అసలు-నకలు

Wednesday, October 21, 2009
By పద్యం.నెట్

గోపికలు శ్రీకృష్ణుని వెదకుచు బృందావనములోని తరులతాపుష్పములను ఉద్దేశించి చెప్పిన పద్యములలో ఈ క్రింది పద్యము సుప్రసిద్ధమైనది. తెలుగుపై అభిమానమున్నవారు కంఠస్థము చేయవలసిన పద్యములలో ఇది ఒకటి.

కాని ఇట్టి పద్యమే మఱొకటి భాగవతములో నవమస్కంధములో నున్నది. అది శ్రీరాముని సంబోధించినది. ఆ పద్యము-

నల్లనివాడు పద్మనయనంబులవాడు మహాశుగంబులన్
విల్లును దాల్చువాడు గడు విప్పగు వక్షమువాడు మేలు పై
జల్లెడువాడు నిక్కినభుజంబులవాడు యశంబు దిక్కులం
జల్లెడువాడు నైన రఘుసత్తము డిచ్చుట మా కభీష్టముల్

ఇందులో ఏది అసలు, ఏది నకలు?

నల్లనివాడు పద్మనయనంబులవాడు కృపారసంబు పై
జల్లెడువాడు మౌళిపరిసర్హితపించమువాడు నవ్వు రా-
జిల్లెడుమోమువాడొకడు చెల్వలమానధనంబు దెచ్చె నో
మల్లియలార మీపొదలమాటున లేడు గదమ్మ చెపరే

ఏది అసలో ఏది నకలో ఖచ్చితంగా చెప్పలేము కానీ, మొదటి పద్యం(కృష్ణుని గురించినది) రెండవ దాని(రామునిపై చెప్పింది)కన్నా మేలైనది, సొగసైనదీ అనడంలో ఏమాత్రం సందేహం లేదు. బహుశా అందుకే మొదటిది అంత ప్రాచుర్యం పొందింది. రెండు పద్యాలూ చదివితే చాలు ఆ తేడా తెలుస్తుంది. మొదటి పద్యంలో ఉన్న సొగసు, రెండవ పద్యంలో లేనిది ఏమిటీ అని తరచి చూస్తే ఆ తేడాలను కూడా సులువుగానే గుర్తించ వచ్చు.

* సందర్భం – కృష్ణుని విషయంలో గోపికలు వెతికే సందర్భం ఆ వర్ణనకి చక్కగా కుదిరింది. రామునిపై పద్యానికి అంత చక్కని సన్నివేశం లేదు.
* తెలుగులో “నల్లని వాడు” అన్న పదం (నల్లనయ్య మొదలైనవీ) కృష్ణునికి ప్రసిద్ధమైనంతగా రామునికి కాలేదు. రాముణ్ణి కొంచెం గంభీరంగా “నీలమేఘ శ్యాముడనో” మరొకటో అంటాం. కృష్ణుడి పేరులోనే ఆ నల్లదనం ఉంది కాబట్టి బహుశా అతడికే అది అంతగా ఒప్పింది. పైగా ఆ పదం గోపికల నోటినుండి వెలువడడం మరికొంత సొగసు.
* మొదటి పద్యంలో, ఎంతవరకూ వర్ణన అవసరమో అంతదాకనే (మూడవ పాదం మొదటి వరకూ), అంటే కృష్ణుణ్ణి పోల్చుకోడానికి ఏ లక్షణాలైతే అవసరమో వాటిగూర్చే వర్ణన ఉంది, పద్యమంతా అనవసరంగా పొడిగించలేదు. రెండవ దానిలో అది జరిగింది.
* మొదటి పద్యంలో “లేడు గదమ్మ చెప్పరే” అన్న మంచి వ్యావహారిక ప్రయోగం ఉంది.
* “మేలు పై జల్లెడు వాడు” అన్నదానికన్నా “కృపారసంబు పై జల్లెడు వాడు” ఎంతో చక్కని పదప్రయోగం, అర్థాలు ఒకటే అయినా.
* రెండవ పద్యంలో “జల్లెడువాడు” అన్న పదం పునరుక్తమయ్యింది.
* రెండవ పద్యం చివరి పాదం శైలి బంధురంగా లేదు. నన్నయ్యగారి “మాకు ప్రసన్నుడయ్యెడిన్” అన్న పద్యాలని కొంత అనుకరించే ప్రయత్నం కనబడుతోంది.

మొదటి రెండు కారణాల వల్లా కృష్ణునిపై పద్యమే అసలు, రెండవది నకలు అని అనుకోవచ్చునేమో. అసలు రామునిమీద పద్యం ప్రక్షిప్తం కూడా అయ్యుండవచ్చు.

సందేహం లేని మరొక నకలు పద్యం:

నల్లనివాడు రక్తనయనమ్ములవాడు భయంకర స్వరూ
పోల్లసనమ్మువాడు గదనూని మహామహిషమ్ముపై ప్రవ
ర్తిల్లెడివాడు నా ప్రణయదేవుని జీవధనమ్ము తెచ్చె నో
భిల్ల పురంధ్రులార! కనిపింపడుగా దయచేసి చెప్పరే!

ఇది పోతనగారి మీద తనకున్న భక్తిని చాటుకోడానికి కరుణశ్రీ గారు చేసిన అందమైన అనుకరణ. ఉదయశ్రీ లోని “సతీ సావిత్రి” ఖండికలోనిది.

గమనిక: ఈ టపా వాస్తవానికి చందస్సు యాహూ గ్రూపులో భైరవభట్ల కామేశ్వరరావు గారు రాసినది. వారి అనుమతితో యూనీకోడీకరించి ఇక్కడ ఉంచుతున్నాం

Tags:

ఒక వ్యాఖ్య to “అసలు-నకలు”

  1. Acharya Phaneendra

    అసలు, నకలు ఏంటండి? రెండూ పోతన గారు రచించిన అసలైన పద్యాలే. పోతన రామ భక్తుడు. ఆయన కృష్ణునిపై ఒక మంచి పద్యం వ్రాసాక అదే శైలిలో తన ఇష్ట దైవంపై మరొక పద్యం వ్రాయ కూడదా ఏమిటి?
    పోతనపై గౌరవంతో, ఆధునిక కాలంలో కూడా చాలా మంది ఈ పద్యాలను అనుకరిస్తూ పేరడీలను రచించారు. కరుణశ్రీ, దాశరథి … ఇలా ఎందరో! ఇటీవల నేను కూడా ఈ పద్యాన్ని అనుకరిస్తూ ’ఒబామా’పై ఒక పద్యాన్ని రచించాను. అవధరించండి -
    నల్లని వాడు- లోతు నయనంబుల వాడు- మనుష్యులం దిలన్
    తెల్లగ, నల్లగా యనుచు దేహపు వన్నెల భేద ముల్లమం
    దొల్లని వాడు- నిమ్న జను లుల్లసిలంగ ’ఒబామ’ శ్రేష్ఠుడై
    ’తెల్లని ఇల్లు’ సాక్షిగ అధీశ్వరుడయ్యె ’అమేరికన్ల’కున్ !
    -డా.ఆచార్య ఫణీంద్ర
    (తెల్లని ఇల్లు = white house)

    #2

వ్యాఖ్యానించండి

Loading