చతుర్విధ కందము

Thursday, October 22, 2009
By పద్యం.నెట్
ఒకే కందపద్యాన్ని వివిధ రీతుల్లో విభజించి అర్థం భంగం కలగకుండా మరికొన్ని కంద పద్యాలను రాసే ప్రక్రియను ’చతుర్విధ కందము’ అంటారట. క్రింది రచన అలాంటిదే -

ఓద్వేటి వెంకట కృష్ణయ్య అనే కవి, అప్పటి గద్వాల ప్రభువు సీతారామభూపాలుడు గురించి రాసిన క్రింది చతుర్విధ కందం చూడండి.

సురరాజ విభవ లక్షణ
భరితావనజాస్త్ర రూప వర కవి వినుతా
హరిభక్తి యుక్త విలసత్
కరుణాదినకర సుతేజ గద్వాల నృపా!

వనజాస్త్ర రూప వరకవి
వినుతా హరిభక్తి యుక్త విలసత్కరుణా
దినకర సుతేజ గద్వా
లనృపా సురరాజ విభవలక్షణ భరితా!

హరిభక్తి యుక్త విలస
త్కరుణా దినకర సుతేజ గద్వాలనృపా!
సురరాజ విభవ లక్షణ
భరితా వనజాస్త్ర రూప వరవి వినుతా!

దినకర సుతేజ గద్వా
లనృపా సురరాజ విభవలక్షణ భరితా
వనజాస్త్ర రూప వరకవి
వినుతా హరిభక్తి యుక్త విలసత్కరుణా!

చాలా బాగుంది కదూ!! మరి మీలో ఎవరికైనా వేరే చతుర్విధ కందాలుతెలిసి ఉంటే ఇక్కడ వ్యాఖ్యగా పెట్టగలరు.లేదా మీరే సొంతంగా ప్రయత్నించనూవచ్చు :)

Tags:

8 వ్యాఖ్యలు to “చతుర్విధ కందము”

  1. పద్యం.నెట్

    Sharada –

    చెలుడా చెంతకు చేరగ
    అలుకా? కాంతను,వలచితి పలుకవ కనవా!
    వలపున్ కాంతులు మెరిసెను
    ఇలలో వింతగ మురిపెపు విరులవి విరియన్.

    చెంతకు చేరగ అలుకా?
    కాంతను,వలచితి పలుకవ కనవా వలపున్
    కాంతులు మెరిసెను ఇలలో
    వింతగ మురిపెపు విరులవి విరియన్ చెలుడా!

    వలపున్ కాంతులు మెరిసెను
    ఇలలో వింతగ మురిపెపు విరులవి విరియన్
    చెలుడా చెంతకు చేరగ
    అలుకా? కాంతను,వలచితి పలుకవ కనవా!

    కాంతులు మెరిసెను ఇలలో
    వింతగ మురిపెపు విరులవి విరియన్ చెలుడా!
    చెంతకు చేరగ అలుకా?
    కాంతను,వలచితి పలుకవ కనవా వలపున్

    #25
  2. పద్యం.నెట్

    జిగురు సత్యనారాయణ

    తరుణీ! పరువపు వలపుల
    భరణీ! సుదతీ! ఘనకుచభరధర ముదితా!
    వరమంద గమన మోహన
    భరితా! సదమల సురుచిర వారిజ వదనా!

    సుదతీ! ఘనకుచభరధర
    ముదితా! వరమంద గమన మోహన భరితా!
    సదమల సురుచిర వారిజ
    వదనా!తరుణీ! పరువపు వలపుల భరణీ!

    వరమంద గమన మోహన
    భరితా! సదమల సురుచిర వారిజ వదనా!
    తరుణీ! పరువపు వలపుల
    భరణీ! సుదతీ! ఘనకుచభరధర ముదితా!

    సదమల సురుచిర వారిజ
    వదనా!తరుణీ! పరువపు వలపుల భరణీ!
    సుదతీ! ఘనకుచభరధర
    ముదితా! వరమంద గమన మోహన భరితా!

    #26
  3. పద్యం.నెట్

    సనత్ కుమార్

    పరునిన్! మునిజన మానస
    హరునిన్ ! కనుగొంటి ననఘు, హృదయవికాసున్ !
    గురునిన్ ! అనితర శ్రేయ
    స్కరునిన్ ! ఇనవంశ తిలకు, ఘనరిపు భీమున్ !!

    మునిజన మానస హరునిన్ !
    కనుగొంటి ననఘు హృదయవి కాసున్ ! గురునిన్ !
    అనితర శ్రేయ స్కరునిన్ !
    ఇనవంశ తిలకు, ఘనరిపు భీమున్ ! పరునిన్!!

    గురునిన్ ! అనితర శ్రేయ
    స్కరునిన్ ! ఇనవంశ తిలకు, ఘనరిపు భీమున్ !
    పరునిన్! మునిజన మానస
    హరునిన్ ! కనుగొంటి ననఘు, హృదయవికాసున్ !!

    అనితర శ్రేయ స్కరునిన్ !
    ఇనవంశ తిలకు, ఘనరిపు భీమున్ ! పరునిన్!
    మునిజన మానస హరునిన్ !
    కనుగొంటి ననఘు హృదయవి కాసున్ ! గురునిన్ !!

    స్ఫూర్తి:
    పోతన భాగవతం లో ‘అనఘు సత్యు పరుని అనుదినంబు ‘ అన్న పద్యం నుండీ పొందినది.

    #27
  4. పద్యం.నెట్

    జిగురు సత్యనారాయణ

    షడ్విధ కందము:

    సందర్భము:
    పార్వతీ దేవి తపస్సుకు మెచ్చి శంకరుడు వరమిచ్చిన పిమ్మట పార్వతీ దేవి చెలికత్తెల సంభాషణ.

    శివుడే గిరిజకు మగడగు,
    భవుడే సరసుడు,వలపున పరువపు స్మరుడే,
    ధవుడే హరుడిక, సతతము
    శివుడే మరుడగు గిరజకు చెలిమియమరగా!! 1

    గిరిజకు మగడగు భవుడే,
    సరసుడు వలపున పరువపు స్మరుడే, ధవుడే
    హరుడిక, సతతము శివుడే,
    మరుడగు గిరజకు చెలిమియమరగా శివుడే!! 2

    సరసుడు వలపున పరువపు
    స్మరుడే, ధవుడే హరుడిక, సతతము శివుడే,
    మరుడగు గిరజకు చెలిమియ
    మరగా శివుడే, గిరిజకు మగడగు భవుడే!! 3

    ధవుడే హరుడిక, సతతము
    శివుడే మరుడగు గిరజకు చెలిమియమరగా
    శివుడే గిరిజకు మగడగు,
    భవుడే సరసుడు,వలపున పరువపు స్మరుడే!! 4

    హరుడిక సతతము శివుడే,
    మరుడగు గిరజకు చెలిమియమరగా శివుడే,
    గిరిజకు మగడగు భవుడే,
    సరసుడు వలపున పరువపు స్మరుడే ధవుడే!! 5

    మరుడగు గిరజకు చెలిమియ
    మరగా శివుడే, గిరిజకు మగడగు భవుడే,
    సరసుడు వలపున పరువపు
    స్మరుడే, ధవుడే హరుడిక, సతతము శివుడే!! 6

    (యతి ప్రాసల కోసం ప్రాకులాడటమే సరి పోయింది. అయినా పునరుక్తి తప్ప లేదు)

    #28
  5. పద్యం.నెట్

    సనత్ కుమార్

    సత్యనారాయణ గారూ ! బాగుంది. షడ్విధ కందం ఉంటుందని తెలీదు. మీ పద్యం చూడగానే ఈ క్రింది పద్యం స్ఫురించింది, తప్పో, ఒప్పో కానీ ఎదో నచ్చినట్టు అనిపించి వెంటనే రాసేస్తున్నా..(తెలివిగా/ సులువుగా ఇట్లా రాసేసి చతుర్విధ కందం అని పిలిచెయ్యచ్చా?)

    భజరే ! జగదభి రామం !
    భజరే ! ఖగరాజ వినుత ! ప్రణవ ప్రకాశం !
    భజరే ! సుగుణ నిధామం !
    భజరే ! రఘువంశ తిలక మధురస లాస్యం !

    జగదభి రామం భజరే !
    ఖగరాజ వినుత ప్రణవ ప్రకాశం భజరే !
    సుగుణ నిధామం భజరే !
    రఘువంశ తిలక మధురస లాస్యం భజరే !

    భజరే ! సుగుణ నిధామం
    భజరే ! రఘువంశ తిలక మధురస లాస్యం
    భజరే ! జగదభి రామం
    భజరే ! ఖగరాజ వినుత ప్రణవ ప్రకాశం

    సుగుణ నిధామం భజరే !
    రఘువంశ తిలక మధురస లాస్యం భజరే !
    జగదభి రామం భజరే !
    ఖగరాజ వినుత ప్రణవ ప్రకాశం భజరే !

    #29
  6. పద్యం.నెట్

    జిగురు సత్యనారాయణ

    సనత్ కుమార్ గారు,
    నాకు చతుర్విధ కందము గురించే తెలియదు ఇక్కడ చూసేంత వరకు. నాలుగు విధాలుగా వ్రాయగలిగింది ఆరు విధాలుగా ఎందుకు వ్రాయ కూడదని ప్రయత్నించాను. చంధో భంగము కాకుండా వ్రాయగలిగాను కాని అంత సొగసుగా లేదనిపించింది. చతుర్విధ కందమును రెండు వేరు వేరు ప్రాసాక్షరాలతో వ్రాసినట్టు,షడ్ విధ కందాన్ని మూడు వేరు వేరు ప్రాస అక్షరాలతో వ్రాయడము కుదరదు. కందములో గరిష్ఠముగా రెండు ప్రాసలనే చూప గలము.

    మీ పద్యాలు బాగున్నాయి. కాని మీరు ప్రాసను పట్టుకొని యతిని మరిచినట్టున్నార ు. రెండూ పట్టుకుంటే నాలాగ పద్యం ప్రక్క దారి పడుతుందేమో. :-)

    #30
  7. పద్యం.నెట్

    కామేశ్వర రావు

    సత్యనారాయణగారు, సనత్ గారు,

    మీ నైపుణ్యానికి అభివందనాలు. సనత్ గారి పద్యంలో “మధురస” బదులు “వరమృదు” అని మారిస్తే యతికూడా సరిపోతుంది.

    #31
  8. పద్యం.నెట్

    సనత్ కుమార్

    కామేశ్వర రావు గారూ, సత్యనారాయణ గారూ ధన్యవాదాలు.
    కాకపోతే.. యతి కూడ సరిపోయింది అనుకున్నానే?
    (1)
    హరునిన్ – హృదయ
    స్కరునిన్ – ఘనరిపు
    కనుగొంటి – కాసున్ !
    ఇనవంశ – భీమున్ (బహుశా ఇది తన్ని ఉండచ్చు అనుకున్నా. ఇ కలిసింది కానీ భ కలవలేదేమో అని. అంతేనా?)
    (2)
    భజరే – ప్రణవ
    భజరే – మధురస
    ఖగరా – కాశం
    రఘువంశ – లాస్యం

    ‘వరమృదు’ కి ‘మధురస’కి యతి నియమంలో తేడా ఎలా వచ్చింది? ‘వ’, ‘మ’ రెండూ ఒకే యతి మైత్రి లో ఉన్నాయి కదా..

    Ref: padyam.net- ఛందస్సు 101 – మొదటి భాగం :
    8. ప, ఫ, బ, భ, మ, వ

    #32

వ్యాఖ్యానించండి

Loading