’సూర్యనారాయణ శతకము’ నుంచి కొన్ని పద్యాలు
శ్రీ ఆదిభట్ల నారాయణ దాసు గారు రచించిన “సూర్యనారాయణ శతకము” నుంచి కొన్ని పద్యాలు.
అరయంగా సకల శ్రుతి స్మృతి పురాణాద్యర్థసారంబుఁ బ
ల్మరు నాశక్తి కొలందిఁ జూచి తుదకిమ్మై రూఢిఁ గైకొంటి సం
సరణాంబోధిఁ దరింపఁజేయుటకు యుష్మద్భక్తి దక్కన్య మీ
నరలోకంబున లేదుపాయమని యన్నా సూర్యనారాయణా!’
ఉదయాద్రి న్నినుఁ జూచినంత వెరనెంతో పారు చీఁకట్లు వెం
టఁ దగుల్నీ ప్రభకోడి వానిదగు కూనల్పాదుల న్నీడలై
యొదుగన్వానిని రేయి తల్లి కడ కోహో తూర్పునంబంపు నీ
దుదయ న్నా తరమా గణింప గుణ సింధూ సూర్యనారాయణా!
తొలి రంగెద్దియులేని నీ కిరణ సందోహంబు వాశ్శీకరం
బుల నానావిధ వర్ణ యుక్తమగు, నప్పోల్కి న్నిరాకార ని
ర్మల నిర్లేపిత నిత్య కేవల పరబ్రహ్మంబు నీవయ్యు ని
మ్ముల మాయం బలురూపులం జెలఁగె దబ్బో సూర్యనారాయణా!
నలుసైనం భువిలోనఁ జూపి పరిమాణంబెతయో కల్గు చు
క్కలకుం జాటొనరించి, భూమి జలమింకంజేసి ధారాధరం
బుల మింటగలిగించి శూన్యమునకుం బొల్మేర గల్పించురా
యెలమిన్నీకర కౌశలం బహహ మాయీ సూర్యనారాయణా!
ఒకచో మందత యొక్కచో సమత వేరొక్కంటఁ దీక్ష్ణత్వమిం
కొకచోనన్ని యనుగ్రహమంబుగ సదా యొక్కొక్కచోఁ గల్మియు
న్బ్రకటాభావమదృశ్యదృశ్యగతియున్బ్రాపించు జ్ఞానంబు నీ
యకలంక ద్యుతిమాడ్కినిజ్జగతినయ్యా సూర్యనారాయణా!
కమలాళిన్వికసింప(జేయునెడ శృంగారంబు హాస్యంబు దు
ర్దమమందేహ తమిస్రమారణమునన్రౌద్రాద్భుతోద్వీర సం
క్రమభీభత్సభయానకంబులు లసత్కారుణ్యముందావకీ
న మహాభక్తులయందునస్తగిరి పొంతన్శాంత భావంబు నీ
వమరంచేయుదు నిత్యనిర్గుణుడవై హా సూర్యనారాయణా!
మనసన్దర్పణ మందుమాత్రమె తలంపన్జూడవచ్చున్జగం
బును బల్మాఱు సుషుప్తి దాని వెనువైపుంబోలి శూన్యాకృతి
న్గనపర్చున్మఱి దృశ్యమిద్ది మృగతృష్ణావైఖరిన్మాయయౌ
ననఘానీవె సమస్తసాక్షివి మహాత్మా సూర్యనారాయణా!
అలరంగా జగమెల్ల వెఱ్ఱియెకదా యావెఱ్ఱికిన్వేవిధా
లిలలో నెవ్వని పిచ్చి వానికి ముదంబెంతేని యున్మాదము
జ్జ్వలమైనంగడు హానిసల్పు మఱిశాంతంబైన నీధ్యానము
న్లలి లోకోపకృతింబొనర్చు నిజమన్నా సూర్యనారాయణా!
త్వద్దివ్యాంఘ్రిసరోజ భక్తియడఁ దప్పన్సర్వ వేదంబుల
న్ముద్దల్నూఱిగ్రసించినం జనుఁడు తన్నుఁదానెఱుంగండహా
యద్దంబందునఁ దక్కగన్నుఁగవ స్వీయాకారముంజూచు టె
ట్లెద్దేసంబుననైన నారయఁగఁ దండ్రీ సూర్యనారాయణా!
ధరణిం జీఁకటివేళ దవ్వు వెలుఁగుందర్శించుకందోయికి
న్మఱియే వస్తువులైనఁ దోఁచనటు నిన్ ధ్యానించునవ్వానిక
ద్దిర యీలోకవికారముల్మది రవంతేనింగనన్రావుగా
యరయంగాఁ దనజీవితంబున మహాత్మా సూర్యనారాయణా!
క్షితియందున్మగవారలెల్లఁ బితలై స్త్రీలెల్లరున్మాతలై
మతిలోఁ దక్కిన భూతసంచయములస్మత్ప్రాణతుల్యంబులై
సతతానందము నాకొసంగ మఱి యుష్మత్పాదసంకీర్తం
బతి నిష్కామతనేనొనర్చుటెపుడయ్యా సూర్యనారాయణా!
తనువున్దెల్వియు వృక్షబీజముల పొంతస్థూలసూక్ష్మక్రమం
బుననన్యోన్యముగారణంబులవుచుంబూర్వాపరావస్థల
న్దనరున్వస్తువిభేదమందకటుగానన్నేను నిత్యుండనై
కొనుచుంటిం బలుజన్మముల్భువనచక్షూ సూర్యనారాయణా!
కట్టా ముర్ఖుఁడఁ దామసుండ దురహంకారుండ నజ్ఞుండనే
నిట్టు ల్చేనునఁ బడ్డ గ్రుడ్డి పశువట్లెద్దాని నాడెంబు గ
న్పెట్టంజాలక దేహయాత్ర గొనుచుంటి న్మోహ శోకంబుల
న్బిట్టల్లాడుచు నెట్లు ప్రోచెదవొ తండ్రీ సూర్యనారాయణా!
