భక్త చింతామణీ!

Wednesday, October 21, 2009
By పద్యం.నెట్

ఆధునిక సాహిత్యంలో పద్య కవిత్వంఅంటే సాధారణంగా ఏ ఇద్దరో ముగ్గురో గుర్తుకు వస్తారు, ఒక విశ్వనాథ, ఒక జాషువా, ఒక కృష్ణశాస్త్రి.కానీ, ఆధునికకాలంలో కూడా పద్య కవిత్వాన్ని సుసంపన్నం చేసిన యెందరో కవులను (బహుశా మా తరానికి తెలియని వారు) గూర్చి తెలుసుకునే భాగ్యం “కావ్య మాల” ద్వారా నాకు కలిగింది. అందూలో నాకు నచ్చిన మరో మంచి ముత్యం “భక్త చింతామణి”. దీని కవి వడ్డాది సుబ్బారాయుడు. ఇతనిది గోదావరీ మండలం. కాలం 1854-1938. కాలేజీలో చిరకాలం ఆంధ్రభాషాధ్యాపకులు. ప్రబోధ చంద్రోదయము, వేణీసమ్హారము, శాకుంతలము, మల్లికా మారుతము, విక్రమోర్వశీయము మొదలైన నాటకాలను తెనిగించారు.

భక్త చింతామణి, సూక్తి వస్తు ప్రకాశిక మున్నగు కృతులు రచించారు. వీరి చాటువులు వసురాయ చాటూక్తి ముక్తావళి అన్న పేర ప్రకటితములు. వీరి భక్త చింతామణి నుండి కొన్ని పద్యాలు.

భక్త చింతామణి

జననీ గర్భములోన నుండగ విదేశంబేగి, పెక్కేండ్లకున్
జనుదే దండ్రినిగాంచు బిడ్డవలె నీసంబంధమున్ ముందు నే
గన కీ వేళ నెఱింగి, స్నేహ భయ శంకాముత్త్రపాశ్చర్య భా
జనమై నిల్చితి జేరదీసికొనవే సద్భక్త చింతామణీ!

క్షేత్రస్వామిని జూడ కుబ్బి పశువుల్ చేన్మేయ బడ్డట్లు మా
నేత్రాదీంద్రియముల్ దురాశలను దుర్నీతిం బ్రవర్తించు, వి
శ్వత్రాణుం బరాణు రూపు నిను గాంచన్ లేక నిర్దోష చా
రిత్రా! నన్ జెఱబెట్టకే కరుణ దండ్రీ! భక్త చింతామణీ!

పిన్నం గారడివాడు వింతగ మహావేణ్వగ్ర మెక్కించు లా
గెన్నన్ మానవ జన్మ ముత్తమము నన్నెతించి తీ వజ్ఞు; న
న్నన్నా! హాని కరంబు సుమ్మిది మహాత్మా! కాచి యెట్లుండెదో
నిన్నే నమ్ముక యున్నవాడ జుమి తండ్రీ! భక్త చింతామణీ!

అన్నంబం, దుదకంబు నందు, గృహశయ్యాయానపీఠంబులం
దు,న్నానావిధ లీలలన్, దఖిలమందున్ మృత్యువే తోచు నో
యన్నా! మాకు నిమేషముం బ్రదుక శక్యంబే స్వశక్తిన్ భువిన్
నన్నీవే బ్రతికింతు రేవగ లనంతా! భక్త చింతామణీ!

గూటం బిచ్చుకకందు వెల్లపు డనుంగున్ దల్లి ధ్యానించుచున్
ద్రోటిన్ విచ్చున దేమి తెచ్చినను సంతోషంబు విశ్వాసమున్
వాటిల్లంగను; నట్లు నీ యెడల మద్భావంబు గావింప ని
ష్కౌటిల్యాత్మత గొల్తు నిన్నుదయ మీశా! భక్త చింతామణీ!

ఎరకుం బిల్లల దల్లికోడివలె మమ్మెందే బగల్ ద్రిప్పు దీ
శ్వర! మేలోర్వక మాయ గ్రద్ద యెడబాపంజూచెడిన్మమ్ము ద
త్ఖర పాదాహతి సోకకుండ నను ఱెక్కల్ గ్రప్పి కాపాడ నీ
చరణ ద్వంద్వము నాశ్రయింతును సదా సద్భక్త చింతామణీ!

పరదేశంబున కేగుచున్ జనుడు యావద్వస్తు సామగ్రియున్
బరమ స్నేహితు జేతికిచ్చి చను విశ్వాసంబుచే నట్లు ని
ద్దురవో నుండిన నేను నా తెలివియున్ స్థూలంబు సూక్షంబు నీ
కరమందుంచితి జింతలేదు మదికింకన్ భక్త చింతామణీ!

తెలివిన్ వీనిని వాడుకొమ్మనుచు ప్రీతిన్నీవు నాకిచ్చు వ
స్తులనే నిద్దురవోవుచున్ మరల నిచ్చో నీకు నర్పించితిన్
వెల హెచ్చైనవి పాడుచేసితని వానిన్ నీవె కైకొందొ? వ
త్సలతన్ వెండియు బాగుచేసి యిడుదో సద్భక్త చింతామణీ!

బడలెన్ మే, నఖలేంద్రియంబు లలసెన్, బ్రాణంబు లాయాసముం
బడె గొండంతలు బర్వులై నిలక ఱెప్పల్ వాలెడున్ రేణువుల్
పడినట్లౌ గనులున్ జగంబు మఱచున్ స్వాంతంబు వాకుల్ తడం
బడెడున్ బూనెడు నిద్ర నన్ శరణు దేవా భక్త చింతామణీ!

నాలో నాకె మహాద్భుతంబగు జగన్నాథా! త్వదీయక్రియల్
నేలన్ నూతన సూక్ష్మ బీజము వలెన్ నీ వూహ నాయందు నుం
తేలాగౌనది ముందెఱుంగ నది యట్టే నీ కృపం బద్యమై
వ్రాలున్ జక్కని పూలమొక్కవలె దేవా! భక్త చింతామణీ!

గమనిక: ఈ టపా వాస్తవానికి చందస్సు యాహూ గ్రూపులో భైరవభట్ల కామేశ్వరరావు గారు రాసినది. వారి అనుమతితో యూనీకోడీకరించి ఇక్కడ ఉంచుతున్నాం

వ్యాఖ్యానించండి

Loading