ముందుమాట
హృదయాంతర్గత భావనిర్ఝర సముద్రేకమ్ము జీవమ్ముగా
కదలింపన్ కవితాజగత్ పృథుల మార్గానేక సంచారియై
పదముల్ నాలుగు చిత్రచాలనకళా ప్రావీణ్యమున్ బోన్ రసా
స్పదమై తేజియ బోలి క్రాలవలదా పద్యమ్ము హృద్యమ్ముగన్!
పద్య ప్రియులందరికీ స్వాగతం!
ఈ రోజుల్లో పద్యాలనే గుఱ్ఱాలు, మామూలు లోకంలోనే కాదు అంతర్జాల జగత్తులోకూడా హాయిగా, స్వేచ్ఛగా పరుగులు తీస్తున్నాయి! ఈ-పత్రికల్లో పద్యాలకై ప్రత్యేక శీర్షికలు, జాల వేదికపై నిర్వహించబడుతున్న భువనవిజయ సభలు, బ్లాగావరణంలో నానాటికీ పెరుగుతున్న పద్య సంబంధి బ్లాగులు టపాలు – ఇవన్నీ అంతర్జాలంలో పద్యం పట్ల పెరుగుతున్న ఆదరణకి నిదర్శనాలు.
ఇటీవల జరుగుతున్న ఈ పరిణామాలే కాకుండా, పద్యప్రియులు తమకి నచ్చిన పద్యాలని తమ తమ సైట్లలో పెట్టడం ఎప్పటినుంచో జరుగుతూ వస్తోంది. “ఛందస్సు” అనే యాహూ గుంపు కూడా చాలా కాలంగా నడుస్తోంది.
ఈ పరిణామాలన్నిటి దృష్ట్యా, అంతకన్నా ముఖ్యంగా మాకు తెలుగు పద్యమ్మీదున్న మక్కువ కారణంగా – అంతర్జాలంలో తెలుగు పద్య ప్రపంచానికి ముఖ ద్వారంగా, ముఖ్య మార్గంగా ఒక సైటు ఉంటే బావుంటుందన్న ఆలోచన మాకు వచ్చింది. ఆ ఆలోచనకి తొలిరూపమే ఇది.
ఈ సైటు నెలకొల్పడం వెనక ముఖ్యమైన ఉద్దేశాలు ఇవి:
- అంతర్జాలానికి కొత్తగా వచ్చిన పద్యప్రియులకి, ఇక్కడున్న పద్యసంపద గురించి వీలైనంత సమగ్ర సమాచారం అందించడం.
- ఇప్పటికే అంతర్జాలంలో వివిధ రూపాల్లో ఉన్న పద్యసాహిత్యాన్ని యూనీకోడీకరించడం. ప్రస్తుతానికి దీని పరిధి చాలా పరిమితం. అక్కడక్కడా పరచుకుని ఉన్న వివిధ వెబ్ సైట్లలో ఉన్న పద్యాలని, ఆయా ఓనర్ల అనుమతితో, యూనికోడులోకి తర్జుమా చెయ్యడమే ప్రస్తుతానికి మేమనుకుంటున్న పని.
- అంతర్జాలంలో లేని, కాపీరైట్ల సమస్య లేని పద్యసాహిత్యాన్ని యూనీకోడులో ఇక్కడ భద్రపరచడం.
- కొత్తగా పద్యాలు రాసేవాళ్ళకి తగిన సూచనలిచ్చి ప్రోత్సహించడం.
ఈ సైటు పెట్టడం వెనక “మా ఉద్దేశాలు కానివి” ఇవి:
- ఈ సైటుని అంతర్జాలంలోని ఏకైక పద్యసాహిత్య భాండాగారంగా తయారుచెయ్యడం. ఇది సాధ్యమూ కాదు, సమంజసమూ కాదు.
- పద్యాలకి సంబంధించి తెలుగు వికీపీడియాకి ఇది ప్రత్యామ్నాయం కాదు. ముఖ్యంగా, ఛందస్సు గురించిన ప్రాథమిక సమాచారం వికీలో ఉండడమే సమంజసం. అందుకే ఛందస్సు గురించి ఇక్కడ వికీకి లంకెలు మాత్రమే ఇచ్చి, ఆ సమాచారం వికీలోనే ఉంచాలని మా ఆకాంక్ష.
- ఈ సైటు నెలకొల్పడంలో మేమెలాంటి ఆర్థిక ప్రయోజనమూ ఆశించటం లేదు. ఇక్కడ లభ్యమయ్యే సమాచారమంతా “ఉచితమైనదే”.
- ఈ సైటు నెలకొల్పడంలో మేమెలాంటి రాజకీయ ప్రయోజనమూ ఆశించటం లేదు. పద్యం గొప్పదనాన్ని ఒక ఉద్యమంగా ప్రచారం చెయ్యడం కాని, పద్యం ఈనాటికీ బతికుందని నిరూపించడం కాని, తెలుగువాళ్ళందరికీ పద్యం పట్ల ఇష్టాన్ని రేకెత్తించడం కాని వగైరా వగైరా లేవీ మా లక్ష్యాలు కావు. పద్యమంటే మాకున్న అభిమానాన్ని ఈ రకంగా ప్రకటించుకోవడం, తోటి పద్యప్రియులతో కలిసి పద్య తేనెలని ఆస్వాదించడం మాత్రమే మా లక్ష్యాలు. ఎవరికైనా పద్యమంటే ద్వేషమో, అసహ్యమో ఉంటే వారి అభిప్రాయాన్ని మేము గౌరవిస్తాం. వారిక్కడకి రావలసిన అవసరం లేదని మర్యాదగా విజ్ఞప్తి చేస్తాం. పద్యం గురించి తెలియని వాళ్ళు, దాని గురించి తెలుసుకోవాలనుకునే వాళ్ళు, ఇక్కడున్న పద్య సాహిత్యాన్ని రుచిచూసి రావాలనిపిస్తే మళ్ళీ రావచ్చు. మళ్ళీ మళ్ళీ రావచ్చు.
ప్రస్తుతానికి ఈ సైటులోని విభాగాలు ఇవి:
1. ఛందః మంజూష – ఇది ఛందస్సు గురించిన సమాచార సమాహారం. పైన చెప్పినట్లు, ప్రాథమిక సమాచారానికి ఇక్కడనుంచి వికీకి లంకెలుంటాయి. ఛందస్సు గురించిన ప్రత్యేక విషయాలేమైనా వ్యాసాల రూపంలో ఇక్కడుంటాయి.
2. పద్య మంజూష - పద్య సాహిత్య సమాహారం. కాపీరైటులేని ప్రాచీన ఆధునిక పద్య కవిత్వం ఇక్కడ చదవవచ్చు.
3. వ్యాస మంజూష - పద్య సాహిత్యం గురించిన పరిచయ, సమీక్ష, విమర్శ వ్యాసాల సమాహారం ఇది.
4. పద్యాలతో కసరత్తు – అంతర్జాలంలో పద్యకవులు పాల్గొనేలా రెండువారాల కొకసారి ఒక సమస్యాపూరణమో, దత్తపదో, వర్ణనో, అనువాదమో ఇస్తాము. ఔత్సాహికులు తమ రచనలని ఇక్కడ వ్యాఖ్యలుగా పెట్టవచ్చు, లేదా మాకు పంపవచ్చు. మాకు వచ్చిన రచనలని కూడా గడువు ముగిసాక ఇక్కడ వ్యాఖ్యల రూపంలో ప్రచురిస్తాము.
పైవన్నీ బ్లాగు టపాల రూపంలో ఉంటాయి. ఇవి కాక ఈ సైటులో ఉండే మరో రెండు అంశాలు:
1. బ్లాగు మంజూష – ఇది పద్య సంబంధి బ్లాగుల సమాహారం.
2. చర్చా వేదిక - ఈ సైటు గురించి కాని, ఛందస్సు గురించి కాని, పద్యాల గురించి కాని పాఠకులు చర్చించేందుకు ఇది వేదిక.
ఈ ప్రయత్నంలో మరి మీరు చెయ్యగల సహాయం ఏమిటీ అన్న ప్రశ్న ఇప్పటికే మీకు వచ్చి ఉంటుంది! ఇదిగో అది ఇదే:
- ఈ సైటుద్వారా మీరు కాస్తో కూస్తో జ్ఞానం ఆనందం పొందడం – ఇది మీరు చెయ్యగల అతి తేలికైన, అతి పెద్దదైన సహాయం

- మీకు తెలిసిన పద్యప్రియులకి ఈ సైటుగురించి పరిచయం చెయ్యడం.
- ఈ సైటుని అభివృద్ధి చెయ్యడానికి మీ సలహాలూ, సూచనలూ ఇవ్వడం. (అన్నీ అమలుచేస్తామన్న గేరంటీ లేదనుకోండి)

- అంతర్జాలంలో పద్యాలకి సంబంధించిన సమాచారం, విషయ సామగ్రి ఎక్కడైనా ఉంటే దాన్ని మా దృష్టికి తీసుకురావడం.
- పద్యసాహిత్యాన్ని యూనీకోడీకరించడంలో వాలంటీర్లుగా మీ సేవనందించడం.
- పద్యసాహిత్యం గురించిన వ్యాసాలు, మీవి కాని ఇతరులవి కాని, మాకు ఈమైలు ద్వారా పంపితే మేము పరిశీలించి ఇక్కడ ప్రచురిస్తాం. వీటికి ఎలాటి కాపీరైటు సమస్యా లేకుండా చూసుకోవలసిన బాధ్యత మీదే. వేరే ఈ-పత్రికలలో ప్రచురితమైన వ్యాసాలకి లంకెలు కూడా పంపవచ్చు. ఇక్కడ ఆ లంకెలు ప్రచురిస్తాం.
- కాపీరైటు లేని పద్యసాహిత్యం మీదగ్గర ఉంటే, మీరు దాన్ని యూనీకోడీకరించి మాకు పంపగలిగితే వాటిని ఇక్కడ ప్రచురిస్తాం.
ఇదండీ సంగతి! మేము చెప్పాల్సింది చెప్పాం, ఆపైన మీ యిష్టం! ![]()
- పద్యం.నెట్ నిర్వాహకులు

దేశభక్తుడు అల్లూరి సీతారామరాజు గారి 114వ జయంతి(4-7-07) సందర్భముగా…
ఇటీవల నా నోట చదువుల తల్లి పలికించిన పద్యములివి.
దోషములేవైనా ఉంటే…అవి నావిగా భావించగలరు
———
*** ఏ సీమ ఘనతరంబగు (/ బుగ)
వాసి గడించెను ( / నొ) – యతుల నివాసమటంచున్
ఆ సీమను జనియించుట
కు సురలు వాంఛింతురు మనకును పోటీగా
సీమ = నేల /దేశము
వాసి= పేరు
సురలు ~ దేవతలు
యతులు ~ ‘భౌతిక వాసనలకు దూరంగా ఉండువారు – మనస్సును జయించినవారూ అనే
అర్థంలో
—————————–
భావము –>
మహా సాధువులకు నివాస స్థానమని పేరుగడించిన నేలపై (భారత
దేశములో) జన్మించవలెనని
దేవతలు సైతము కోరుకుంటారు….”మనకు” పొటీగా
ఎందుకంటే… స్వర్గము కన్న ఉన్నతమైన “విష్ణులోకమునకు” చేరాలంటే …భారత
దేశములో పుట్టి మంచిపనులు చేయటమొక్కటే మార్గము కనుక…
******************************************************************************
*** కందమున పద్యముల నా
నందముగా వ్రాసితిగద – నందకుమారున్
మదిని తలచుచు కొలుచుచు;
మేదిని చదివే జనులు రమేశుని పొందున్
నాల్గవ పాదమును ఇలా కూడ చదువుకోవచ్చు –>
ముదమున చదివే జనులును ముక్తిని పొందున్
————————–
భావము–>
నందకుమారుడైన హరిని నా మదిలో స్మరిస్తూ,పూజిస్తూ ఆనందముతో ‘కంద పద్యములను
‘వ్రాసితిని కదా.వాటిని చదివినవారు హరిని (ముక్తిని) పొందుతారు
ముదమున = సంతోషముతో
రమేశుడు= హరి
మేదిని = భూమి
*************
*** తెనుగుతనము ఒప్పారున్
వినువీధిని దేవతలును విస్మయమందన్
అనుచున్ ఎక్కడనో చది
విన హరి తానా సభలకు విజయము చేసెన్
——————————————————————————————————————
విస్మయమందన్ ‘బదులు ‘విస్మయమొందెన్ ‘
‘హరి ‘ బదులు ‘గిరి ‘
‘ విజయము చేసెన్ ‘ బదులు ‘ విసురున వెళ్ళెన్ / విసురున వెడలెన్ ‘ అని
వ్రాయవచ్చు.
‘భళిరా ‘ బదులు ‘వినురా / కనరా / వినరా / అనుజా’ అని వ్రాయవచ్చు
‘ఎక్కడో ‘ బదులు ‘ పత్రికలో ‘ అని వ్రాయవచ్చు
****************************************
చివరి పాదము ఇలా కూడా ఉండవచ్చుననుకుంటా :
‘ వెను హరి తానా సభలకు వెడలెను భళిరా ! ‘
——————————————————–
‘ఒప్పారున్ ‘ బదులు ‘నొప్పారున్ ‘వ్రాయవచ్చుననుకుంటా
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
భావము : ఉత్తర అమెరికా ఖండమందు గల తెలుగు సమితి ‘తానా’ ( తెలుగు
అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా )
వార్షిక సభలు ఎంతో వైభవముగా జరుగుతున్నాయి…ఆకాశమునుండి చూస్తున్న
దేవతలు కూడా ‘ తెలుగు భాష గొప్పతనానికి ‘ ఆశ్చర్య పోతున్నారు /
పోయేవిధంగా ‘ అని ఎక్కడో / పత్రికలో ‘హరి / గిరి ‘ అనే వ్యక్తి
చదివినాడు .
అతను కూడా “తానా” సభలకు వెళ్ళినాడు ….వినుమురా/చూడరా తమ్ముడా !!!
ఇక్కడ విశేషమేమంటే
” తానా సభలకు ” అన్నదానిని ….రెండు అర్థాలతో చదువుకోవచ్చు:
” తాను ఆ సభలకు ”
లేక
” తానా సభలకు–>తానా వారి యొక్క సభలకు”
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
విసురున వెళ్ళెన్ అని ఉపయోగించటములో నా అభిప్రాయము : – హరి అను వ్యక్తికి
‘ సభలు జరుగుతున్న విషయము తెలియగానే …తొందరగా పోనిచో –>తాను ఏదో
కోల్పోతాననే ఆలోచనతో ……వెంటనే …..ఆలస్యం చేయకుండా….వెళ్ళెను ‘
~~~~
శ్రీ రామానుగ్రహ విశేషమున నాకు తెలిసినంతవరకు ‘ఆటవెలది ‘ ఛందస్సులో ‘ ఒక పద్యము కూర్చితి
రామకథను రమ్యకావ్యముగ రచన
జేసె ఋషివరుండు- జీవ కోటి
ముదమునంద; కోరి చదువుమోయి
నీదు జీవితము వినీతమగును
ముదము= ఆనందము , సంతోషము
అయణము = మార్గము
రాముని యొక్క అయణము = రామాయణము = రాముడు నడచిన /
ఆచరించిన మార్గము/ పద్ధతి
నీదు = నీ యొక్క
భావము -
రామాయణ గాథను ‘వాల్మీకి ‘ ఋషి సమస్త జీవకోటి సంతోషపడునట్లు రచించెను. దానిని కోరి ( ఇష్టముతో ) చదవండి. మీ జీవితము/ జీవనము పరిశుద్ధమగును
~~~~
ఇటీవల చదువుల తల్లి నా నోట పలికించిన పద్యము(?)లివి. దోషములున్నచో అవి నావిగా భావించవలెను.
గుంటూరుకు పోదలచిన
పెంటయ్యెక్కెన్ బండిని, పెంపుడు కొడుకున్
వెంటనిడుకొనుచు; తన సం
కటములు బాపమని మొక్కె కరివరదునకున్
4 వ పాదములో ‘ కరివరదునకున్ ‘ బదులు ‘ కమలాంబికకున్ ‘ ,
‘ బాపమని ‘ బదులు ‘తీర్చమని ‘ అని వ్రాయవచ్చు అనుకు౦టా
కరి = ఏనుగు
కరి వరదుడు = గజేంద్ర మోక్షము కథలో ఏనుగును రక్షించినవాడు = విష్ణువు
బాపమని = తొలగించమని
.
సందర్భము & భావము –
పెంటయ్య అనువ్యక్తి వివిధ కారణాల వల్ల కొన్ని కష్టాలకు లోనయ్యెను. తాను ప్రస్తుతముంటున్న గ్రామములో ఉండలేక… పనికోసం గుంటూరుకు పోదలచి …తన
పెంపుడు కొడుకుతో సహా…గుంటూరుకు వెళ్ళే ( ఎడ్ల / రైలు ) బండి ఎక్కుతూ …ఇకనైనా తన కష్టాలు తొలగించమని విష్ణు దేవుణ్ణి ప్రార్ధించెను .
———————————————
భరతుని ఆదర్శముగా
గిరి యెంచుకొనె ;నటుపై హరియెడల నిజ సో
దర భావముతో మెలిగెనుర ;
భరతుని కథచెప్పిన శరభయ్య ముదమొందెన్
2 వ పాదమును క్రింద సూచించినట్లు వ్రాసుకోవచ్చు–
గిరి యెంచుకొనె నటుపై హరియెడల తానా
( లేదా)
గిరి యెంచుకొనె నటుపై హరియెడల దానా
4వ పాదమును క్రింద సూచించినట్లు వ్రాసుకోవచ్చు–
భరతుని చరితను తెలిపిన భట్టు ముదమొందెన్
సందర్భము & భావము —గిరి ,హరి అను వారు వరుసకు అన్నదమ్ములు.(అక్కచెల్లెల్ల కొడుకులు / హరి ,గిరి అనువారు వరుసకు అన్నదమ్ములు అని
కాకుండా…మిత్రులు అని అనుకోవచ్చు). హరి గిరి యెడల మంచిగా మెలిగేవాడు కానీ గిరి మాత్రం కొంత భిన్నముగా ప్రవర్తించేవాడు. ఈ పరిస్థితిని గమనించిన
శరభయ్య (లేదా…భట్టు ) అనే పక్కింటాయన ఒకనాడు గిరిని దగ్గ కూర్చుండబెట్టుకొని …రామాయణంలోని వివిధ ఆదర్శ పాత్రలను( భరతుని వృత్తాంతముతో సహా…)
గూర్చి తెలిపెను. అది వింటూనే ..గిరి తానింతవరకూ హరితో మంచిగా మెలగనందుకు బాధపడెను.తన జీవితానికి భరతుని ఆదర్శముగా ఎంచుకొనెను. అప్పటి నుండి
హరితో సొంత అన్న/తమ్మునివలె (సోదరునివలె) ప్రవర్తించెను.అది చూసి కథ చెప్పిన వ్యక్తి సంతోషించెను..(–భారతీయులందరూ ఇలా ఐకమత్యముతో మెలగాలన్న కోరిక ప్రబలము
నమస్కారము ,
అంతర్జాలంలో యునికోడు తెలుగును వాడుట ద్వారా యునికోడు ఫలాలను ,ఉచితము గా అందిచుటలో మీరు చూపిన చొరవకు , కృషికి అభినందనలు. e-తెలుగు అన్నది కంప్యూటర్లలో మరియు అంతర్జాలంలో తెలుగుని వ్యాపింపజేయాలనే ధ్యేయంతో స్థాపించబడిన లాభాపేక్షలేని సంస్థ. తెలుగువారు తన అవసరాలకి కంప్యూటర్లను, అంతర్జాలాన్ని ( ఇంటర్ నెట్ ) వాడుకోగలగాలి అన్నది e-తెలుగు స్వప్నం. ఆ దిశగా e-తెలుగు కృషిచేస్తోంది ఈ కృషి లో భాగముగా మేము హైదరాబాద్ లో జరుగు హైదరాబాద్ బుక్‌ఫెయిర్ 2009 డిసెంబరు 17 న నుండి 27 వరకు e-తెలుగు స్టాలు నిర్వహించ తలపెట్టాము , స్టాలుకు వచినవారికి ఒక కరపత్రము ఉచితముగా ఇవ్వటం జరుగుతుంది, అందులో మీయొక్క వెబ్ పేరును http://padyam.net కూడా చేర్చి వున్నాము , సమయాభావము వలన కొన్ని సాంకేతిక కారణముల వలన మీ వద్దనుండి వాతపూర్వకమైన ముందస్తు అనుమతి లేకుండా కరపత్రము ప్రచురిండటం జరిగినది , నా తప్పిద్దాన్ని మన్నిస్తారని ఆశిస్తున్నాను.
e-తెలుగు కార్యకలాపలలో , మా స్వప్న సాకారములో మీరు సహాయ సహకారములు అందిచ వలసినదిగా కోరుతున్నాను .
మీ శ్రేయోబిలాషి
కశ్యప్
కార్యదర్శి – e-తెలుగు
93965533666
kasyap.p@gmail.com