రామా! ఆర్త రక్షామణీ!

Thursday, October 22, 2009
By పద్యం.నెట్
రామా! ఆర్త రక్షామణీ! అన్న మకుటం తో కొన్ని పద్యాలు పాత పద్యాల పుస్తకాల్లో అక్కడక్కడా ఉన్నాయి.  చాటు పద్య మణిమంజరి లో నాలుగుపద్యాలున్నాయి. వీటన్నిటినీ ఒకచోటి చేర్చి ఇలా ఇక్కడ ప్రచురిస్తున్నాం.
శరణన్నన్ కరుణింతువన్న బిరుదుల్ జాలంబులే చాలునో
’శరణో’హో యన రావదేమి? వినవో! సంసార తాపత్రయం
బెరుగన్నీయదొ? యెందుకెమొ చెపుమా యీ నిర్దయాబుద్ధి? ఏ
మరితో మున్న విభీషణాదులకు రామా! ఆర్త రక్షామణీ!

పరుగైరాగదె! త్రోవగానవొ! సురల్ ప్రార్థించిరో! సామగా
నరుచిన్ సొక్కితొ! ఆంజనేయుని వడి న్రావించితో! జానకీ
చరణాబ్జంబులు నొచ్చెనో! యితర దేశప్రాణ సంరక్షణో
మరియే? యెందుకు? నింపసేపదెర! రామా! ఆర్త రక్షామణీ!

శరణాన్వారల యాపదల్ పరిహరించన్ రాముడుండంగ యే
వెరపే లంచను పిన్న పెద్దలు ఋషుల్ వేదాంత శాస్త్రంబులన్
పొరయన్నమ్మి విభీషణాది ఘనులన్ పోషించుటల్ సాక్షిగా
మరి నిన్ నమ్మితి కావుమా దయను రామా! ఆర్త రక్షామణీ!

పరులన్ శిష్యుల తల్లిదండ్రుల గురు బ్రహ్మణ్యులన్ సఖ్యులన్
శరణన్వారిని నిన్ను నన్ను సహగా స్వాభావికాల్ వంచనల్
నెరవుల్ గావున నా స్వధర్మమిదిగో నే మానవోత్కృష్టుడన్
మరి  యాపన్న శరణ్య నీ శరణు రామా! ఆర్త రక్షామణీ!

ధరలో తొల్లిటివారు నేను సహగా ధైర్యంబుగా వేడ ము
న్వెరలేరంచును నియ్యవే యభయముల్ నేడేమి వింతాయె నా
శరణార్థిన్ దిగనాడ రాదుగద! ’రా’ సర్వేశ! నీవిచ్చియున్
మరి నవ్వల్దనబోవ కెవ్వరిక రామా! ఆర్తరక్షామణీ!

శరణన్న క్షణమే విభీషణునకా చంద్రార్కమైనట్టి దే
వర లంకాపురి ధారవోసి తనుచున్ వాల్మీకి రామాయణా
ది రహస్యంబులు దెల్పుటల్ నిజములైతే నన్ను రక్షింపుమీ
మరు మాటాడిన యింక యాన సుమి! రామా! ఆర్త రక్షామణీ!

అలనా డార్తిని బిల్వ నా కభయము న్నాకాశవాణీ ధ్వనిన్
పలుకా వాక్య మసత్యమో! నిజమొ! నా భాగ్యంబు దానెట్టిదో!
తెలియన్నేరక విన్నవించితిని నా దేవుండవై బ్రోవు! ని
ర్మల! నీవేగతి కావవే దయను! రామా! ఆర్తరక్షామణీ!

శరణాపన్న శరణ్య! రాదవె హెచ్చౌ నా మనస్తాపమున్
నిరసించెన్ యిది నీకు కట్టడిగదే నీవే గతే యేమిమున్
శరణంబన్న విభీషణాదుల మనస్తాపంబు వారింపవే
మరి నాకెవ్వరు నీవ యా శరణు రామా! ఆర్త రక్షామణీ!

Tags:

వ్యాఖ్యానించండి

Loading