చేరా గారి మాత్రా చందో రీతులు

Wednesday, October 21, 2009
By పద్యం.నెట్

ఈ రోజు, శ్రీ చేరా గారి “ముత్యాల సరాల ముచ్చట్లు…” అన్న పుస్తకంలోని మాత్రా చందో రీతులు అన్న ఆసక్తి కరమైన వ్యాసాన్ని చదివాను. ఆధునిక కవుల కవితలనుండి ఉదాహరణలిస్తూ వివిధ
మాత్రా ఛందస్సులలో ఉండే రకరకాల నడకలగూర్చి వివరించారు. ఇది 1958 లో అతను వ్రాసిన వ్యాసం. అందులో కొన్ని విషయాలు నన్ను ఆలోచింపజేసాయి. ఒక చోట అతనంటారూ, “పద్యం ఏదైనా ఏదో ఒక లయకు సరిపోతుంది. ప్రాచీనులు పేర్కొన్న వృత్తాలను కూడా మాత్రా ఛందస్సుల లోకి మలచుకోవచ్చునేమో ఛందస్సులలో ప్రయోగాలు చేసే వారు గమనిస్తే మంచిది.” నన్ను
ఆలోచింపజేసిన విషయం యిదీ.

ఈ విషయమై వారు కొంత వివరిస్తూ, “శిలలు ద్రవించి యేడ్చినవి జీర్ణములైనవి తుంగభద్రలో…” అనే చంపకమాలా పాదాన్ని ఇట్లా యతి స్థానం దగ్గర విరిచి రెండు పాదాలు చేసి మాత్రా గణాల్లో లక్షణం చెబితే:

4+5+3
4+4+5+3 మాత్రా గణాలన్న మాట

రెండో పాదంలో మొదటి పాదం కన్నా ఒక చతుర్మాత్రాగణ మెక్కువ. మొదటి పాదంలో 12 మాత్రలూ, రెండో పాదంలో 16 మాత్రలు. దీన్నే బేసి పాదాల్లో మూడు చతుర్మాత్రాగణాలుగానూ,
సరిపాదాల్లో నాలుగు చతుర్మాత్రా గణాలుగాను నియమం చేసుకొని సరిపాదాలు గుర్వంతాలుగానే ఉంచి మాత్రా పద్యం నడిపిస్తే చంపకోత్పల మాలలకు మాత్రాక్రమంలో తేడాలేదు.”
ఇట్లాగే శార్దూలాన్ని గూర్చి కూడా వివరించారు.

ఇక్కడ మౌలికమైన ప్రశ్న ఒకటుంది. “పద్యమేదైనా సరే అది ఒక లయకు సరిపోతుంది” అన్న విషయం యెంతవరకూ నిజం? మనకు చాలా వృత్తాలు ఒక ప్రత్యేకమైన లయతో కూడినవి ఉన్నాయన్న విషయం సువిదితమే. అలాగే, జాతి ఉపజాతి పద్యాలకు చాలా వరకు ఒక ప్రత్యేక లయ ఉంటుందన్న విషయాన్ని కూడా ఒప్పుకోవచ్చు. అయితే అన్ని పద్యాలకూ దీన్ని వర్తింప
చెయ్యడం కుదురుతుందా? ఇదే ప్రశ్నకి అనుబంధమైన మరో ప్రశ్న కూడా ఉంది. ఏ పద్య చ్ఛందమీనా మాత్రా ఛందస్సు నుండే పుట్టిందా అన్న ప్రశ్న. మరో రకంగా అడిగితే, గేయం నుండే పద్యం
పుట్టిందా అని?

ఇక నా అభిప్రాయాలకి వస్తే, ప్రతి పద్యాన్ని మాత్రా ఛందస్సులోకి మలచడం సంధ్యం కాదు. ముఖ్యంగా ఉత్పలమాల వంటి వృత్తాలు ఆ కోవలోకి చెందినవి. శ్రీ చేరాగారు చెప్పినట్ట్లుగా, ఉత్పలమాలని,

4+5+3
4+4+5+3 మారాగణాలుగా అనుకుందాం.
అలా అనుకున్నప్పుడు ఒక విషయం ఆలోచించాలి. యీ విభజన యెంత వఱకు లయాత్మకంగా ఉంది? మొదటి పాదం 12 మాత్రల గణం. ఇదే వ్యాసంలో శ్రీ చేరాగారు, ద్వాదశ మాత్రా ఛందస్సుని వివరిస్తూ, మూడు రకాల లయలు చెప్పారు:

4+4+4 లేదా
3+3+3+3 లేదా
6+6

ఇందులో 4+5+3 అన్న గణ విభజన లేదు. ఎందుకంటే, అది లయకి సరిపడదు కనుక. మనకు తెలుసున్న ఉత్పలమాల పద్యాలన్నిటినీ గుర్తుకు తెచ్చుకుంటే, యీ రకమైన విరుపు యెంత అరుదో బోధపడుతుంది. పోనీ చేరా గారన్నట్టు 4+4+4 క్రింద విరుద్దామా అంటే, అది ఉత్పలమాల లక్షణానికే పూర్తి భిన్నంగా ఉంటుంది! ఒకే గురువుని రెండు లఘువులుగా విడగొట్టి, రెండు వేర్వేరు గణాలలోకి సర్దడం సరికాదు కదా. పోనీ మరే విరుపైనా సాధ్యపడుతుందా? మొదటి UII తరువాత వచ్చే UIU అన్న గురులఘువుల మూలంగా యే రకంగా విరుచినా, అనులోమ విలోమ గతులు వస్తాయి. ఇవి లయను చెడగొడతాయి. కాబట్టి ఉత్పలమాలను ఒక లయకు అనుగుణంగా వ్రాయడం అన్నది అసాధ్యమని నా అభిప్రాయం.

ఉత్పలమాల పద్యాలను పరిశీలిస్తే, వాటి నడకలలోని వైవిధ్యాన్ని విశ్లేషిస్తే, ఆ వృత్తాన్ని యేదో ఒక లయకు కట్టివేయాలనుకోవడం అసాధ్య మనిపిస్తుంది, అన్యాయమని కూడా నాకనిపిస్తుంది.

ఇదే వివరణ, శార్దూల మత్తేభాల వంటి వృత్తాలకు కూడా వర్తిస్తుంది. అయితే యీ వృత్తాలన్నీ సంస్కృతం నుండి వచ్చినవే కనుక, వాటి సంస్కృత ప్రయోగాలలో యేదైనా ప్రత్యేకమైన నడక
కనిపిస్తుందా అన్న విషయం పరిశీలిస్తే, వీటి పుట్టు పూర్వోత్తరాలేమైనా తెలియ వచ్చు. తెలుగు ప్రయోగాలను బట్టి మాత్రం, అవి లయ ప్రధానమైన పద్యాలుగా కనిపించవు.

మీ అభిప్రాయలగూర్చి ఎదురు చూస్తూ..

గమనిక: ఈ టపా వాస్తవానికి చందస్సు యాహూ గ్రూపులో భైరవభట్ల కామేశ్వరరావు గారు రాసినది. వారి అనుమతితో యూనీకోడీకరించి ఇక్కడ ఉంచుతున్నాం

Tags:

వ్యాఖ్యానించండి

Loading