పచ్చనైన చెట్టు పద్యమయ్యె!
పద్యప్రియులకి స్వాగతం! ఈ పద్యాల కసరత్తు శీర్షికలో మీరందరూ పాల్గొని చక్కని పూరణలు, పద్యాలు రచిస్తారని ఆశిస్తూ… మొట్టమొదటి అంశం:
“పచ్చనైన చెట్టు పద్యమయ్యె!”
ఇది సమస్య. ఇది ఆటవెలదిలో ఒక పాదం. సమస్యని పూరించడమంటే, ఇచ్చిన పాదం వచ్చేట్టుగా మిగిలిన పద్యాన్ని అర్థవంతంగా పూర్తిచెయ్యడం.

కొమ్మలన్ని గూడి కవిత పాదములన
గణములన్ని జేరి గాదములుగ
అచ్చ తెనుగు లోన అద్భుతముగ నొప్ప
పచ్చనైన చెట్టు పద్యమయ్యె !
(గాదము – ఆకు)
మూడవ పాదం లో, ౪ వ, ౫ వ గణాలు సరిగా లేవేమో అని అనుమానం. ఓ సవరణతో..
కొమ్మలన్ని గూడి కవిత పాదములన
గణములన్ని జేరి గాదములుగ
అచ్చ తెనుగు లోన ఆట వెలది
పచ్చనైన చెట్టు పద్యమయ్యె !
రవి -
క్షమించాలి. పొరబాటు…
కొమ్మలన్ని గూడి కవిత పాదములన
గణములన్ని జేరి గాదములుగ
అచ్చ తెనుగు లోన అద్భుత రీతిని
పచ్చనైన చెట్టు పద్యమయ్యె ! Quote
కామేశ్వర రావు –
రవిగారు,
బోణీ చేసారన్నమాట! “అద్భుతముగ నొప్ప” గణాలు సరైనవేనండి. “ముగ నొప్ప” అన్నది “స ల”ము. ఇది ఇంద్రగణమే. ఉప్పుకప్పురంబు పద్యంలో మొదటి పాదం చివర “లిక నుండు” అని ఉంటుంది కదా, అది ఇదే గణం.
ఒకసారి వీలుచూసుకొని వికీలోని ఛందస్సు వివరాలు చూడండి. మీలాటి ఆసక్తిగలవాళ్ళు ఓపిక చేసుకొని చూస్తేనే ఆ వికీకి, యీ సైటుకి సార్థక్యం
మొదటి పాదంలో మాత్రం యతి కాస్త తప్పింది. “కొ”కి “క”కి యతి చెల్లదు, వాటిల్లోని అచ్చులు కలవ్వు కాబట్టి.
“కొమ్మలన్ని గూడి కొమరు పాదములుగ” అంటే సరిపోతుంది.
ఆదిత్య –
పారిజాత పుష్ప పరిమళాలనుబీల్చి
మునులవోలె కృష్ణమూలమందు
కల్పవృక్షఛాయ కవిహాలికులు చేర
పచ్చనైన చెట్టు పద్యమయ్యె!
sanath kumar –
తేట తెనుగు గాలి తెమ్మెరలు ‘గద్యాలు’,
స్వాంత ‘వచన’ విరులు, స్వాగతింప,
సేద దీర్చి అతిథి సత్కార ములుసే
పచ్చనైన చెట్టు ‘పద్య ‘ మయ్యె !!
సత్యనారాయణ –
తాటి పత్రమందె మేటి కృతులు పుట్టె
కాగితమ్ము లేని కాలమందు
కవి వరుడు రసమయ కావ్యము వ్రాయగ
పచ్చనైన చెట్టు పద్యమయ్యె!
హరి దోర్నాల –
పద్య మందు చూడ పలురసంబులు నుండు
రుచులు చూడ చూడ రసము లూరు
పలు రసముల తోడి ఫలముల నందించు
పచ్చ నైన చెట్టు పద్య మయ్యె
కంది శంకరయ్య –
గుబురులై మెరసెడి గురు లఘు పత్రాలు
కల రవముల పక్షి గణము లొప్ప
యతులు తపము సేయు నట్టి ప్రాసాదమై
పచ్చనైన్ చెట్టు పద్యమయ్యె.
చల్లనైన నీడ నుల్లమలర నొసఁగె
పచ్చనైన చెట్టు – పద్యమయ్యె
నా యెడందలోన నర్తించు భావమ్ము
లలిత పద విలాస లతిక కాఁగ.
sanath kumar –
రామ కథల కల్ప వృక్షమ్ము నననేమి?
కాండలందు ఇక్షు ఖండ మెట్లు
అలరె? నంచు గురుడు అడుగ శిష్యుడు తెల్పె
‘పచ్చనైన చెట్టు’, ‘పద్య మయ్యె’ !!
sanath kumar –
గరళ తరులు నీదు కరుణ సోకగ నెట్లు
మరలె మరల మరులు మరువలేక?
అమృత కరము నైన కర పత్రమేదయ్యె?
‘పచ్చనైన చెట్టు’, ‘పద్య మయ్యె’ !!
* గరళ తరువు = విష వృక్షం.
రాకేశ్వర రావు –
వింట వసుధ వ్రాసెఁ వృక్షమను కవిత
నరికి దాన్ని పుఠలు నరుడు జేసెఁ
పచ్చనైన చెట్టు పద్యమయ్యె నకటా
ధరణికంటెఁ సుకవి ధరన లేడు.
based on
“Trees are poems the earth writes upon the sky, We fell them down and turn them into paper,
That we may record our emptiness.”
— Khalil Gibran