభద్రాపరిణయంబు
గూర్చిన తిమ్మక్క కూర్మి తనయ
మల్లెసరుల తావి మనసుల రంజింప
రామకథను వ్రాసె రమణి మొల్ల
మన్నారుచరితంబు నెన్నంగ రచియించి
రంగాజి కురిపించె రసజవాజి
ముద్దు ముద్దుగ రాధ మురిపాలు వివరించి
మురిపించె కృష్ణుని ముద్దు పళని
ఎందరెందరొ కవయిత్రు లిందు వెలసి
ఆంధ్రజనని కీర్తి నవని నిలిపి
తెనుగు తేనె తీపి తెలిపిన ఘనులకు
అంజలి ఘటి యింతు నమ్మ నేడు!
2) ధీశక్తి రాజ్యంబు ధిషణతో పాలించు
ధీయుత రుద్రమ్మ ధీరచరిత
మంత్రాంగ రచనలన్ మహదేవు పూజలన్
మహనీయ నాగమ్మ మహిత చరిత
రక్తి గొన్న మగని రణమున కంపిన
మహితాత్మ మాంచాల మాన్య చరిత
మాన రక్షణ సేయ ప్రాణంబు విడనాడి
దివికేగు మల్లమ్మ దివ్య చరిత
వీగివచ్చిన హృదయేశు వెక్కిరించి
పోరుకంపిన చానమ్మ పూత చరిత
అతిపరాక్రమధనులైన సతులగన్న
అమృతచరితవు నీవమ్మ ఆంధ్రమాత!
3) సంస్కర్త పతికి తా సహధర్మచారిణౌ
రతనాల వారాశి రాజ్యలక్ష్మి
సంక్షేమశఖకు చలివేంద్రమై నిల్చు
దుర్గమ్మ కనకంపు దుర్గ కాద
స్వాతంత్ర్య సమరాగ్ని సమిధయై వెలుగొందు
అపరంజి బొమ్మగా అన్నపూర్ణ
రాణి చిన్నాంబను రసమయిగా దీర్చు
సీతమ్మ కవనాల సిరులగొమ్మ
విశ్వవిఖ్యాతి గాంచిన విపులమతుల
మాతృమూర్తివి నీవెగా మాన్యచరిత
ఆశపండగ భక్తితో అంజలింతు
ఆదరంబున జూడుమా ఆంధ్రమాత!
4) `ఆంధ్ర కవయిత్రుల ‘ నాంధ్రుల కందించు
ఊటుకూరి కవిత లూటలూరు
మధురజీవనమును మహిళలకందించు
మాలతీ చందూరు మధురరచన
నవలల చదివించి నవలోకములదేల్చు
రాణి సులోచన రమ్య రచన
రమణుల స్వేచ్చకై రచనలు సాగించు
రంగనాయకి వ్రాత రక్తిగట్టు
అత్తగారి కథల హాస్యంబు పండించి
అతివ భానుమతియు నుతుల గొనియె
రసమయరచనల సరసముగ రచియించు
రమణుల నుతియింతు రాగమలర!
5) నవరసమ్ములొలుక నటియించు జగజెట్టి
కన్నాంబను గనిన కనకగర్భ
రసధుని మునుగంగ రాగవృష్టిగురియు
శ్రీరంగము గళము సిరుల పంట
నటన సౌదామినీ నర్తించు యామిని
నాట్య మయూరి ఆనందలహరి
విజయనగరమున వినిపించు `రింగ ‘ ంటు
కళవరురింగది కథల పొంగు
అన్ని రంగాల నెన్నిక గన్న ఘనుల
కన్నతల్లివి నీవెగా కల్పవల్లి
సకల సద్గుణవారాశి సాధుమూర్తి
ఆంధ్ర జనయిత్రి జోహారులందుకొనుమ !

చాలా చాలా………………………………………….చాలా బాగారాశారు.
ఎందరో మహానుభావులు అందరికీ వందనములు అని మాత్రం చెప్పగలను నేను.