విజయశ్రీ
విజయశ్రీ వీరరస ప్రధానమైన పద్య ఖండిక. ఇందులో విషయం, శ్రీ కృష్ణ రాయబారానంతరం పాండవులు యుద్ధ సన్నద్ధులవడం , యుద్ధ ప్రారంభం, అర్జునుని విషాదం, కృష్ణ ప్రబోధం అటు పిమ్మట నర నారాయణుల విజృభణం. స్వాతంత్ర్య సంగ్రామ కాలంలో వచ్చిన కావ్యం కావడం వల్ల, ఇది భారత ప్రజలలో సమరోత్సాహాన్ని కలిగించే విధంగా ఉండటంలో ఆశ్చర్యంలేదు. ముఖ్యంగా కుంతి పాండవులకు పంపిన “మాతృసందేశం” భరతమాత తన పుత్రులకు ఇచ్చే సందేశంలాగానే అనిపిస్తుంది. అనిపించడమేమిటి, అవును. ప్రతిభ కల కవి, యే వస్తువునైనా సమకాలీన సామాజిక స్పృహతో తీర్చిదిద్దగలడనడానికి ఇది చక్కని ఉదాహరణ. ఇక భాష విషయానికి వస్తే, అటు చిక్కని సంస్కృత పదబంధాలు, ఇటు చక్కని తేటతెలుగు నుడికారాలూ సరైన చోట్ల సరైన పాళ్ళలో పండాయి. భాషా భావాల పరంగా ఎన్నో చమత్కృతులు రసజ్ఞులని రంజింప చేస్తాయి. ఒక సందర్భాన్ని వర్ణించే తీరులో యెంత చమత్కారాన్ని, మరెంత భావాన్ని ఈ పద్యంలో కవి నింపాడో గమనించండి:
“ఇమ్మన్నాడయిదూళ్ళు భీష్ముడు;గురుండేదోవిధిన్ సంధి కా
నిమ్మన్నాడు;విచిత్రవీర్యతనయుం డేలా విరోధమ్ము పో
నిమ్మన్నా;డటు మీద కర్ణుని మొగమ్మీక్షించి పొందేమి పో
పొమ్మన్నాడు సుయోధనుండనుగు తమ్ముల్ రొమ్ములుబ్బింపగన్.”
దుర్యోధనుడికి కర్ణుని పైనున్న నమ్మకాన్ని యెంత చక్కగా చెప్పాడు (చెప్పలేదు, చూపించాడు!). పద్యాంతంలో వృత్యనుప్రాస యెంత అందాన్ని ఇస్తుందో పూర్వకవుల పద్యాలు చదివితే తెలుస్తుంది. అది ఇక్కడ ప్రత్యక్షంగా కనిపిస్తుంది, “తమ్ముల్ రొమ్ములుబ్బింపగన్” అనడంలో.
సహదేవుని నోటివెంట వచ్చే పద్యాలు అతని గుణానికి తగ్గట్టుగా ఉంటాయి, మచ్చుకి ఒక్క పద్యం:
“ఆడితి మోడిపోయితి మనంత;అనంత! అనంతరమ్మునన్
గోడలికిచ్చె నిచ్చకపు గూరిమి పెంపున గ్రుడ్డిరాజు! ము
న్నోడిన దానినే మరల నోడి, వనుల్ దిరుగాడి, నేడు వా
యోడక భాగమిమ్మనుటయున్ – కురువల్లభుడీయకుంటయున్!”
పాంచాలి పలుకులు యెంత పదునుగా ఉన్నాయో చూడండి:
“త్యజింతురో క్షాత్రకుల ప్రతిష్ఠలన్!
భజింతురో శాత్రవ పాదపద్మముల్!
భుజింతురో కానల కందమూలముల్!
సృజింతురో తాత్విక ధర్మశాస్త్రముల్!”
పై పద్యం వంశస్థ వృత్తం అనుకుంటాను..
“మారని మాటలేటికిటు మాటికి? కూటికి సాటిరాజుతో
బేరములాడుటే మిగుల పేలవ! మంతటబోక సంధికిన్
వారు తిరస్కరించి కరవాలము లెత్తిన నిర్నిమిత్త ని
స్సార విచారులై మెడలుసాచుట శోచ్యము నైచ్యమెంతయున్.”
అన్న ద్రౌపది మాటల్లో భాషాలంకారాలు యెంత భావానుగుణంగా రాజిల్లాయో చూసారా!
కృష్ణుని యీ చమత్కార సంభాషణని పరికించండి:
“గ్రామము లైదు మీరడుగగా కురురాజు నిరాకరించి సం
గ్రామ మొసంగినాడొకటి;కాదనరాదిక, లెండు ధార్మిక
గ్రామణులార; తోరణము గట్టి యథేచ్చగ నేలుకొండు ప్ర
జ్ఞామతులై; భవద్గుణగణంబులు దిక్కుల మాఱుమ్రోయగన్”
“గుణగణంబులు” అన్న చోట శ్లేష గమనించేవుంటారు. (గుణము = వింటిత్రాడు)
“మా పాలు మా కొసంగక
భూపాలున కింత బుద్ధి పుట్టకపోయెన్;
కోపాలసు లగు తమ్ముల
చాపాలకు పనులువెట్టె స్వార్థపరుండై!”
అనడంలో యమకమే కాకుండా, ధర్మరాజు రాజకీయ చతుర సంభాషణని కూడా ఆస్వాదించగలరు.
ఇక, ముందు పేర్కొన్నట్టుగా కుంతీ సందేశంలో భరతమాత పలుకులే మనకు గోచరిస్తాయి. మచ్చుకి ఒక పద్యం:
“వీరభారత భూమి నావిర్భవించి
పౌరుషములేని బానిస బ్రతుకులేల?
ఈ యయోమయ శృంఖలా లింకనైన
త్రెంపుకొని బైటబడి విజృంభింప రేల?”
అది కురుక్షేత్రం. యుద్ధారంభ సమయం. అర్జునుడు, కౌరవ సేనావాహిని నొక్క సారి పరికించడానికి ఉద్యుక్తుడౌతాడు. కృష్ణుడు ఆ సేనలోని ప్రముఖులు ఒక్కొక్కరి గూర్చి చెబుతూ ఉంటాడు. ఆ చెప్పడంలో చక్కని ఔచిత్యాన్ని కనపరుస్తాడు కవి. ప్రతీ వ్యక్తికీ అర్జునునితో ఉన్న సంబంధాన్ని గుర్తుకు తెస్తూ ఉంటాడు. ఇది అర్జున విషాదానికి రంగం సిద్ధంచెయ్యడమన్న మాట!
అందరినీ పరిచయంచేసిన పిమ్మట చెప్పే, యీ పద్యాన్ని చూడండి:
“అరదములొప్పు దీవుల క్రియన్,ధరణీధర సన్నిభమ్ములై
ద్విరదములొప్పు,నంబువు గతిన్ రజమొప్పు,భటాళి వొల్చువా(?)
శ్చరములటుల్, తురంగము లెసంగు తరంగములో యనన్, మహా
శరనిధి భంగి నున్న కురుసైన్యము గంటె ప్లవంగ కేతనా!”
పై పద్యంలో “ప్లవంగ కేతనా” అన్న సంబోధన యెంత సార్థకమైనదో గమనించారా?
అర్జున విషాదం, ముత్యాల సరాలలో ఒలికించాడు కవి! ఇందులో చాలా సరాలు ప్రాస రసాలను కూడా చిందిస్తాయి.
“దేహమా కంపించుచున్నది
ద్రోహమా అనిపించుచున్నది
మోహమేదో కుంచుచున్నది
స్నేహ బంధములన్!”
శ్రీ కృష్ణ ప్రబోధం చాలా రకాలుగా సాగుతుంది. అందులో హేళన ఉంటుంది, వీరముంటుంది, తత్వముంటుంది, అభిమానముంటుంది! “చిక్కని పోటుమానిసివిసీ” అన్న తిక్కన ప్రయోగం యీ
కవికి యెంత ప్రీతి పాత్రమైనదో! అది అలాగే ఒక పద్యంలో ప్రయోగించాడు. దీన్ని అనుకరణ అందామా? యీ కవికి ఆ కవిపై ఉన్న గౌరవ వ్యక్తీకరణ అందామా?
“ధర్మక్షేత్రము క్షాత్రమండల పవిత్రమ్మౌ కురుక్షేత్రమన్
కర్మక్షోణి స్వధర్మ నిర్వహణ దీక్షం దాల్చి, విద్రోహులన్
నిర్మూలించి స్వతంత్ర భారతభవానీ వీరసంతానమై
మార్మ్రోగింపుము దిగ్దిగంతముల యుష్మద్దేవదత్తధ్వనుల్!”
అన్నప్పుడు కలిగే వీరావేశంలో, అక్కడ ప్రాస కొద్దిగా తప్పిందన్న ధ్యాస కూడా మనకు కలగదు!
“నీదైన్యమ్మిక చాలు! గుండెగలదేనిన్ గొమ్ము కోదండమున్!
లేదా పోదము రమ్ము ద్వారకకు; వేఱే వారు వీరేల నే
నైదూళ్ళిత్తును బావలైదుగుర; కత్యంత ప్రశాంతమ్ముగా
వేదాంతార్థము ముచ్చటించుకొను; డన్వేషింపుడీ బ్రహ్మమున్!”
అన్న కృష్ణుని మాటలలో యెంత హేళన ఉందీ!
యీ క్రింది పద్యంలోని శ్లేషనీ, చమత్కారాన్నీ గమనింపుడీ
“వాడిమి పెంపు రాచ మగవారికి సొంపులు నింపు నగ్గికిన్
వేడిమివోలె;పౌరుషము వీడుట జాలిగ మాటలాడుటల్
పోడిమి గూర్చునయ్య నినుబోటికి? మంచి ధనంజయుండవే!
బూడిద మాడ్కి తన్నుకొని పోదురు దుర్బలులన్ బలాధికుల్!”
సంభాషణా చామత్కారమీ పద్యంలో అత్యున్నతినందుకొన్నదనడంలో అతిశయోక్తి లేదనుకుంటాను:
“ఈ గర్వాంధుల రూపుమాపుటకె గానీ! జీతమా బత్తెమా
నీ గుఱ్ఱమ్ముల దోలునంత పనికిన్ నేనేల? మా యింటిలో
నే గుఱ్ఱాలను దోలలేనొ! నిజమింతే ధర్మ రక్షార్థమై
యోగమ్మూనితి; పార్థ! యిట్టి మహదుద్యోగమ్ము సాగించితిన్!”
“శ్రీమంతంబగుగాక భారతము! సుస్నేహార్ద్రరాజప్రజా
సామంతంబగుగాక క్షాత్రము! సముచ్చైశ్శాంతి సీమంతినీ
సీమంతంబగుగాక సృష్టి! విజయశ్రీ క్రాంతిసంక్రాంతికిన్
హేమంతంబగుగాక నవ్యయుగ సందేశ ప్రభావంతమై!”
అనే సమున్నతాకాంక్షతో పూర్తయ్యే “విజయశ్రీ” కావ్యం క్రాంత దర్శియై, రక్తాన్ని ఉరకలెత్తించక మానదు. పద్య రచనాసక్తులైనవారు యీ పద్యలలోని భాష, భావ వ్యక్తీకరణ, శైలి పరిశిలించడం వల్ల ఎంతో కొంత మేలు పొంద వచ్చు.
గమనిక: ఈ టపా వాస్తవానికి చందస్సు యాహూ గ్రూపులో భైరవభట్ల కామేశ్వరరావు గారు రాసినది. వారి అనుమతితో యూనీకోడీకరించి ఇక్కడ ఉంచుతున్నాం
