సాగింతును రుద్రవీణ పై…

Wednesday, October 21, 2009
By పద్యం.నెట్

అవి ఒట్టి పదాలు కాదు. ఛందస్సనబడే వాయిద్యాలలో నిప్పు రవ్వల్లాంటి అక్షరాలను పక్క పక్కన పోసి ధ్వనులూ, యుద్ధ నగారాలూ మోగిస్తే ఎలా ఉంటుంది? దాశరథి కృష్ణమాచార్య పద్యాలు చదవండి, తెలుస్తుంది.

పాఠకులెవ్వరూ సాహితీ ద్రష్టలై ఉండాల్సిన పనిలేదు. భాషా పండితులై ఉండాల్సిన అవసరం లేదు. కవి హృదయం సరిగ్గా పట్టగలిగారా, అదృష్టవంతులే.. లేకపోయినా నష్టం లేదు. పదాతి దళాల పదఘట్టనల చప్పుడూ, ఉరకలెత్తి ప్రవహించే నదీప్రవాహపు హోరు, మత్తెక్కినట్టు ఢీకొనే మబ్బుల జోరు – ఇవేవీ *అర్థం* కానవసరం లేదు, మనల్ని కదిలించడానికి!

చదవుకోండి, మీ మస్తిష్కాన్ని కవాతు చేయించండి! :)

ఈ కొరగాని లోకమున కిప్పుడె నిప్పురగిల్చి కాల్చి, నా
లో కదలాడు నూహలకు రూపమొసంగి పునస్సృజింతు; న
ఱ్ఱాకట గుందు పేదలకు బ్రహ్మ లిఖించిన కొంటెవ్రాతలో
వ్యాకరణమ్ములేదు, రసభంగిమ కానగరాదదేలనో! (స్వామి పూజ 7: రుద్రవీణ)

నీకు మదీయ రక్తకణ నిర్మితమైన ప్రవాళ మాలికా
నీకము తెచ్చి యిచ్చెద; రణించెద నా నవనాడులందు వీ
ణా కమనీయ గీతములు; నా బ్రతుకంతయు కప్పురంబుగా
నీకు నివాళి నిచ్చెదను, నిక్కము; చంద్రకళా శిఖామణీ! (స్వామి పూజ 6: రుద్రవీణ)

రమణీయార్క మరీచిమాలిక తమిస్రా ఘోర గాఢాంధకా
రములన్ పిప్పి యొనర్చి, కాంతిరసధారల్ పిండి, ప్రాచీన దే
శములన్ వాగులు పోయుచున్నది; ప్రతీక్షామగ్న మాదృక్ ప్రజా
సముదాయమ్ముల దప్పి తీర్పుమి ఉషస్సంధ్యా మృగీలోచనా! (ఉషస్సుందరి 7: రుద్రవీణ)

ఆమె జగత్కుటుంబిని, దయామయ, ఆదిసవిత్రి, భూదివ
స్స్వామిని, దీనబాంధవి, విషాదభరాంతర శాంతి కృత్‍చిరిం
ఆమె మాటీపాదములనే స్మరియించెదణి, జీవితాంతమున్
నామది యామెకున్ గృహమునన్ రచియింతు ననేకపద్యముల్ (వధూనిక 9: అమృతాభిషేకము)

నా కవితా లతాంతము తృణమ్ములలో నయినన్ సువాసనల్
ప్రాకెడిరీతి పూచినది; ప్రాతదనమ్మును త్రావి త్రేన్చి నా
జూకగు క్రొత్త వాసనలు చూపిన దీ రసికాంధ్ర సాహితీ
లోకమునందు నంతట తళుక్కను వెన్నెల వెండి తీవెలన్ – (రససమాధి.6: రుద్రవీణ)

గొంతుకలెండి, డొక్కలకు కొంచెము గంజియు లేకపోయినన్
పంతము నెగ్గగావలెను; ప్రాణము పోయిననుగూడ సమ్మెగా
వింతు మటంచు అకట తపించెడి పేదల గూర్చి నేను మ్రో
గింతును రుద్రవీణ; పలికింతును విప్లవ గీతికావళుల్. (మూర్ఛన. 4: రుద్రవీణ)

చింతల తోపులో కురియు చిన్కులకున్ తడిముద్దయైన బా
లింత యొడిన్ శయించు పసిరెక్కల మొగ్గనువోని బిడ్డకున్
బొంతలు లేవు కప్పుటకు; బొంది హిమంబయిపోవు నేమొ? సా
గింతును రుద్రవీణ పయి నించుక వెచ్చని అగ్నిగీతముల్ (మూర్ఛన. 3: రుద్రవీణ)

కుంతలముల్ కపోలములకున్ దగులన్, నయనాంచలమ్ములన్
దొంతరలై నవాశ్రువులు తొన్క ప్రతీక్షణలో నిశాదివం
బెంతయు వంతతో కినియు నిద్ధమతిన్ ప్రియురాలి గూర్చి ప
ల్కింతును రుద్రవీణపయి ఈ హిత సాంత్వన గేయమాలికల్ (మూర్ఛన. 2: రుద్రవీణ)

దొంతరలైన మబ్బులకు త్రోవలు చూపెడి మించుకాగడా
చెంత మనోజ్ఞ కావ్యము రచించు కవిన్ ననుజూచి భావనా
సంతతి నాగసర్పముల చాడ్పున వచ్చి నటించుచుండ వా
యింతును రుద్రవీణ; నటియింతును పశ్చిమ దిక్తటమ్ములన్ (మూర్ఛన. 1: రుద్రవీణ)

కుంకుమ చిల్కరింతునిదిగో! పరిగర్జిత మేఘ మాలికా
పంకిల రోదసీ కుహరభాగ దివంధ భయంకరార్భటీ
సంకుల కాళరాత్రి తెరజారిన నాటన శాలవంటి ప్రా
గంకమునన్ మదీయ ఘుసృణారుణ హస్త తలద్వయమ్మునన్ (మంగళగీతి 2: రుద్రవీణ)

ఇంకొన్ని, వచ్చే టపాలో..

ఎప్పటిలాగే, అచ్చు తప్పులూ, పాదాలను సరిగా విభజించకపోవడమూ మీకు కనిపించవచ్చు, నా దృష్టికి తీసుకువస్తే మార్పులు చేస్తాను.

Tags:

వ్యాఖ్యానించండి

Loading