కరుణామయి
రాధా విరహాన్ని వర్ణించే కరుణశ్రీ పద్యాలు కొన్ని (నాకు గుర్తున్నవి), ఆస్వాదించండి:
నీ చిరునవ్వు పాటలు ధ్వనించెడి మామక మానసమ్ములో
లేచెనురా ప్రఫుల్ల మురళీ రవళీ రమణీయ భావనా
వీచి దృగంచలమ్ముల ద్రవించి స్రవించు మనోనురాగముల్
దాచుకొనంగలేని పసిదాననురా విసిగింప బోకురా
శ్రీయుత మూర్తియై కరుణ చిందెడి చూపులతోడ స్వామి వేన్
చేయును పాదపూజ దయసేయును మాకను సంబరాన ఆ
ప్యాయముగా త్వదీయ పథ మారయుచున్నవి నేడు పూచియున్
బూయని పచ్చ పట్టు పరుపుల్ గొని శ్యామల శాద్వలీస్థలుల్
నిద్దపు ముద్దుమోవి పయనించు భవన్మురళీ రవమ్ములో
నిద్దురవోయినట్లు శయనించె సమస్తము సద్దులేని యీ
యద్దమరేయి ఒంటిగ రహస్యముగా తపియించు గుండెపై
నద్దుకొనంగ వచ్చితి దయామయ నీ చరణారుణాబ్జముల్
యేది మరొక్కమారు హృదయేశ్వర గుండెలు పుల్కరింపగా
ఊదగదోయి ఊదగదవోయి సుధామయ యుష్మదీయ వే
ణూదయ రాగడోలికల నూగుచు విస్మృతిలో విలీనమై
పోదును క్రొవ్వలపు పువ్వులు ముగ్ధ పరీమళమ్ములో
నీ దరహాసచంద్రికలు నిండిన నా హృదయాంగణమ్ములో
లేదు గదా తమస్సు లవలేశము ప్రేమ సుధానిధాన నే
డీ దయనీయ దాసి భరియింపగ లేదిక నీదు ప్రేమలో
పేదరికమ్ము మేను మరపింపుము మోహన వేణుగీతికల్
ఇదియది యంచు తేల్చి వచియింపగ రాని విషాదమేదియో
హృది కదలించుచున్నది దహింపగ సాగె నిరాశ శుష్కమౌ
బ్రదుకును స్నిగ్ధ శీతల కృపా రసధారల దుర్దినమ్మునే
సుదినము జేయరా యదుకిశోర కృశాంగిననుగ్రహింపరా
నీరసమైన నీ ప్రణయినీ హృదయమ్మిది మెల్లమెల్లగా
నీ రసగీతిలో కరగి నీరయిపోవుచునుండె మోహనా
కార రవంత వచ్చి కనికారము చూపవయేని కాల్వలై
యేరయి పొంగిపొర్లి ప్రవహింపదొ గోకులమాకులమ్ముగన్
రాధనురా ప్రభూ! నిరపరాధనురా! అనురాగభావనా
రాధన మగ్న మానసనురా! కనరా కరుణింపరా మనో
వీధి పదే పదే కలకవేయుచునున్నవిరా పురా రహో
గాథలు యీదలేనిక అగాధ తమోమయ కాలవాహినిన్
ఈ టపా వాస్తవానికి చందస్సు యాహూ గ్రూపులో భైరవభట్ల కామేశ్వరరావు గారు రాసినది. వారి అనుమతితో యూనీకోడీకరించి ఇక్కడ ఉంచుతున్నాం
