పానశాల – అమర్ ఖయ్యాం ల వైశిష్ట్యము

Thursday, October 22, 2009
By పద్యం.నెట్

వ్యాస రచయిత: శ్రీమతి భైరవభట్ల దేవీ ప్రకాష్

“తెలుగుందోటల బచ్చబీళ్ళ ననురక్తింబానశాలా ప్రతిష్ఠలు” గావించిన కవితా కృషీవలుడు కవికోకిల శ్రీ దువ్వూరి రామిరెడ్డి. “భావనోద్యానమునందు”, రసోజ్వల మార్గమునాశ్రయించి, “రసార్ద్రీభూతచేతనమ్ముతో” ఉమర్ ఖయాం ను “అమర్ ఖయాం” గా మలచిన సుమ సుకుమార హృదయుడు డా|| కరుణశ్రీ జంధ్యాల పాపయశాస్త్రి. “పానశాల”, “అమర్ ఖయాం” కావ్యాలనడుమ సుమారు 60 సం||ల అంతరమున్నది. సహస్రాధికంగా ఉన్న ఖయ్యాం రుబాయీలను 125 పద్యాలుగా శ్రీ దువ్వూరి రచించేరు. కరుణశ్రీ 142 పద్యాలుగా “అమర్ ఖయాం” గా అనువదించేరు. మూలం ఒకటే అయినా భావ వ్యక్తీకరణంలో, భాషా సౌందర్యంలో కాలానుగుణ్యమైన కొన్ని తేడాలు కనిపించక తప్పదు. అంతే కాక అన్ని రుబాయిలను అనువదించకపోవడం వల్ల యివి రెండూ కేవలం అనువాద కావ్యాల వలె మక్కికి మక్కీగా కాక దేనికదే స్వతంత్ర కావ్యంలా విలసిల్లేయి.

వేమన ఆటవెలదుల వలె ఖయాం రుబాయితులు కూడా ఏకబిగిన సాగినవి కావు. అక్కడక్కడ, ఆయా సందర్భానుసారముగ చెప్పడినవి. కనుకనే పరస్పర విరుద్ధభావములు కొన్ని చోట్ల, ఒకే భావముతో భిన్న పద్యములు వేరొక చోట కానవచ్చుచున్నవి. ఇందువలన ఖయాం జీవితము, తత్వము పలు ప్రశ్నలమయమైనది. ఉమర్ ఖయాం పూర్తి పేరు ఘియాత్ ఉద్దీన్ అబుల్ ఫతహ్ ఉమర్ బిన్ ఇబ్రహీం. ఖయ్యాం అన్నది కవితా నామము. క్రీ.శ. 18-5-1048 వ తేదీన జన్మించిన యితను “ఉమర్ ఖయ్యాం” గా జగద్విఖ్యాతి గాంచినాడు. సుమారు వెయ్యి సంవత్సరముల కాలంనాటి కవి ఖయాం.

ఉమర్ ఖయాం కొందరిదృష్టిలో కేవలం ఖానా, పీనా, మజా ఉడానా వినా పరలోకం పైన చూపులేని పరమ నాస్తికుడు. మరికొందరి దృష్టిలో దైవభక్తుడు;శీలసంపన్నుడు. జీవాత్మ పరమాత్మల నడిమి వంతెన వంటిదీ ప్రపంచమని, దీనినుపయోగించి జీవి జీవేశ్వరుని చేరుటకు యత్నింపవలెనని నమ్మినవాడు. ఈ ప్రపంచమును యథాతథముగ స్వీకరించుటకు కాని, తిరస్కరించుటకు కాని వీలులేదని, పరమార్థంమీద దృష్టితో ఇహాన్ని పాడుచేసుకోరాదని, జీవితాన్ని అందంగా, ఆనందంగా జీవించాలన్నవే ఖయాం ఆశయంగా భావించిన వారు కొందరు.

దువ్వూరివారి దృష్టిలో ఖయ్యాం భోగలాలసుడు, రసార్ద్రహృదయుడు అందులకే ప్రకృతి రామణీయకముని అద్భుతముగ వర్ణించెను. అంతే కాదు దేవుడే సకల చరా చర సృష్టికర్త. కుమ్మరి కుండలను చేసినట్లు సర్వేశ్వరుడు ఈ లోకమును సృజించును అని నమ్మినవాడు. సృష్టి కాలబద్ధము. విధి యనివార్యము. ఎందులకనగా….

“విషము నమృతంపు మసిబుడ్ల విధి కలంబు
ముంచి లోకులనుదుట లిఖించు మొదట;
గరు(గ దఱు(బేద కన్నీటి కాల్వనదియు;
పరమ భక్తుని అనుతాప వహ్ని( జెడదు
కాన నెది ప్రాప్తమైనను గారవించు
వలయు వలదని యేర్పరపంగలేవు”

అనుతాపము వలన నేమియు ప్రయోజనములేదు. పూజలవలన కష్టములు తొలగిపోవు. మరణము అనివార్యము. దు:ఖములు కూడ విధి నిబద్ధములు. వానికైచింతించక వీలైనంత వరకు సంతోషముననుభవింపవలెను. అందుకే..

” పరి శుష్కంబగు జీవనంబు రస సంపన్నంబు గావించు ని
ర్జర పానీయము వారుణీ రసము, బాత్రన్నింపి యందిమ్మ, యా
తుర దీరం జవిగొందు; జీవితము వాతూలంబులో దివ్వె! చె
చ్చెరగానిమ్ము; గతించు బ్రాయమదిగో శీఘ్రంబుగంబ్రేయసీ ! ”

అంటూ జీవితాన్ని రసమయం గావించే దేవతా పానీయంగా సురను వర్ణిస్తాడు. అంతే కాదు.. ” చెలియరొ నిన్ను నన్ను విరచించిన యప్పుడు సృష్టికర్త ముందల లిఖియించెనేమొ సురద్రావి సుఖింపగనాకు ; హృత్తటంబులు దెగి పార ప్రేమ రసపూరము గిన్నెల నింప నీకు” అంటూ తాను త్రాగుబోతయితే దానిక్కారణం భగవంతుడే నంటాడు ఖయ్యాం. కొండొక చోట సురాపానాన్ని సమర్థిస్తున్నదా .. అనిపించే కావ్యం దువ్వూరి “పానశాల”.

జంధ్యాల పాపయ శాస్త్రిగారు నిశ్చితముగా ఖయాము ఆస్తికుడనియే నిర్ణయించిరి. ఖయాము కవిత్వమునందువలె కరుణశ్రీ “అమర్ ఖయాం” నందును ప్రతీకల (సింబాలిజం) ప్రాబల్యమున్నది. శీధువు, మధువు, సుర, ద్రాక్షాసవము మొదలైన విధముగ పేర్కొనబడినది మద్యమేనని భౌతికవాదులందురు. కాని ప్రతీకవాదులు భగవంతుని అనుగ్రహముగా దాని గ్రహింతురు. కరుణశ్రీ అదేభావముతో ..”త్రావునుమర్ ఖయామనుచు తప్పులు పట్టు మహాత్ములీయహంభావులు పారశీకకవి భావమెరుంగరు” అంటూ, ” ఆ తండ్రిదే పరమానుగ్రహమంచు ద్రాక్షారసమున్ భావించి సేవించెదన్” అని ఖయాముచే పల్కించిరి. మానవాకృతి దాల్చిన భక్తి భావమట ఖయాము ప్రేయసి. మనసులో భక్తి కలుగవలెనన్నను భగవంతుని దయ అవసరమే. ఖయాము తొలి నోములపంటయైన ఈ ప్రేయసి “శ్రీ శుభోదయ”, “రసప్రియ”, “సాహితీ సమాశ్రయ”. కమనీయ కవితా శిల్పముతో కరుణశ్రీ ప్రదర్శించిన ప్రణయినీ చిత్రమిది…

” రసమయివై, సదా హృదయరంజనివై, యనురాగపూర్ణవై,
కుసుమితవల్లివై, మధురకోమల హాస విలాసరేఖవై,
అసదృశసుప్రసన్న ముఖివై, సఖివై మురిపించు నిన్ను, కై
వస మొనరించుకొంటి భగవంతుని చెంతకు చేరు కోర్కెతో!”

భక్తుని భగవంతుని వద్దకు చేర్చే మార్గమే భక్తి. ఊహల్లో కూడ ఎడబాటు సైరింపని వ్యక్తి ప్రేయసి. భక్తినే ప్రణయినిగా వడసిన ఉమర్ ఖయాము కరుణశ్రీ కలంలో “అమర్ ఖయాం” అయినాడు.

ఉమర్ ఖయాము రుబాయీలకు స్వేచ్ఛానువాదాలు “పానశల”, “అమర్ ఖయాం” లు. అవి రెండూ ఎంతటి స్వతంత్రరచనలైనా, వాని మూలం పారశీకమే. రెండూ పద్యకావ్యాలే కనుక పద్యనిర్మాణంలో, భావవ్యక్తీకరణంలో ఏకత కానరాక తప్పదు. ఒకే భావాన్ని, ఒకే వృత్తంలో ఎలా వ్యక్తం చేశారో గమనించండి.

” నిన్నటిరోజు కుమ్మరిని నే గనుగొంటి బజారు వీధిలో
మన్నొకముద్దజేసి మడమంజెడ ద్రొక్కుచు నుండ వానితో
దిన్నగ మందలించె నది దీనత, ” మెల్లగ నల్ల ద్రొక్కుమో
యన్న! యెరుంగవేనను ? నొకప్పుడు నీవలె నందగాడనే!”

అది కవికోకిల కలం.

” ఒక్కదినాన నేనడచు చుంటిని మంటిని రెండు కాళ్ళతో
ద్రొక్కు కులాలు గంటిని; ఎదో నుడి వింటిని;” అంత మోటుగా
త్రొక్కకు, క్రుమ్మబోకు మొకరోజున నీవలెనేను సైతమున్
జక్కనివాడనే! బలము సత్వము గల్గిన మానవుండనే!”

ఇది కరుణశ్రీ గళం.

ప్రాణవాయువు గాలిలో కలిసిపోగా శరీరం మట్టిలో కలసిపోతుందన్నది పెద్దల ఉవాచ. ఆ మన్ను కుంభకారుని అర్థించిన తీరు ఇందు వర్ణించబడినది.

దారుణమారణకాండను జరుపుచు , మానవసంఘరక్తము త్రాగుచున్నది హింసావాదము. దాని నిషేధానికై నడుంబిగించవలసిన తరుణమిది. రుధిరపానంకన్నా , మదిర పానం మిన్న అన్న ఖయాం భావాన్ని సున్నితంగా ఈ కవులు ఎలా తెలియజేసారో చూడండి…

” త్రావము జాహిదీలమని దంబము గొట్టెదవేల ? యంతక
న్నా విపరీతకృత్యములొనర్తువు నిత్యము; మాయవేషముల్
భావములోని కల్మషము, బాపునె? మానవ సంఘరక్తముం
ద్రావెదవీవు; ద్రాక్షఫలరక్తము మాకురుచించు నెప్పుడున్!”

రామిరెడ్డిగారి రుచి ఇది.

“త్రాగుట తప్పుకాదనుట తధ్యము; స్వార్ధపిశాచి కౌగిటన్
దూగుచు వేయినాలుకలతో నిరుపేదల వేడిరక్తముం
ద్రాగుటకంటె ఈ మధువు త్రాగుట మేలుగదయ్య! మారణో
ద్యోగులకంటె త్రాగి పడియుండెడివాడు ప్రశంసనీయుడే!”

పాపయశాస్త్రిగారి అభిరుచి అది,

ఒకనాటి తెలుగు పాఠకునికి, నేటి పాఠకునికి చాలా అంతరమున్నది. “పానశాల” నాటి పాఠకులు, పటిష్ఠమైన పదబంధాలని, ప్రౌఢకవిత్వాన్ని అభిలషించేవారు. కాలచక్రం గిర్రున తిరిగింది. జీవన విధానంలో వేగం పెరిగింది. అరవై వసంతాలు పూర్తి చేసిన “పానశాల” పాఠకుడు పసితనాన్ని పొందేడు. అందుకే చిన్నారి చిలుకపలుకులని, తేట తెనుగు సూటిదనాన్ని కోరుకుంటున్నాడు. ఆ కారణం చేతనే దువ్వూరి కవిత సంస్కృతపద సమ్మిళితమై శోభిల్లినది; కరుణశ్రీ కవిత పూలబాలలా పరిమళించినది, ప్రకృతి ఒడిలో పరవశించినది. దువ్వూరి తన కావ్యంలో ” జలజలమంచులార్భటులను”, ” పచ్చబయిళ్ళను”, ” పొలమున నేత్రపర్వాముగ పూచిన రాగవతీ సుమంబుల” శోభలను వర్ణించగలిగెను. కానీ కరుణశ్రీ కాలానికి కాలం మారింది. పచ్చని ప్రకృతి తరిగింది. శకటాశురుల రొద పెరిగింది. స్వార్ధపరులు, దగాకోరులు పెరిగేరు. అందుకే వారిని గూర్చిన హెచ్చరికలు కనిపిస్తాయి యితని రచనలో.

” జీవితమొక సార్ధవాహము, విచిత్రగతింబయనించు” నని దువ్వూరివారంటే, ” బ్రతుకొక చిత్రమైన పొగబండి, అయోమయమార్గమందు అద్భుతముగ పర్వులెత్తు” నంటారు కరుణశ్రీ. దువ్వూరి పానశాలలో ” గతము గతంబె ఎన్నటికి గన్నుల గట్టదు; సంశయాంధసంవృతము భవిషదర్థము; వివేకవతీ, యొక వర్తమానమే సతత మవశ్యభోగ్యమగు సంపద” అని బరువైన పదజాలంతో అంటే, ” నిన్న గతించిపోయినది నెచ్చెలి! మచ్చునకైన లేక; రేపన్నది యెట్టులుండునొ రవంత యెరుంగము; నేడు వచ్చినిల్చున్నది యింటిముంగిట” అని సూటిగా చెబుతారు కరుణశ్రీ.

ఖయాము రుబాయతులను అనువదించు సమయమున ఉర్దూ, పార్శీ మొదలైన అన్యదేశ్యాలు కూడ వీరి కావ్యాలలో చోటుచేసుకున్నాయి. వానిలో దౌలతు, మునాది, కౌసరు, బహరాము గోరి, బుల్బులిపిట్ట, సాఖీ, పాదుషా, సుల్తాను, జంషీడుపాత్ర, జాహిదీ, బాగదాదు, కూజా, తాజా, రోజా వంటివి గుబాళిస్తున్నవి. ఈ రెండు కావ్యాలలో మనం గమనింపదగ్గ విశేషమింకొకటి ఉన్నది. దువ్వూరివారు తమ పానశాలను సతి స్మృతికి నివాళిగా సమర్పించేరు. కరుణశ్రీగారు అనురాగమయియైన అర్థాంగి స్మృతికి అమర్ ఖయాం ను అంకితమిచ్చేరు.
కమ్మని మధువొలికే ఈ రెండు కావ్యాలు మహాసాగరాలు. ఎంత ఆస్వాదించినా తనివితీరదు. ఒక్కొక్క కావ్యమునుంచీ, ఒక్కొక్క రస గుళికలవంటి పద్యము చవిచూపించెదను. పానశాల పేరు వినినంతనే రసజ్జులమదిలో మెదిలే పద్యం…

“అంతములేని ఈ భువనమంత పురాతన పాంథశాల; వి
శ్రాంతి గృహంబు; నందు నిరుసంజలు రంగుల వాకిళుల్; ధరా
క్రాంతులు పాదుషాలు, బహరాం, జమిషీడులు వేనవేలుగా
గొంత సుఖించి పోయిరెటకో పెరవారికి చోటొసంగుచున్!”

జీవితము యొక్క అస్థిత్వమును తెలియజేసే దువ్వూరి పద్యంయిది.

తేట తెనుగు పదాలతో శబ్దశిల్పాన్ని సాధించగల నేర్పు కరుణశ్రీది. “కాకి కూత” తో దాన్నెట్లు సాధించెనో గమనించండి.

” స్థిరములు కావుకావు చలజీవితముల్; సిరిసంపదల్ సుఖం
కరములు కావు కావు ; పలుగద్దెలు మిద్దెలు నాత్మశాంతి కా
కరములు కావుకావు; నవకమ్ములు నిత్యము కావుకావటం
చరచుచు నుండెకాకి కనుమల్లదిగో బహరాముగోరిపై!”

కావుకావు అను ముక్తాయింపుతో గంభీరమైన విషయమును మిక్కిలి సులభముగా చెప్పుట ఇచ్చట ముచ్చట గొల్పును.

అంతములేక యీభువనమంత పొంగిపొరలిన ఖయాము కవితా సింధువులోని మధుబిందువును, ఆ మహాకవి జన్మదిన సందర్భముగ, ఆంధ్రసాహితీ పిపాసులకు అందజేస్తున్నాను. ఆ పారశీక కవిచంద్రునకు నా సహస్రసలాములు.

శ్రీమతి భైరవభట్ల దేవీ ప్రకాష్

Tags:

వ్యాఖ్యానించండి

Loading