శ్రీకాకుళపు దిరునాళ్లు, భట్టు నలగామరాజుకు చెప్పిన రాజనీతి – శ్రీనాథుఁడు

Monday, October 26, 2009
By మైత్రేయి

శ్రీకాకుళపు దిరునాళ్లు

జవరాలి బొడగన్న సన్యాసిపై నేయుఁ
దులసి లేఁజిగురాకుదూపు మరుఁడు
వేదవిప్రునిగన్న విధవపై ఝళిపించు
దర్భపల్లవహేతి దర్పకుండు
కటకారకులకన్య గన్న హాలికుమీఁదఁ
బొడుచుఁ బూములుకోల పుష్పశరుఁడు
నాడింధమునిగన్న నాతిపై నేయును
నలరు జిచ్చఱకోల నంగభవుఁడు

బెరసి వెన్నెలగాయంగఁ బేరకమ్మ
పులినతలముల నాయాయి కొలములెఱిఁగి
తాల్చు శస్త్రాస్త్రములు జారదంపతులకు
నసమబాణుండు తిరునాళ్ల నన్నినాళ్ల

భట్టు నలగామరాజుకు చెప్పిన రాజనీతి

మలిదేవభూపతి మన్నించి యిటకు
నన్నుబుత్తంచెను నరనాథ వినుము.
పగ వృద్ధిబొందించు భ్రష్టులెకాని
అడఁగించునేర్పరు లవనిలో లేరు…
పోరు మంచిదికాదు భూమినక్కెడను
పాడౌను దేశంబు పగ మించెనేని
ప్రజలెల్ల నశియంచి పాఱిపోవుదురు
బండారమునకును పైకంబులేదు
రాణువ లందుచే రహి చెడియుండు
చేజీతగాండ్లెల్లఁ జెలఁగి కోపించి
ఈగలజీతంబు లిమ్మందురపుడు
పతిబంటుమేరలు పరిహృతమగును
పంపినపనిచేయ పాలుమాలుదురు
తెలిసినశాత్రవుల్ ధీరతతోడ
భూమినిగొనుటకు బుద్దిపెట్టుదురు
మేకొని మీలోనమీరు పోరాడఁ
జూచెడువారికిఁ జులకనయౌను.
పలువలు మిముఁజేరి పగ జావనీక
చెప్పుచునుందురు చెనఁటివాక్యములు
ఐకమత్యముచెడు, నద్దానితోడఁ
జెడును బలంబును, చెడును భాగ్యంబు
చెడును యశంబులు, చెడును శౌర్యంబు
చెడును రాజ్యంబులు చెడ్డపిమ్మటను
దేశంబు పరనృపాధీనమౌసుమ్ము.
పారతంత్ర్యంబు మీపైఁబడఁగలదు
పరతంత్రజనములపాలి కష్టములు
చెప్పంగ నలవియే శివునకునైన.
పంజరంబుననున్న పక్షులరీతి
బంధించి బుట్టలోఁ బాములవాఁడు
వదలకపెట్టిన ఫణులచందమున
గంగిరెద్దులవాఁడు కావరమణఁచి
ముకుఁద్రాడు పొడిచిన పోటెద్దులట్లు
బోనులోనుంచిన పులులవిధంబు
స్వాతంత్ర్యహీనతఁ బడియుండవలయుఁ
బరికింపఁగా మనోవాక్కాయములను
ప్రథమంబు పట్టగారానిదిగాని
వాక్కాయములు రెండు బంధింపఁబడును.
మనసులోఁబుట్టిన మంచితలంపు
లాచరణమునందు నలవికాకున్న
నన్మఫలంబేమి చచ్చుటే మేలు
అవ్యక్త కీట తిర్యగనేకహీన
యోనులలో నెన్ని యోమార్లు పుట్టి
పడయక పడయక పడసినయట్టి
దుర్లభనరజన్మ దూషితంబగును
పార్థివా! యిటువంటి పారతంత్ర్యంబు
కటకటా పగవారికైనను వలదు.

-పలనాటి వీరచరిత్ర నుంచి

Tags:

ఒక వ్యాఖ్య to “శ్రీకాకుళపు దిరునాళ్లు, భట్టు నలగామరాజుకు చెప్పిన రాజనీతి – శ్రీనాథుఁడు”

  1. Saradhi Motamarri

    Any kind soul can post tatparyam for this dwipada.
    Thanks and regards… Saradhi.

    #38

వ్యాఖ్యానించండి

Loading