దాశరథి: రెండు పద్యాలు, కొన్ని ఊసులు
నాజీ నైజాం రోజులు. వరంగల్ సెంట్రల్ జైలు. హఠాత్తుగా ఒక అర్థరాత్రి తమ తమ వస్తువులన్నీ సర్దుకొమ్మని రాజకీయఖైదీలందరికీ ఆదేశం అందింది. ఖైదీలందరు నిజాం ప్రభువు నిరంకుశత్వాన్ని ఎండగడుతున్న కవులూ రచయితలూను. వారిలో “నా తెలంగాణ కోటి రతనాల వీణ” అన్న అజరామరమైన మాటలన్న మహాకవి, నాటకకర్త, అనువాదకులు, వ్యాసరచయిత దాశథి గారు కూడా ఉన్నారు.
అసలే నిజాం నిరంకుశుడు పైగా మూర్ఖుడు. ఉన్నఫళాన రాజకీయ ఖైదీలండరినీ మూటాముల్లే సర్దుకొమ్మని ఆదేశాలివ్వడం అంటే, వీరికి గుండేల్లో గుబులు పుట్టకమానదు. రాత్రికి రాత్రి ఏ అడవికో తీసుకెళ్ళి కాల్చి చంపేస్తారేమో! అప్పటికే కాళోజీ నారాయణ రావును, వట్టికోట ఆళ్వారు స్వామిని ఇలాగే చెప్పాపెట్టకుండా హఠాత్తుగా ఎక్కడికో తీసుకెళ్ళేరు, తర్వాత వారి జాడ లేదు. ఈ నేపధ్యం లోభయం భయం గానే ఖైదీలందరూ తమ తమ సామాన్లు సర్దుకుని జైలు బయట ఉన్న పోలీసు వ్యాన్లు ఎక్కారు. మొత్తం ముప్ఫై మంది ఉంటారు, వీరికి కాపలాగా అరవైమంది సాయుధ పోలీసులు.
ఎన్నిరోజులుగా జైల్లో ఉన్నారో, ఒక్కసారిగా హేమంత కాలపు చలిగాలి, ఎల్లలు లేని స్వేచ్ఛావాయువు తాకగానే దాశరథి గారికి ఉత్సాహం వచ్చింది. పూర్వం “విక్రమాంక దేవ చరిత్ర” అనే సంస్కృత మహాకావ్యాన్ని రాసిన కవి బిల్హణుడు ఉండేవాడు. ఆయన మరో రచన “బిల్హణకావ్యం” అద్భుతమైనది గా పండితులచే ప్రశంశలందుకోబడ్డది. ఆ కావ్యాన్ని కవి అంతఃపుర యువరాణి ని దృష్టిలో ఉంచుకుని రాసాడేమో అన్న అనుమానం బయలుదేరింది రాజుగారికి. “రాజుల్ మత్తులు” అన్నాడు మహాకవి ధూర్జటి. రాజుగారికి అనుమానమొస్తే ఏం చేస్తాడు? అదే చేసాడు, బిల్హణుడికి మరణదండన విధించాడు. వధ్యశిలకు వెళ్తూ వెళ్తూ బిల్హణుడు “అద్యాపి” అనే పదం తో మొదలెట్టిఅధ్బుతమైన శ్లోకాలు చెప్పనారంభించాడట.
మన దాశరథి గారేం బిల్హణుడికి తీసిపోలేదు. వధ్యశిల కు వెళ్తున్న బిల్హణుడిలా రైల్లోకూర్చుని తన సహచరులనుద్దేశించి “చలిగాలి” అన్న పదం తో ప్రారంభమయ్యే కందపద్యాలను ఆశువు గా చెప్పనారంభించాడు. అక్కడ కలం లేదు, దీపం లేదు, కాగితం లేదు. మొత్తం ముప్ఫైమంది సహచరులున్ారు, ఈయన 27 పద్యాలను ఆశువు గా చెప్పాడు. తలా ఒకటి గుర్తుపెట్టుకుని ఉంటారు. అందులో ఒకటి..
“చలిగాలి పలుకు వార్తలు
చెలిగాలినిబోలి వలపు చిరువెచ్చదన
మ్ములు గుండెలలో నింపెను.
చెలికాడా! జైలు బయట చిత్తమ్మలరెన్”
దీని లిటరరీ వాల్యూ మీద వ్యాఖ్యానించగలిగేంతటి పాండిత్యం ఈ వ్యాస రచయితకు లేదు. కానీ ఒక సామాన్య పాఠకుడి దృష్టి నుంచి నా స్పందన చెబుతాను. కవి ఎంత చమత్కారి చూడండి… చలిగాలి ని చెలిగాలి తో పోలుస్తూ.. అది చిరు వెచ్చదనాన్ని గుండెలలో నింపిందని చెబుతున్నాడు. చల్లని గాలి మీ గుండెలలో వెచ్చదనాన్ని నింపితే ఎలా ఉంటుందో, ఈ పద్యం చదివితే అర్థమ్ అయిపోదూ!! ఇక ఈ పద్యం చివరిపాదం చదవగానే ఎందుకో నాకు చిన్నప్పుడు “చాటువులు” పాఠం లో చదువుకున్న శ్రీనాధుల వారి “పరమేశా! గంగ విడుము పార్వతి చాలున్” గుర్తొచ్చింది, అన్నట్లు, ఇక్కడ “చెలికాడా! ” అని దాశరథి గారు అన్నది పక్కనున్న తన స్నేహితుడు జంగారెడ్డి ని.
జంగారెడ్డి అన్నాడు, “చావబోతుంటే పద్యాలేంటయ్యా కవీ” అని. దాశరథి అన్నాడు – “ఇక్కడ కాగితం లేదు, కలం లేదు, దీపం లేదు. కానీ గళం ఉంది. కోపం ఉంది. మృత్యువు ముఖాన ఉమ్మేసి, శాశ్వత చైతన్య పదాల మీద అమర ప్రయాణం చెయ్యాలనే తెగువ ఉంది. ధారణా శక్తి ఉంది. ఆశుధారా కవన జవనాశ్వాలు ఉన్నాయి, ఇక దిగులేల” . “మనం బతకడానికి కాదు కదా ఉద్యమంలో దూకింది? నీకుఇంటికి వెళ్ళే ఆశలేదు కదా? అయినప్పుడు చద్దాం.భరతమాత పాదాలకు మన రక్త పద్మాలతో పూజ ఈ రాత్రి. జంగా రెడ్డీ భయపడకు, చావు కూడా పెళ్ళి లాంటిదే!”
ఒకసారి కవితావేశం వచ్చాక ఆగుతుందా చల్లారే దాకా? దాశరథి మరో పద్యం లోకి వెళ్ళిపోయాడు…
“చలిగాలి పీల్చి చెలి కౌ
గిలి లో శయినించినట్లు కేవల భావో
జ్జ్వల వీధుల పయనించగ
విలపించగనేల? భీతి విడువుము మిత్రా!”
ఇలా ఏకబిగిన ఆశువుగా 27 పద్యాలు చెప్పారు దాశరథి. ఇది అంత గొప్ప విషయమా, ఇంతకు ముందు ఆశువుగా పద్యాలు చెప్పిన వారు లేరా? అయినా వీటి లిటరరీ వాల్యూ ఎంత అన్న విషయాల మీద మాట్లాడే పాండిత్యం నాకు లేదు గానీ, నన్నాకర్షించిన విషయం, ఈ పద్యాలు చెప్పిన ఆ సందర్భం. దాశరథి గారి దమ్ము, చతురత. “యాత్రాస్మృతి” లో ఈ రెండు పద్యాలు మాత్రమే దొరికాయి నాకు, మిగతావి ఎక్కడ దొరుకుతాయో మీరెవ్వరైనా చెప్పగలరా?
ఈ వ్యాసాన్నిప్పుడు దాశరథి గారి మరో పద్యం తో ముగిస్తాను.
కాలపు కంటిలో కరకు కత్తులు గ్రుచ్చి, మెరుంగు నెత్తురుల్
కాలువ కట్టి తెచ్చి, ధన కాళికకున్ బలి ఇచ్చి, యెన్ని కా
లాలు వరమ్ము లందెదరురా? నిరుపేదల బూది మోమునన్
దాలిచి భక్తియుక్తుల సదాశివునన్ బులిపించ నెంచుచున్? (కాలపు కంటిలో…..1: అగ్నిధార)
