వృత్తౌచిత్యము పై శ్రీ కేరాగారి విమర్శనము
శ్రీ కేతవరపు రామకోటిశాస్త్రి గారి వృత్తౌచిత్య విచారములో వారు ప్రస్తావించిన కొన్ని విషయాలతో నేను పూర్తిగా ఏకీభవించ లేకపోయాను. క్షేమేంద్రుడు తన సువృత్తతిలకములో పేర్కొన్న
వృత్తౌచిత్యము, సర్వత్ర సర్వధా వ్యాపన శీలమైన సిద్ధాంతము కాదనడంలో పెద్ద సందేహమేమీ లేదు. కానీ, తర్వాత వారు చెప్పిన ఈ క్రింది విషయాలు కొంత గందరగోళంగా ఉన్నాయి:
“వృత్తములు గణముల మీద నిర్మింపబడినవి గనుక నా యా గణములవలన పద్యములలో వచ్చు భేదము లేకపోయినను, పరుషసరళాది, ద్విత్వసంయుక్తాది భేదములతో నున్న వర్ణములయొక్క కూర్పువలన శ్రవణేంద్రియమున కనుభవమునకు వచ్చు గతిభేదము పద్యములయం దనివార్యము. ఛందస్సుయొక్క సూక్ష్మరూపము వర్ణన మని చెప్పుటలోని ఆంతర్య మిదియే.”
వృత్తములు గణముల మీద నిర్మింపబడినవి అనడంలో శ్రీ కేరాగారి ఆంతర్యము బోధపడలేదు. గణముల ఆధారంగా వృత్తలక్షణము గుర్తుపెట్టుకోవడమొక పద్ధతి మాత్రమే. అంతే కాని అవి గణములమీద నిర్మింపబడినవని అనడమెంతవరకు సమంజసం? వృత్తాలు గురు లఘు క్రమం మీద నిర్మింపబడ్డాయి కదా? అది అలా ఉంచితే, శ్రీ కేరా గారి ఉద్దేశం ప్రకారం పరుషసరళాది, ద్విత్వసమ్యుక్తాది భేదములు పద్యానికి గతిభేదాన్నిస్తాయి. ఇది కూడా అంత సరియైనదని నాకు తోచటం లేదు. గతి భేదాన్ని ఇచ్చేవి ప్రధానంగా గురు లఘువులు కాని పరుష సరళాలు లేక ద్విత్వ సమ్యుక్తాలూ కాదు. ఉదాహరణకి “ఏకడ నుండి రాక” అన్నా “ఎక్కడ నుండి రాక” అన్నా ఒకటే గతి. “ఏ కడ” లో ద్విత్వంకాని సమ్యుక్తంగానీ లేవు. “ఎక్కడ” లో ద్విత్వం ఉంది. అయినా
ఒకటే గతికి కారణం, రెండూ గురువు లవ్వడమే. సరే, పరుష సరళాఉలకూ గతికీ సంబంధమే లేదు! ఈ పరుష సరళాదులూ, ద్విత్వ సమ్యుక్తాలూ భావస్ఫోరకాలు అవ్వవచ్చు కాని గతి నిర్దేశకాలు కావు. ఛందస్సుకీ వీటికీ పెద్దగా సంబంధం లేదు. “ఛందస్సుయొక్క సూక్ష్మరూపము వర్ణన మని చెప్పుటలోని ఆంతర్య మిదియే” అన్న వారి వాక్యం నాకు అర్థమే కాలేదు. శ్రీ కేరా గారీ వ్యాసంలో పేర్కొన్న మరి కొన్ని విషయాలు:
“ఛందము శబ్దము నాశ్రయించియున్నది. శబ్దములు వర్ణముల వలన నైనవి. కనుక వర్ణములయొక్క సంయోజన వైలక్షణ్యమును బట్టి పద్యము యొక్క నడక యున్నది. గణములను బట్టి లేదు. స్థూలముగా నున్నట్లు కనిపించును. వృత్తముల విషయమే ఇట్లున్నపుడు, ఆఫలానా గణములే వరుసగా రావలయునని నియమము లేని మరియు మాత్రల లెక్కమీద ఆధారపడిన జాత్యుపజాతుల విషయ మసలే నిర్ణయింప వీలు కానిది.”
ఇది చాలా ముఖ్యమైన విషయం, చాలా ఆలోచించ వలసినది కూడాను. “వర్ణములయొక్క సంయోజన వైలక్షణ్యమును బట్టి పద్యము యొక్క నడక యున్నది. గణములను బట్టి లేదు.” ఇది చాలా వరకు సరియైనదీ, చాలామంది గమనించనిదీ కూడాను. వృత్తాలలో గురు లఘు క్రమం మాత్రమే నిర్దేశింపబడుతుంది. అంతేకాని,పదాలు ఎలా విరగాలీ అన్న విషయాన్ని నిర్దేశించదు. సంస్కృతంలో విరామ యతి కొంతవరకు ఈ పని చేస్తుంది కాని పూర్తిగా కాదు. తెలుగులో సరే సరి! పద్యానికి వచ్చే నడక, పదాల పొహళింపు మీద ప్రథానంగా ఆధారపడుతుంది. ఉదాహరణకు, ఈ రెండు ఉత్పలమాల పాదాలను చూడండి:
“సారపు ధర్మమున్ విమల సత్యము పాపము చేత బొంకుచే”
“ఓ చతురాస్య వంశ కలశోదధి పూర్ణ సశాంక…”
రెంటి గతులలోనూ ఎంత భేదముంది! అయితే ఈ గతి భేదం గణాలబట్టి, లేదా ఛందస్సు లక్షణాన్ని బట్టి అసలే ఉండదని చెప్పడం పొరపాటే అవుతుంది. ఎందుకంటే, కొన్ని కొన్ని వృత్తాలు, ఛందస్సులూ ఒక విలక్షణమైన గతిని కలిగి ఉంటాయి. ఉదాహరణకు మత్తకోకిల వృత్తాన్ని గానీ, ఆటవెలది ఉపజాతిని కానీ తీసుకోండి. అందులో ఏ పద్యం చూసినా, వాటి వాటికున్న ప్రత్యేకమైన నడక స్పష్టంగా తెలుస్తుంది. ఆ నడక అసలే లేకుండా అలాటి పద్యాలు వ్రాయగలగడం అంత సులువైన పని కాదు! నడక అన్నది ప్రథానంగా ఒకే రకమైన శబ్దక్రమం యొక్క ఆవృత్తి మూలంగా ఏర్పడుతుంది. ఈ ఆవృత్తి అన్నది, పదాల పొందికలో ఉండవచ్చు, లేదా గురు లఘు క్రమంలో ఉండవచ్చు. ఉత్పలమాల వంటి వృత్తాలలో, ఒకే రకమైన గురు లఘుక్రమావృత్తి ఒక పాదంలో కనిపించదు (ప్రతి పాదంలోను ఒకే క్రమం ఆవృత్తి అవుతుంది కాని, ఒకే పాదంలో ఒక గురు లఘు క్రమం మరల మరల ఆవృత్తి అవ్వడం లేదు). అందువల్ల వాటికి ప్రస్ఫుటమైన నడక కనిపించదు. పదాల క్రమాన్ని బట్టి నడక యేర్పడుతుంది. అదే మత్తకోకిల తీసుకుంటే, “UI UII” అన్న గురులఘు క్రమం మళ్ళీ మళ్ళీ వస్తుంది. అలాగే ఆటవెలది తీసుకుంటే “UI” లేదా “III” అన్న క్రమం బేసి పాదాలలో మూడు సార్లూ, సరి పాదాలలో ఐదుసార్లూ ఆవృత్తమవుతాయి. అందువల్ల వాటికి ఒక ప్రత్యేకమైన నడక కలుగుతోంది. కాబట్టి, నడక గురించి, “వృత్తముల విషయమే ఇట్లున్నపుడు, ఆఫలానా గణములే వరుసగా రావలయునని నియమము లేని మరియు మాత్రల లెక్కమీద ఆధారపడిన జాత్యుపజాతుల విషయ మసలే నిర్ణయింప వీలు కానిది” అని శ్రీ కే రా గారన్న మాటలు సరికావు.
నా పై వాదనలోని తప్పొప్పులు పెద్దలు నిర్ణయింతురు గాక.
గమనిక: ఈ టపా వాస్తవానికి చందస్సు యాహూ గ్రూపులో భైరవభట్ల కామేశ్వరరావు గారు రాసినది. వారి అనుమతితో యూనీకోడీకరించి ఇక్కడ ఉంచుతున్నాం
