రాధ స్వప్నము: విశ్వనాథ సత్యనారాయణ
(శృంగార వీథి నుంచి…)
ఓ చెలి! రాత్రి నేను గల యొక్కటి గంటిని, దానిలోఁ జిరం
టీచతురాంగజుండు మననెయ్యపుఁబ్రోవు యశోదకన్నవాఁ
డాచరణంబొనర్చె నొక యద్భుత-మస్మదురోజముల్ మృదు
శ్రీచరణాంకితంబులుగ నృత్యముచేసె సకింకిణీధ్వనిన్.
అదియొక మాయగా హృదయమందున స్వామి నటిమ్చుచుండె న
న్నది తెలియంగవచ్చు, నయినన్ బతిరూపము గానుపించ, దా
పదములు కానుపించుఁ, బతిపాదతలంబులు చిల్కముక్కుపూ
లెద వెదజల్లినట్లయి సమృద్ధిగఁ బుల్కలపంట యేర్పడెన్.
నే నిదురించుచుంటినని నేను నెఱుంగుదుఁగాని, మేలుకొ
న్నా నను నొక్క జ్ఞానకలనంబున దీపితమై, విచిత్రరే
ఖానటనాభిరామపదకంజమలన్ గుచసీమ కాంతిపా
ధోనిధి మెట్టతామరలతోడి గిరిద్వయిపోల్కికిం జనెన్.
ప్రణతిపరంబుగా నెదురుబళ్ళుగ వంచిన కాలియాహిచి
క్కని పడగల్ హసించుచనుకట్టున గజ్జెలు మువ్వలున్ గల
స్వనములు పల్కఁగా నటనసల్పెను, గొమ్మలనుండి రాలు వఁ
పున బిగువారు క్రొత్తవిసెపూవులువోనిపదమ్ము లుంచుచున్.
చివురులఁ గొట్టినట్లు పతి చిన్నిపదమ్ము లనుక్షణమ్మునున్
దవులు నురోజమౌళి, ప్రతితాఁకున నూతనమౌ సుఖానుభూ
తి వెలయు, నిట్లుగా నిరవధిన తరగంబడి క్రొత్తరంగగాఁ
గవిసినవాహినింబలె సుఖానుభవం బొకఁ డేచె దీర్ఘమై.
నా కిపు డింత సిగ్గు నగు, నాధుని యా పసికాలు నొచ్చునో
నాక, సుఖానుభూతిబడి నాయెద పుల్కలుగ్రమ్మ జారునీఓ
నాక చెమర్చుఁబో; అసలుకన్నను వాడ్డియె ముద్దటందు, ర
యాకృతి నాధహేతువగు నాసుఖ మాతనికన్న నిష్టమై.
వ్రాలిన నాదుపాదనఖబంధుర దీప్తిఁ గుచద్వయంబు దీ
పాలిడికొన్న దేవళముపై ని విమానములట్లు తోఁచి, సే
వాలహస్తముల్ మొగుడ నాని వెన్క నతత్పయోధరాం
దోళితమూర్తికిన్ మకరతోరణవైఖరి దాల్చె స్వామికిన్.
ఆ లలితంబౌ నడుగు లందము దెచ్చెనొ? ము న్నెఱుంగఁగా
జాలనొ వానియందము? కుచద్వయి స్త్రీతరమైన మోహమై
కేల గదించి కౌఁగిట లగించగ నేనె తలంతు; స్త్రీలయున్
స్త్రీలయుమధ్యగా యని వచించితి వే ఱనుకోకవే చెలీ!
నిదురను మేలుకొంటినని నిశ్చయమైనది, యద్ది స్వప్నమ
న్నది నిజమైన, దింక నయినన్ బులించుటయైన నాయెదన్
గదలుచునున్నయట్లు పసికాళులు తోఁచెడి మేలుకొన్ననా
యెద; యిది మేలుకున్న దనుటే నిజమా, కలయే యిదా చెలీ!
