మృత్యుంజయా!
శ్రీ మాధవపెద్ది బుచ్చిసుందరరామ శాస్త్రి గారు వ్రాసిన మృత్యుంజయ శతకము నుండి కొన్ని పద్యములు (కావ్యమాల పుస్తకములోనివి)
మెడనాగన్నకు నొక్కటే బుసబుసల్, మేనన్ సగంబైన యా
బిడతో నీ కెపు డొక్కటే గుసగుసల్, వీక్షించి మీచంద మె
క్కడ లేనంతగ నెత్తిపై రుసరుసల్ గంగమ్మకున్, నీ చెవిం
బడుటేలాగునొ మామొఱల్ తెలియదప్పా మాకు మృత్యుంజయా!
ముద్దుంజేయుచు ముచ్చటాడుకొనుచున్ మూపందునన్ మోయుచున్
సుద్దుల్సెప్పుచు జెప్పినన్ వినుచు నిన్ జొక్కించుచుం జొక్కుచున్
పెద్దంజేయ మనస్కరింపదు నినున్, బిడ్డంబలెం జూచుచున్
బ్రొద్దుల్పుచ్చుట లున్న జాలు నితరంబుల్గోర మృత్యుంజయా!
ఇగ నే నొక్క కణమ్ము ముట్టనుసుమీ యీ వల్ల కైలాసముం
దిగి, నా యింటికివచ్చి, నా యెదుట దండ్రింబోలె గన్పించి, త
ల్లిగ నన్నుం దినిపించి, నా పలుకు జెల్లింపన్ వలెన్; గోరుకోం
ద్రు గదా బిడ్డలచే బరాజయము తండ్రుల్ దేవ, మృత్యుంజయా!
చూడంజూడ మహా శ్మశాన మనిపించున్ నాకు నీలోక మిం
దేడన్ గాలిడబోవ నేరిపయినో యే వేయుచున్నట్టులే
లో డక్కయ్యెడిగాని నీమహిమ యాలోనే నివారించి, నీ
క్రీడారంగ మటన్న మాట స్మృతికిం గీలించు మృత్యుంజయా!
నాలో గొన్ని దినాలనుండి యెవడో నాగస్వరం బూదుచున్
మూలాధారమునే కదల్చెడిని, తన్మూలమ్మునం జేసి కా
బోలున్ శ్వాసయె యాడగా దొడగు నెప్డున్ దేవతా సర్పమై
పోలం జూడగ నీవె యిందుకు గతంబోయేమొ మృత్యుంజయా!
నీనామమ్ము జపమ్మొనర్చినకొలందిన్ విశ్వగానమ్ముగా
నానాటం బరిణామమంది యటుపైనన్ బ్రహ్మగానమ్ముగా
రానున్ రాను ధ్వనించి లోన నిపు డుఱ్ఱట్లూగు, నింకెందునన్
లీనంబౌటకొ! తృప్తి యాత్మ కెటులున్ లేదయ్య, మృత్యుంజయా!
ఎల్లన్ నీవయిపోయి, నీవు తలపై ఏ చిన్నిపువ్వట్లొ జా
బిల్లిం దాలిచియుండ, వెన్నెలలుగా విశ్వాన నీకాంతులే
వెల్లింగొల్పెడునట్టులున్న యవి, యీ వేళా విశేషమ్ముచే
వెళ్ళంబుచ్చకు మింక దీని మనసే వేఱయ్యె మృత్యుంజయా!
లోకమ్మందునగాక వెన్నెలలు లోలో గాయునట్లుండె, న
య్యాకాశమ్మున నున్న జాబిలియు, నాయందున్న డెందమ్ము ని
ట్లేకాకారత నొంద నేమి కతమో! యీ యాత్మ సంబంధమున్
నీ కారుణ్యముచేత నేర్పడుటగానే తోచు మృత్యుంజయా!
నావంబోలి ప్రయాణమైనది మహానందప్రవాహమ్ములో
భావంబెచ్చటికో, కనుల్పగిలిపోవంజొచ్చు ధావళ్యమే!
లావణ్యంబతి గణ్యమే! యెటులు కైలాసమ్మొకో బొందినే!
కైవల్యంబొకొ జీవముండగనె! నిక్కమ్మొక్కొ మృత్యుంజయా!
ఏరో వెన్నెల చీకటుల్ గలసినట్లీ పర్వతాగ్రాన ను
న్నారే! యొక్కరిలోన నింకొకరు లీనంబౌచు నున్నట్టులన్
వేఱౌచున్నటు కానుపించెదరె! కానీ, వారికే వారు ప
ట్టీరే! యాదిపురాణదంపతులు కారే వారు! మృత్యుంజయా!
గమనిక: ఈ టపా వాస్తవానికి చందస్సు యాహూ గ్రూపులో భైరవభట్ల కామేశ్వరరావు గారు రాసినది. వారి అనుమతితో యూనీకోడీకరించి ఇక్కడ ఉంచుతున్నాం
