పద్దెము వ్రాయుచున్ వెనుక వైపున చూడకు
దాశరథి వారి “అగ్నిధార” నుంచి కొన్ని పద్యాలు….
పద్దెము వ్రాయుచున్ వెనుక వైపున చూడకు లేఖినీ! మహా
పద్దశ దాపురించును, గబా గబ లాగుము వేనవేలుగా
పద్దెము; లర్థవాదములపై కను లుంచకుమా! పదావళుల్
ముద్దులు గార్చుచున్ కనుల ముందర తాండవ మాచరించెడిన్ – మహాలేఖిని .1 : అగ్నిధార
త్వరపడు! భావసాగరము బాహువు లెత్తుచు నీ శిరస్సు పై
పొరలుచు వచ్చుచున్నది; కవుంగిలిలో కవితాకుమారి సం
బరపడి నవ్వుచున్నది; గబా గబ కూర్చుము పద్యరాశి; అ
ర్థ రహితమంచు పల్కెడి కళా రహితున్ పడద్రోసి సాగుమా! – మహాలేఖిని . 2: అగ్నిధార
నాదొక వెఱ్ఱిః; త్రాగుడున నాడును వీడును అమ్ముకొన్న ఉ
న్మాదివలెన్ కవిత్వమున నా సకలమ్మును కోలుపోయి రా
త్రీ దినముల్ రచించితిని తీయని కావ్య రస ప్రపంచముల్;
వేదన యేదియో కలత పెట్టును గుండియ నెందుచేతనో? – మహాలేఖిని . 4: అగ్నిధార
కొండలు కొండలే అడవి కోనల భగ్గున మండిపోవ, నా
గుండెలు గుండెలే అరుణ గోళములై ప్రళయాగ్ని మాలలై
మండుట చోద్యమా? మధుర మంజుల మామక లేఖినీ ముఖం
బెండకు మందిపోయి రచియించును గ్రీష్మ మహా ప్రబంధముల్ – మహేలేఖిని . 5: అగ్నిధార
నా కఠినీ ముఖాంతరమునన్ నవనీల విశాల నీరదా
నీకము వచ్చి డాగి, దయనీయముగా విలపింపగా, అసం
ఖ్యాకముగా మదీయ ఖటికా లుఠితస్ఫుట పద్యజాలముల్
వాకలు వాకలై అలుగు వారును గుండెలు పొంగిపోవగా – మహాలేఖిని . 6: అగ్నిధార
