జనార్దనాష్టకము

Wednesday, October 21, 2009
By పద్యం.నెట్

జనార్దనాష్టకము రచించినది కందుకూరి రుద్రకవి అని పరిశోధకుల అభిప్రాయం. ఇతనిది పదహారవ శతాబ్దం. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోని అష్టదిగ్గజాలలో ఇతనొకడని కొంతమంది అంటారు. రుద్రకవి ఇతర రచనలు: నిరంకుశోపాఖ్యానము, సరసజన మనోరంజనము అనే కావ్యాలు, సుగ్రీవవిజయము అనే యక్షగానం (ఇదే మనకి లభిస్తున్న యక్షగానాలలో అతి ప్రాచీనమైనది) మొదలైనవి.

సిరులు మించిన పసిమిబంగరు జిలుగుదుప్పటి జాఱఁగాఁ
జరణపద్మముమీఁద, దేహము చంద్రకాంతులు దేరఁగా
మురువుచూపఁగ వచ్చినావో మోహనాకృతి మీఱఁగా
గరుడవాహన! దనుజమర్దన! కందుకూరి జనార్దనా!

ఆనపెట్టిన రాకపోతివి ఆయెఁబో అటుమొన్ననూ
పూని పిలువఁగ వినకపోతివి పొంచిపోవుచు మొన్ననూ
నేను జూడఁగఁ గడచిపోతివి నీటుచేసుక నిన్ననూ
కానిలేరా, దనుజమర్దన! కందుకూరి జనార్దనా!

నిన్నరాతిరి చవికెలోపల నీవు చెలి కూడుంటిరా
ఉన్నమార్గము లన్నియును నే నొకతెచేతను వింటిరా
విన్నమాత్రము కాదురా నిను వీధిలోఁగనుగొంటిరా
కన్నులారా, దనుజమర్దన! కందుకూరి జనార్దనా!

దబ్బు లన్నియుఁ దెలిసికొంటిని తప్పుబాసలు సేయకూ
మబ్బుదేరెడి కన్నుగవతో మాటిమాటికి డాయకూ
ఉబ్బుచేసుక తత్తఱంబున నొడలిపైఁ జెయివేయకూ
గబ్బితనమున, దనుజమర్దన! కందుకూరి జనార్దనా!

బిత్తరంబున మొలకకెంపులు పెదవి నెవ్వతె ఉంచెరా
గుత్తమైనమిటారిగుబ్బలగుమ్మ యెవ్వతె మెచ్చెరా
చిత్తగించక జీరువారను చెక్కి లెవ్వతె నొక్కెరా
కత్తిగోరుల, దనుజమర్దన! కందుకూరి జనార్దనా!

అండబాయక కూడియుంటిమి ఆయెఁబోయెను నాఁటికి
ఖండిమండిపడంగ నేటికి? కదలు మెప్పటిచోటికి
ఉండరా నీమాటలకు నే నోర్వఁజాలను మాటికి
గండిదొంగవు దనుజమర్దన! కందుకూరి జనార్దనా!

అలుక లన్నియుఁ దీఱ నివు నాయండ కెప్పుడు వస్తివి
పిలిచి నవరత్నాలసొమ్ములు ప్రేమతో నెపు డిస్తివి
వలచి వలపించియును గూరిమి వదల కెప్పుడు మెస్తివి
కలసి వేడుక దనుజమర్దన! కందుకూరి జనార్దనా!

జంటనేత్రము లంటి చూచితె జాజిపూవులు పూచెరా
మింటిత్రోవను జూచుచుండఁగ మేఘవర్ణము గప్పెరా
కంటిలో నొకపండువెన్నెల కాయుచున్నది యేమిరా
కంటిలేరా! దనుజమర్దన! కందుకూరి జనార్దనా!

Tags:

వ్యాఖ్యానించండి

Loading