అపూర్వ సాహితీ స్రష్ట – ఆదిభట్ల

Thursday, October 22, 2009
By పద్యం.నెట్

ఈ క్రింది వ్యాసము గత నెల ముప్ఫయి ఒకటో తేదీన శ్రీ ఆదిభట్ల నారాయణదాసు గారి జన్మదిన సందర్భంగా శ్రీమతి బీ. హెచ్. దేవీప్రకాశ్ గారు వ్రాసినది. కారణాంతరాల వలన ఆలస్యంగా ప్రచురిస్తున్నందుకు క్షమాపణల తో – పద్యం.నెట్

ఈ యఖిలమ్మునందుఁబరమేశ్వరుఁ డెట్టులు నిండి యుండెనో
యా యఖిలమ్ము వచ్చి తనయందున నుండెన యాదిభట్టనా
రాయణదాసులో హరికథాకృతి భారతి సర్వశిల్పవి
ద్యాయుత సంస్కృతాంధ్రముల యాకృతియై పెఱమూర్తులైమఱిన్  -శ్రీ విశ్వనాథ సత్యనారాయణ

హరికథా పితామహునిగా శ్రీ ఆదిభట్ల నారాయణదాసు(31.08.1864 — 02.01.1945) లోకానికి సుపరిచితులు.   హరికథకు ఇప్పటి స్వరూపమూ, ప్రజాదరణము ఆయన వలననే చేకూరినవి. హరికథలేకాక,  ఆయన అనేక కళారంగాలలో నిష్ణాతులు. అటు అవధానాలు, ఇటు సంగీత కచేరీలు చేసిన దిట్ట. నిజానికి ఆయన సరస్వతీ సంపూర్ణ అవతారము. సంగీత,సాహిత్య, నాట్యముల త్రివేణీసంగమమునకు దాసుగారు ప్రథమ తీర్థంకరులు.  శ్రీ యస్వీ జోగారావుగారి మాటలలో చెబితే – శ్రీ దాసుగారు సామాన్య మానవులకు మహామహుడు, ధీమాన్యులకు అత్యద్భుత ధిషణా ధూర్వహుడు, హరిదాసులకు హరికథా పితామహుడు, కవులకు మహాకవి, గాయకులకు గాంధర్వ సార్వభౌముడు, నర్తకులకు నందీశ్వరుడు, నటులకు మహానటుడు, భక్తులకు మహాభాగవతుడు, భాషావేత్తలకు బ్రహ్మిష్ఠోబ్రహ్మ, శాస్త్ర విద్వాంసులకక్షపాదుడు, పౌరాణికులకు బాదరాయణుడు, వేదాంతులకు ఆదిశంకరుడు, ధార్మికులకు ధర్మజుడు, వనితలకంటికి వంచిత పంచబాణుడు, కళావతుల పాలిటి కామధేనువు, వదరుబోతులకు వావదూక శిఖామణి,  మితభాషులకు వాచంయమివరేణ్యుడు, నిక్కుబోతులకు నిరంకుశ గంధసింధురము, నాగరికులకు నవఖండమహీమండాలాఖండలుడు, జానపదులకు వట్టి సత్తెకాలపు సత్తెయ్య!!

ఆయన సాహిత్యంలో ఓ రసఝరి, అమృతవాహిని. ఏ పాత్రకైనా ఆయన ఆక్షరామృతం పోయగలరు. సంస్కృతంలోనూ, నాటుతెలుగులోనూ కావ్యాలను వ్రాసిన ఏకైక వ్యక్తి శ్రీ ఆదిభట్ల నారాయణదాసు. ఆయన నలభై ఆరు రచనలు చేశారు.

౧) రామాయణ హరికథలు : యథార్థరామాయణము, జానకీ శపథము
౨) భారత హరికథలు : సావిత్రీ చరిత్రము, భీష్మచరిత్రము
౩) భాగవత హరికథలు :
అ) సంస్కృతము : శ్రీకృష్ణ జననము, పితృబంధవిమోచనము, ధర్మసంస్థాపనము, కాళీయ మర్దనము, కంస వధ
ఆ) తెలుగు : ధ్రువ చరిత్రము, గజేంద్రమోక్షము, అంబరీష చరిత్రము, రుక్మిణీ కల్యాణము, ప్రహ్లాద చరిత్రము.
౪) పురాణ హరికథలు : హరిశ్చంద్రోపాఖ్యానము, గౌరప్ప పెండ్లి, మార్కండేయ చరిత్ర (భాగవత కథ కాదు)
౫) అనువాద గ్రంథాలు :
అ) నవరసతరంగిణి : కాళిదాసు, షేక్స్‍పియర్ మహాకవుల గ్రంథములలోని కొన్ని ఘట్టములను నవరసములుగా విభజించి అనువదించి తారతమ్యమును తెలియజేయు గ్రంథం.
ఆ) ఉమరుఖయ్యాము : మూలమైన పారశీకమునకు, ఫిట్చ్ గెరల్డ్ అనువాదమునకు,

సంస్కృత దేశ్యాంధ్రములయందు రచింపబడిన పద్యగేయ రూపకమైన ద్వివిధానువాదము

ఇ) విష్ణు సహస్ర నామములు – వెన్నుని వేయి పేర్ల వినకరి (తెలుగు పద్యములు)
ఈ) లలితా సహస్రనామముల పరమార్థప్రకాశిక – తల్లివిన్కి (తెలుగు పద్యములు)
ఉ) భగవద్గీత (వేల్పుమాట)
ఊ) నూరుగంటి : ఈసఫ్స్ ఫేబుల్స్ వచనరూపము, కథాంతసారమునకు  గీతపద్యములు.
ఋ) ఋక్సంగ్రహము (మ్రొక్కుబడి) : మూడువందల ఋక్కులకు లయబద్ధముగా  అనువదించిన గ్రంథం.
౬) శతకములు :
అ) సంస్కృతము : కాశీ శతకము, రామచంద్ర శతకము
ఆ) తెలుగు : సూర్యనారాయణ శతకము, శివ శతకము, ముకుంద శతకము, సత్యవ్రత శతకము
ఇ) నాటు తెలుగు : వేల్పు వంద
౭) వేదాంత గ్రంథములు : జగజ్జ్యోతి లేక అష్టాదశ విద్యాప్రకాశిక ( వచనగ్రంథము), చాతుర్వర్గ్యసాధనము
౮) నిఘంటువు : సీమ పల్కు వహి (దేశ్యాంధ్ర నిఘంటువు-కొంతభాగం మాత్రమే ముద్రితము)
౯) ప్రబంధములు – రూపకములు
అ) బాటసారి (వేదాంత సంబంధమైన గూడార్థ ప్రబంధము)
ఆ) తారకము (సంస్కృతము)
ఇ) సారంగధరనాటకము
ఈ) దంభపుర ప్రహసనము
ఉ) మేలుబంతి ( చాటు ప్రబంధము)
౧౦) ఇతర గ్రంథములు :
అ) నాయెరుక (స్వీయ చరిత్ర)
ఆ) మన్కి మిన్కు (ఆయుర్వేదము)
ఇ) అచ్చతెనుగు పల్కుబడి

ఆదిభట్ల శతక సోయగం

భక్తికెరటం

ఆయన తెలుగు శతకాలలో 1895-98 మధ్యకాలంలో రచించిన శ్రీ సూర్యనారాయణ శతకం మొదటిది. నూటొక్క మత్తేభ, శార్దూల వృత్తాలతో ‘సూర్యనారాయణ’ అనే మకుటంలో ఈ శతకం సాగుతుంది. భక్తిలేనప్పుడు జడుడైన, శాస్త్ర చణుడైన ఒకటే. గ్రుడ్డికన్ను తెరచినా మూసినా ఒకటేయైనట్లు వ్యర్థమేనంటారు. రసిక జనుల రసనలకు పరమాప్తమైనది ఈ సూర్యనారాయణ శతకము.

‘ఇమ్మాడ్కిన్భవదీయ నామసుధఁ గ్రోలింపన్సదా తుచ్ఛ భో-
గమ్ముంజిత్తము గోరు, మోదకము వేడ్కన్మేప శ్వానంబఖా
దమ్ముం దబ్బునమెక్క నేగు నటులిద్ధాత్రిన్ భళీ! నైజ ధ
ర్మమ్మున్మానుపనేరి శక్యము మహాత్మా సూర్య నారాయణా!’

చెప్పుతినెడి కుక్క చెరుకు తీపెరుగునా అన్నట్లు లడ్డూలను పెట్టినా కుక్క అశుద్ధమునే కోరుకుంటుందిట. భగవన్నామాన్నిగాక తుచ్ఛమైన భోగాలను కోరుకునే  మనసు కూడా అటువంటిదేనంటున్నారు.

మృత్యువుని జయించిన శతకం

ప్రాణాపాయ స్థితిలో ఉన్న సోదరుని బ్రతికించమని ప్రార్థన పూర్వకంగా రచించిన శతకం ‘మృత్యుంజయ శివ శతకం’. శివా అనే మకుటంతో కందంలో అందంగా సాగుతుంది. ఇది నిజంగా మృత్యుంజయమే. ఆయన నమ్మకమో, దైవసంకల్పమో కాని వైద్యులకు కూడా లొంగక, ఆశ వదులుకున్న ఆయన అన్నయ్య పేరన్నకు ఈ శతకంతో ఆయుష్షు పోసింది.

నిక్కము నీ వీశుండవు
దిక్కుగలిగి వేఁడుకొంటి దీనుండను నా
ప్రక్కందో డలరించుము
మ్రొక్కెద నాకోర్కె దీర్చుమో సాంబశివా!

ముకుంద శతకం

కుంద ప్రసూన గుచ్ఛము వలె గుబాళించు శతకం ముకుంద శతకం. ‘నారాయణ! కందళితానంద మూల కందముకుందా!’ అను ఒకటిన్నర పాదమకుటం తో సాగినదీ శతకము.  మదికి విందుగ, రోగాలకు మందుగా భక్తిని భావించి అందరూ తరించడానికే ఈ శతకం.

‘మందర ధర రారా! శ్రిత
మందారా రార! పాప మర్దన రా! గో
విందా రా! నారాయణ
కందళితానంద మూలకంద ముకుందా!’

అన్న పద్యంలో దాసుగారు బాలగోపాలుని వెదికే యశోద లా భాసిస్తారు.
‘అందియు నందని యటున
న్నెందుకు మోసంబు జేసె దీశ్వర సరిగా
ముందగపడు…’

అంటూ ఆర్తిగా అర్థిస్తారు. పరమభాగవతమీ శతకంలో సాక్షాత్కరిస్తుంది. దీనిని భగవదంకితం చేసి ఆయన పొందిన ఆనందానికి మేరలేదు.

సత్యవ్రత శతకం

అద్వితీయ దాస ప్రతిభా వైదుష్యాలకు నిదర్శనం ‘సత్యవ్రత’ శతకం. ఒక సమస్యను నూరువిధాలుగా ఏక కాలంలో పూరించిన సామర్థ్యం ఒక్క నారాయణదాసుగారికే ఉంది. అనితర సాధ్యమైన ప్రతిభకు ప్రత్యక్షర సాక్షం ‘సత్యవ్రత శతకం’. సతతము సంతస  మెసంగు సత్యవ్రతికిన్!’ అనే సమస్యను నూరు విధములుగా పూరించి మెప్పు వడసిన  మహా కవి దాసుగారు.

‘ బ్రతుకున సుంకంబెఱుఁగక
స్వతంత్రరాజ్యంబు సేయు ప్రభువువలె బతి
వ్రతవలె సహజకవి వలెన్
సతతము సంతసమెసంగు సత్యవ్రతికిన్!’

వేల్పు వంద

‘తొలి చదువులె నిను దెలియక మళ్లిన నానాటు మాటలను నినున్జాట దరము’ అంటూ అచ్చతెనుగున దాసుగారు రచించిన శతకం ‘వేల్పు వంద’. దీనిలో ప్రసరించిన వన్ని తెలుగు వెలుగులే. బాస-తెలుగు సీమ పలుకు, వేల్పు – తెనుగు నేలపై  మొలిచిన అప్పలసామి, ఛందము – తెలుగు కలాలు మూసపోసిన సీసము. ఇంక కవి అంటారా తెలుగు పుడమిన పొడమిన వెలుగు రేడు!   ఈ శతకం మకుటం ‘రెంట త్రాగుడు తిండి మెట్టంటు వేల్ప’. రెంట త్రాగుడు అనగా  ఏనుగు. రెంట త్రాగుడు తిండి అనగా సింహము. మెట్టు అంటే అచలము (కొండ). అంటు వేల్పు అనగా అక్కడ ఉన్న స్వామి. సింహాచలమున ఉన్న దైవం అప్పల నరసింహుడు. ఈ అచ్చతెనుగు శతకంలో వంద పద్యములకు అర్థము చెప్పిన వానికి తెలుగులో లోటు ఉండదు. దీనిలో ప్రతీ పద్యం రస గుళికలే.

ఓటిల్లు చిందర బోటిరాళ్ళుప్పట్లు
కుందెనగిరి యిఱ్కి కుందికాళ్ళు
గూవనాలాలంకి గుడుగుడుగుంచము
లల్లి గదెనబొద్దు తాళ్ళపాము
కాలికంచము కిఱ్ఱుగానుగునెట్టులు
గొబ్బిళ్లు చిడుగుడు గుళ్లు చెండు
చిక్కనాబిల్లలు చీఁకటిమొటికిళ్ళు
పుడికిళ్ళు పులియాట బోర్లపక్క

జిరుకురాతిదాబాటలు, చిఱ్ఱుబుఱ్ఱు
వ్రేలుబొట్టన చుండ్రాళ్ళు వెన్నెలకడి
దొట్టియందలముల నాకుఁ దోడయితివి
రెంటత్రాగుడు తిండి మెట్టంటువేల్ప!

ఈ ఇరువది తొమ్మిది బాలుర ఆటలయందు దాసుగారికి శ్రీ నృసింహుడు తోడయ్యెనట.  ఏమిభాగ్యం!

శ్రీ దువ్వూరి వెంకట రమణశాస్త్రిగారు అన్నట్లు, అసామాన్య ప్రతిభ, అనేక భాషల పాండిత్యము, అనేక శాస్త్ర పరిచయము, కవితారచనా చాతుర్యము, లలితగాన ప్రావీణ్యము, సముచిత వక్తృత్వ కౌశలము, అసాధారణ కల్పనా నైపుణ్యము, అఖిల జనాకర్షణ సామర్థ్యము, మున్నగు అనేక విశిష్ట శక్తుల సమ్మేళన సామరస్యము గల యిట్టి హరిదాసు మన దేశముననే కాదు, ఏ దేశమునను – నభూతో నభవిష్యతి

ఆగష్టు ముప్ఫైయ్యొకటిన శ్రీ ఆదిభట్ల నారాయణదాసుగారి జన్మదిన సందర్భంగా  ఆయనకిది నివాళి.

ఈ వ్యాసంలోని వివరాలకు ‘శ్రీ ఆదిభట్ల నారాయణదాస సారస్వత నీరాజనం’, ‘నారాయణదాస పంచశతి’, ‘విజయనగరం జిల్లా చరిత్ర-సంస్కృతి’ అను గ్రంథముల ఆధారము.

‘సుద్దులు గరపితివౌరా!
ముద్దుగ నీ నాటు మాట ముచ్చట గొలుపన్
అద్దిర మేటివి గదరా
పద్దెపు గొండీల నిడుము పాటల పెద్దా!

– బి. హెచ్. దేవీప్రకాష్

Tags:

4 వ్యాఖ్యలు to “అపూర్వ సాహితీ స్రష్ట – ఆదిభట్ల”

  1. Manohar

    Is it possible to get these books now(hard or soft) please let me know if they are available…

    Is there any audio sort of things avaialble online or offline, I am trying for information on him from very long time…

    thanks

    #33
  2. పద్యం.నెట్

    మనోహర్ గారు,

    మేము కూడా ప్రయత్నిస్తున్నాం, దొరగ్గానే తెలియజేస్తాం. విజయవాడ లెనిన్ సెంటర్లో పాత పుస్తకాల కోట్లున్నాయి, అక్కడ దొరకచ్చు.

    పద్యం.నెట్

    #34
  3. [...] శ్రీ ఆదిభట్ల నారాయణ దాసు గారు రచించిన “సూర్యనారాయణ శతకము” నుంచి కొన్ని పద్యాలు. [...]

    #35
  4. శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ

    చక్కటి వివరాలు అందజేసిన వ్యాసం.

    #36

వ్యాఖ్యానించండి

Loading